– సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌ను నిరసిస్తూ మానవహారాలు
– ట్యాంక్‌బండ్‌పై అంబేద్కర్‌ విగ్రహం ఎదుట ప్రతిజ్ఞ

నారాయణగూడ: ”భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం” అంటూ ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ పీఠికను చదివారు. పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌ను నిరసిస్తూ.. మానవహారాలు నిర్మించారు. ప్రదర్శనలు చేపట్టారు. సదస్సులు నిర్వహించారు.రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌పై డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహం ఎదుట ”రాజ్యాంగాన్ని కాపాడుకుందాం” నినాదంతో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అనంతరం భారత రాజ్యాంగం పీఠికను తెలంగాణ జన సమితి అధ్యక్షులు, ప్రొఫెసర్‌ కోదండరామ్‌ చదివి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.గోవర్ధన్‌, రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటురంగారావు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నరసింహారావు, పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్‌ వి.సంధ్య, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్‌ మూర్తి, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు ఎం.పరశురాం, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి శివరామకష్ణ, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌, నాయకురాలు అరుణ, పద్మ, అనురాధ, టీజెఎస్‌ నగర కన్వీనర్‌ నర్సయ్య, విద్యార్థి విభాగం నాయకులు సలీం పాషా, గణేష్‌, నాగరాజు, లోకేష్‌, పీడీఎస్‌యూ నగర నాయకులు నాగేశ్వరరావు, అనిల్‌, శ్యామ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం నగరంలో మహిళలు ప్రదర్శన నిర్వహించారు.

షాదీఖానా వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం వైరా రోడ్డు మీదుగా ప్రదర్శనగా ధర్నాచౌక్‌కు చేరుకున్నారు. సీఏఏ, ఎన్‌ఆర్సీ, ఎన్‌పీఆర్‌లను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ధర్మసాగర్‌ మినీట్యాంక్‌బండ్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహం ఎదుట రాజ్యాంగపఠనం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో విగ్రహం ఎదుట రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు.

మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై మానవహారం నిర్మించారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని పూలాంగ్‌ అంబేద్కర్‌ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి రాజ్యాంగ పరిరక్షణ కోసం, లౌకికవాదాన్ని కాపాడటం కోసం ప్రజలందరూ ఐక్యంగా పోరాడాలని నినాదాలు చేశారు. మానవహారంగా ఏర్పడ్డారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో ప్రతిజ్ఞ చేశారు.రాజ్యాంగం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ఒక్కతాటిపైకి రావాలని సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఎం.చుక్కయ్య పిలుపునిచ్చారు. వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా హన్మకొండలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు.

Courtesy Nava telangana