చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నై సీఏఏ వ్యతిరేక నిరసన ర్యాలీతో దద్దరిల్లింది. వివాదాస్పద చట్టానికి వ్యతిరేకంగా దాదాపు ఐదువేల మందికి పైగా నిరసనకారులు మెరీనా బీచ్‌ వద్ద ప్రదర్శనలు చేపట్టారు. ఈ నిరసనలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు సైతం పాల్గొని వివాదాస్పద చట్టంపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ప్రమాదకర కరోనా వైరస్‌పై ప్రభుత్వ సూచనలు ఉన్నప్పటికీ వాటిని సైతం లెక్క చేయకుండా ఆందోళనకారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం గమనార్హం. మెరీనా బీచ్‌ దగ్గర చెపాక్‌ ప్రాంతంలో నిరసనకారులు భారీ సంఖ్యలో గుమిగూడారు. వివాదాస్పద సీఏఏను వెనక్కి తీసుకోవాలనీ, ఈచట్టంతో పాటు ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో తీర్మానాన్ని తీసుకురావాలని నిరసనకారులు డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును తప్పుబట్టారు. తమిళనాడు తోవ్‌హీత్‌ జమాత్‌(టీఎన్‌టీజే) గ్రూపునకు చెందిన పలువురు సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ ఇలాంటి నిరసనలే చేపట్టారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శించారు. నినాదాలతో హోరెత్తించారు. కరోనా వైరస్‌ దేశంలో ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంటే.. వివాదాస్పద చట్టం కారణంగా దేశంలో 80 మంది చనిపోయారని నిరసనకారులు అన్నారు. కాగా, నిరసనకారులు తమ ఆందోళనలను వాయిదా వేసుకోవాలని డీఎంకే చీఫ్‌ ఎం.కె స్టాలిన్‌, ఎంఎన్‌ఎం అధ్యక్షులు కమల్‌ హాసన్‌లు కోరారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తమిళనాడులో పాక్షిక లాక్‌డౌన్‌ కొనసాగు తున్నది. స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు, మాల్స్‌, హోటల్స్‌, రిసార్ట్స్‌ వంటివి ఈనెల 31 వరకూ మూతపడే ఉండనున్నాయి.చెన్నై ‘షాహీన్‌బాగ్‌’కు తాత్కాలిక బ్రేక్‌ దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో చెన్నైలోని ‘షాహీన్‌బాగ్‌’ నిరసనలకు తాత్కాలిక బ్రేక్‌ పడింది. ఈ మేరకు బుధవారం ఉదయం 1 గంటలకు నిరసనలను నిలిపివేస్తున్నట్టు సమావేశం అనంతరం కమిటీ సభ్యులు వెల్లడించారు. ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌ ప్రేరణతో సీఏఏకు వ్యతిరేకంగా చెన్నైలోని వాషర్మెన్‌పేట్‌లో దాదాపు నెలకు పైగా నిరసనకారులు ఆందోళనలు చేస్తున్నారు. ముస్లిం మహిళలు ప్రతిరోజూ ఇక్కడ నిరసనల్లో పాల్గొంటున్నారు. అయితే కరోనాపై ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు జారీ చేశాయి. ఈనేపథ్యంలో ప్రభుత్వం, మతసంస్థల నాయకుల అభ్యర్థన మేరకు నిరసనకారులు తమ ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేశారు.

షాహీన్‌బాగ్‌ ముగింపునకు..
నిరసనకారులతో పలు దఫాలు చర్చలు జరిపాం : రాజ్యసభలో కేంద్రం
షాహీన్‌బాగ్‌లో కొనసాగుతున్న ఆందోళనకు ముగింపు పలకడం కోసం నిరసనకారులతో ఢిల్లీ పోలీసులు పలు సమావేశాలు జరిపినట్టు కేంద్రం వెల్లడించింది. ఇందుకోసం వివిధ స్థాయిల్లో చర్చలు జరిపినట్టు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి రాజ్యసభలో వెల్లడించారు. షాహీన్‌బాగ్‌ ఆందోళనలతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు ముగింపు పలకడం కోసం నిరసనకారులతో కేంద్రం ఏమైనా చర్చలు జరిపిందా? అని టీఎంసీ ఎంపీ శాంత ఛెత్రి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి పై విధంగా స్పందించారు. శాంతి భద్రతలను నియంత్రణలో ఉంచడం సంబంధిత రాష్ట్రాల ప్రాథమిక బాధ్యత అని ఆయన చెప్పారు.

పదిశాతం అదనంగా నష్టపరిహారాన్ని చెల్లించండి
13 మందికి యూపీ తాజా నోటీసులు
లక్నో : సీఏఏ వ్యతిరేక నిరసనకారులపై యోగి సర్కారు ప్రతీకారపూరిత చర్యలు ఆగడం లేదు. సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులకు నష్టం కలిగించినందుకు అదనంగా పరిహారం చెల్లించాలని 13 మందికి యూపీ సర్కారు తాజా నోటీసులు జారీ చేసింది. పరిహారాన్ని చెల్లించకపోతే జైలు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ప్రభుత్వాస్తులకు నష్టం కలిగించారని పేర్కొంటూ 57 మంది పేర్లు, వారి పూర్తి వివరాలతో యోగి సర్కారు హోర్డింగులు ఏర్పాటు చేసిన విషయం విదితమే. అయితే తాజా నోటీసులు అందిన ఆ 13 మంది ఈ జాబితాలోని వారే. పది శాతం అదనంగా.. అంటే రూ. 21.67 లక్షల మొత్తాన్ని వారంలోగా చెల్లించాలనీ లక్నో జిల్లా యంత్రాంగం వారికి జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నది. నష్టపరిహారాన్ని చెల్లించలేకపోతే ఆ 13 మంది జైలు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందనీ, వారి ఆస్తులను అటాచ్‌ చేస్తామని లక్నో జిల్లా యంత్రాంగం తెలిపింది.

Courtesy Nava Telangana