నష్టాలను పూడ్చుకునేందుకు భూముల అమ్మకం
విలువైన వాటిని కారుచౌకగా అప్పగిస్తున్న వైనం
చెన్నై : భారత ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ భారత్‌ సంచార్‌ నిగామ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌)లో భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మార్కెట్లో ఇప్పటికే జియో, ఇతర ప్రయివేటు నెట్‌వర్క్‌ల పోటీలో నిలబడలేక నష్టాల బారిన పడ్డ బీఎస్‌ఎన్‌ఎల్‌కు తాజా కుంభకోణంతో వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లనుంది. నష్టాలను పూడ్చుకోవడానికి సంస్థకు దేశవ్యాప్తంగా ఉన్న విలువైన భూములను అమ్మాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ నిర్ణయించింది. దీనిద్వారా వచ్చిన నిధులతో సంస్థ రుణభారం తీర్చాలని ప్రతిపాదించింది. కానీ కోట్లాది రూపాయలు విలువైన ఈ భూములను కారుచౌకగా సర్కారు కార్పొరేట్లకు అప్పగిస్తున్నది. ఈ మేర కు చెన్నైలోని 8ప్రాంతాల్లో ఉన్న భూములను నామమాత్రపు ధరలకే అమ్ముతుండటం గమనార్హం. దీనిపై బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌ఈయూ) తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నది. బీఎస్‌ఎన్‌ఎల్‌ఈయూ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా ప్రధాన పట్టణాలు, మెట్రో నగరాల్లో తనకున్న 63స్థలాలను అమ్మాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ నిర్ణయిం చింది. ఇందులో భాగంగానే చెన్నైలో 8 చోట్ల ఉన్న విలువైన భూములను అమ్మనున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం ఆ భూముల విలువ రూ. 3,867.89 కోట్లు కాగా బీఎస్‌ఎన్‌ఎల్‌ నిర్ధారించిన రేటు రూ. 2,753.67 కోట్లు. కానీ వీటిని మాత్రం కేవలం రూ. 1262.89 కోట్లకే ప్రయివేటు వ్యక్తులకు కేంద్రం కట్టబెట్టేందుకు సిద్ధమైంది. అంతేగాక తిరువనంతపురంలోని కైమన్నమ్‌లో ఉన్న పది ఎకరాల భూమిని కూడా మార్కెట్‌ రేట్‌ కంటే అతి తక్కువ ధరకు అమ్మకానికి పెట్టారు. దేశవ్యాప్తంగా (63 చోట్ల) చూసుకుంటే కార్పొరేట్లకు కట్టబెట్టిన రేట్లకే సంస్థ భూములను అమ్మితే బీఎస్‌ఎన్‌ఎల్‌కు వచ్చేది మొత్తంగా రూ. 20,210 మాత్రమే. వాస్తవంగా మార్కెట్‌ రేటు ప్రకారం అమ్మితే ఇంతకంటే ఎన్నో ఎక్కువ రెట్లు వస్తుందని కార్మిక సంఘాలు ఆరోపి స్తున్నాయి. భూములను కార్పొరేట్లకు అప్పగించేందుకే కేంద్ర సర్కారు వీటిని తక్కువ విలువకే అమ్ముతున్నదని వారు ఆరోపిస్తున్నారు. ఇది సంస్థను లూటీ చేయడమేనని వారు విమర్శిస్తున్నారు. దీనిపై జోక్యం చేసుకోవాలని టెలికాం సెక్రెటరీకి ఇప్పటికే లేఖ రాశామని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈయూ నాయకులు చెబుతున్నారు. నిందితులపై తగు చర్యలు తీసుకోక పోతే ఆందోళన కార్యక్రమాలకు దిగుతామని వారు హెచ్చరిస్తున్నారు.

క్ర.సం. ప్రాంతం ఏరియాఇన్‌ ప్రస్తుత విలువ మొత్తం విలువ
స్క్వేయర్‌ మీటర్స్‌ (రూ. కోట్లలో) (రూ. కోట్లలో)
1. వైసర్‌నగర్‌ 1,20,283 3 1,617.84
2. ఎన్నూర్‌ 1,24,198 1 556.84
3. టైలర్స్‌ రోడ్‌ 16,837 6 452.88
4. రొయపెట్టా 21,181 5 474.8
5 ఎన్‌ఎస్‌సీ టీఈ 6,872 8 246.84
6. ఎగ్మూర్‌ 6,801 6 182.94
7. డిన్రోస్‌ టే 7,000 8 251.04
8. అంబత్తూర్‌ 18,976 1 85.07

Courtesy Navatelangana..