– విపత్తు సమయంలోనూ ‘అవినీతి’ కంపు :
– బీజేపీ హిమాచల్‌ప్రదేశ్‌ అధ్యక్షుడు రాజీనామా

సిమ్లా : ఒకవైపు కరోనాతో దేశం అల్లాడుతుంటే ఇటువంటి విపత్కర పరిస్థితులను కూడా వినియోగించుకొని డబ్బు సంపాదించేందుకు బీజేపీ నేతలు అర్రులు చాస్తున్నారు. కరోనా సంబంధిత వైద్య పరికరాల కొనుగోలులో చేతివాటం ప్రదర్శించడం సిగ్గుచేటు. ఇది ఆఖరుకు ఆ పార్టీ హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్‌ బృందాల్‌ రాజీనామాకు దారి తీసింది. గుజరాత్‌లో వెంటిలేటర్ల కొనుగోలు అక్రమాల బాగోతం కొనసాగుతుండగానే హిమాచల్‌లో కుంభకోణం వెలుగులోకి రావడం గమనార్హం.

వైద్య పరికరాల కొనుగోల్‌మాల్‌
హిమాచల్‌ ప్రదేశ్‌లో కరోనా సంబంధింత వైద్య పరికరాల కొనుగోలు విషయంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు బీజేపీ శాఖ అధ్యక్షుడు రాజీవ్‌ బృందాల్‌ బుధవారం ప్రకటించారు. ఆయన రాజీనామా రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని మరింత చిక్కుల్లోకి నెట్టింది. హిమాచల్‌ ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకుర్‌ మాట్లాడుతూ ప్రతిపక్షం కావాలనే విషయాన్ని పెద్దది చేసి చూపుతున్నదని విమర్శించారు.

అవినీతిని రట్టు చేసిన ఆడియో క్లిప్‌
ఒక ఆడియో క్లిప్‌ ఆధారంగా జరిగిన విచారణ ద్వారా విజిలెన్స్‌ మరియు అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆరోగ్య సేవల డైరెక్టర్‌ డాక్టర్‌ ఎకె గుప్తాను ఈ నెల 20న అరెస్టు చేశారు. ఇది జరిగిన వారం తర్వాత తాజాగా బృందాల్‌ రాజీనామా చేయడం గమనార్హం. రూ.5 లక్షలను అందించే విషయంపై ఇద్దరు వ్యక్తులు చర్చించుకున్నట్టు ఆ 43 సెకండ్ల ఆడియో క్లిప్‌లో ఉంది. ‘మీ గూడ్స్‌ తెస్తున్నాను’ అని ఒక వ్యక్తి అనగా ‘ఓకే తీసుకురా.. అవి ఎంత అవుతాయి?’ అని మరో వ్యక్తి అన్నారు. ‘మీరే చెప్పారు కదా రూ.5 లక్షలు అని’ అని మొదటి వ్యక్తి అనగా,, ‘ఓకే తీసుకురా’ అని రెండో వ్యక్తి సమాధానం ఇవ్వడం క్లిప్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఈ క్లిప్పును ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి రజనీ పాటిల్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆడియో క్లిప్పులో లంచం ఇవ్వజూపిన వ్యక్తి అధికార పార్టీకి చెందిన నాయకుడే అని ఆయన ఆరోపించారు. కరోనా నేపథ్యంలో వస్తున్న ఈ అవినీతి ఆరోపణలను చూసి సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోందని బీజేపీ మాజీ సీఎం శాంతకుమార్‌ వ్యాఖ్యానించారు.

ఫొరెన్సిక్‌ ల్యాబ్‌కు ఆడియో క్లిప్పులు
కోవిడ్‌ వైరస్‌ చికిత్సకు అవసరమైన వివిధ రకాల మందులు, కిట్ల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారంలో అవినీతి చోటుచేసుకున్నమాట వాస్తవమేనని అధికారులు ధ్రువీకరించారు. ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం కీలక ఆధారాలు సేకరించింది. బృందంలో ఒకరైన ఎస్‌పి షాలిని అగ్నిహోత్రి ‘ద ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఫిబ్రవరి నుంచి జరిగిన వివిధ వైద్య పరికరాలు, మందుల కొనుగోళ్లులో అవినీతి కోణంలో దర్యాప్తు సాగుతున్నదని, అనేక మంది సరఫరా దారులకు, కొందరు రాష్ట్రేతర సరఫరాదారులకు ఇందులో ప్రమేయముందని తెలిపారు. ఈ కుంభకోణంలో కీలకమైన గుప్తాను కొన్ని గంటలపాటు ప్రశ్నించిన తర్వాత అదుపులోకి తీసుకున్నామని ఏడీజీ అనురాగ్‌ గార్గ్‌ తెలిపారు. పొంతన లేని సమాధానాలివ్వడంతో అరెస్టు చేశామన్నారు.

పీఎం కేర్స్‌ నిధులతో వెంటిలేటర్ల బాగోతం
గుజరాత్‌లో ఇదివరకే వెంటిలేటర్ల కొనుగోలుకు సంబంధించి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం రాజ్‌కోట్‌కు చెందిన జ్యోతి సీఎన్‌సీ ఆటోమేషన్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ నుంచి 5000 వెంటిలేటర్లు కొనుగోలు చేసింది. ఈ కంపెనీ నుంచి ప్రధాని మోడీ నేతృత్వంలోని పీఎం కేర్స్‌ ఫండ్‌ నిధులతో ప్రభుత్వ ఆధ్వర్యంలోని హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌ కేర్‌ సంస్థ ద్వారా కొనుగోలు చేశారు. సదరు కంపెనీ ప్రస్తుత, మాజీ ప్రమోటర్లకు బీజేపీ నేతలతో చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ కంపెనీ చైర్మెన్‌, మేనెజింగ్‌ డైరెక్టరు పరాక్రమ సింహ జడేజా గుజరాత్‌ ముఖ్యమంత్రి విజరు రూపానికి చాలా సన్నిహితుడు కావడం గమనార్హం. అహ్మదాబాద్‌లో అతిపెద్ద కోవిడ్‌ ఆస్పత్రికి కూడా ఇదే కంపెనీ బ్రీతింగ్‌ మెషిన్లును సరఫరా చేసింది. అయితే అవన్నీ కూడా చాలా నాసిరకమైనవని, కనీస ప్రామాణికాలను కూడా పాటించలేదని వైద్యులు నిర్ధారించారు.

Courtesy Nava Telangana