ఎల్‌.జి పాలిమర్స్‌ కంపెనీలో జరిగిన ప్రమాదంపై తాజాగా హైకోర్టు ఆర్డర్లు, ప్రభుత్వ నిర్ణయాలు వంటివి చర్చనీయాంశం అయ్యాయి. పరిశ్రమలలో ప్రమాదాల నివారణ ఎలా సాధ్యమనే విషయంపై లోతుగా ఆలోచించేలా ఈ ఘటన చేసింది. ఎల్‌.జి పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజి దుర్ఘటనకు రెండు ప్రధాన కారణాలు కనపడుతున్నాయి. ఒకటి యాజమాన్యం లోపమయితే రెండవది నిఘా సంస్థల వైఫల్యం. యాజమా న్యాన్ని కట్టడి చేయవలసిన ప్రభుత్వ నిఘా సంస్థలు ఆ పని చేయకపోగా తిరిగి యాజమాన్యానికే సహకరిస్తున్న ఉదంతాలే మనకు ఇక్కడ దర్శనమిస్తున్నాయి.

అనుమతులిచ్చే అధికారం కలిగిన కాలుష్య నియంత్రణా మండలి ఎల్‌.జి యాజమాన్యానికి అండగా నిలిచి, ఎటువంటి షరతులు లేకుండా విస్తరణకు కూడా అనుమతులిచ్చేసింది. యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలను పాటించేలా చూసే మరో నిఘా వ్యవస్థ అయిన పరిశ్రమల శాఖ అందులో ఘోరంగా విఫలమైంది. ఈ రెండు సంస్థలు యాజా మాన్యంతో ఎలా కుమ్మక్కయ్యాయనే అంశాలు ఇప్పుడు ఒక్కొక్క టిగా బయటకు వస్తున్నాయి. అలాంటి ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులపై ఇప్పుడు కంటితుడుపుగా ఏమైనా చర్యలు తీసుకున్నా పోయిన ప్రాణాలను మరలా తీసుకు రాలేం కదా!

ఈ నిఘా సంస్థలు తమ పని సక్రమంగా చేయకపోతే, వీటిపై నిఘా ఉంచవలసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనే ప్రశ్న ఇక్కడ సహజంగానే ఉదయిస్తుంది. విశేషమే మిటంటే ఆ ప్రభుత్వాలే ఈ నిఘా సంస్థలను బలహీన పరుస్తున్నాయి. రెండు రకాలుగా ఇది జరుగుతోంది. ఒకటి ఈ సంస్థల అధికారాలను కుదించివేయడం. ఉదాహరణకు మన ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం పరిశ్రమలలో తనిఖీలపై నియంత్రణ విధించింది. దీనితో అధికారులు అటువైపు చూడడమే మానేశారు. ఇక రెండవది చట్టాలను సవరించడం. ఉదాహరణకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫ్యాక్టరీ చట్టంతో సహా అనేక చట్టాలను పూర్తిగా నీరుగార్చేలా సవరణలకు పాల్పడింది. మొత్తంగా చూస్తే, యాజమాన్యాల నిర్లక్ష్యం, దీనిని నివారించడంలో నిఘా సంస్థల లోపం, ఈ రెంటిని కట్టడి చేయవలసిన ప్రభుత్వ ఘోర వైఫల్యం మనకు కళ్లెదుట కనపడుతున్న కఠోర సత్యాలు.

కంచే చేను మేసిన చందంగా ఉంటే ఇక ప్రమాదాలను నియంత్రించడం ఎలా? పర్యవసానంగా ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఏదో హడావిడి చేయడం, ఏవో కంటి తుడుపు చర్యలు తీసుకోవడం, తరువాత షరా మామూలు అన్నది పరిపాటిగా మారింది. ఎప్పుడో ఒకటి పొరపాటున జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ నిరంతరం జరుగుతున్నాయంటే, వీటి నియంత్రణ గురించి ఇప్పుడైనా లోతుగా ఆలోచించవలసిందే. ఎందువల్లనంటే ఈ కాలంలో ఇటువంటి ప్రమాదాల తీవ్రత, విస్తృతి గతం కంటే బాగా పెరిగింది. ఈ ప్రమాదాలకు తోడు తీవ్రమైన కాలుష్యం ఈ పరిశ్రమలు వెదజల్లడంతో పరిసర గ్రామాలలో భూమి, నీరు, గాలి కలుషితం అవుతున్నాయి. మనుషులు కూడా రంగు మారిపోయి నల్లగా మారుతున్నారు.

ఉత్తరాంధ్ర సముద్ర తీరం వెంబడి ఈ కాలుష్య కారక రసాయన, థర్మల్‌ విద్యుత్‌, ఫార్మా పరిశ్రమలు రావడంతో సముద్ర జలాలన్నీ కలుషితమై, ఉత్తరాంధ్రకే ప్రత్యేకమైన, అత్యంత విలువైన మత్స్య సంపద నాశనం అవుతోంది. ఈ కాలుష్యం బారిన పడి కొన్ని గ్రామాల ప్రజలు ‘మమ్మల్ని మా గ్రామం నుండి తరలించెయ్యండి మహాప్రభో!’ అని ఎంత మొర పెట్టుకున్నా, ప్రభుత్వం వారి గొంతును నొక్కెయ్యడానికే ప్రయత్నించింది గాని, కాలుష్యాన్ని నియంత్రించడానికి గాని, వారిని తరలించడానికి గాని ఇసుమంత ప్రయత్నం కూడా చేయలేదు. శ్రీకాకుళం జిల్లాలోని భగవాన్‌ దాస్‌ పేట, విశాఖ జిల్లా లోని తాడి గ్రామ ప్రజల నుండి కూడా ఇదే డిమాండు వచ్చింది. అయితే ప్రభుత్వాలు ఆ ప్రజల గురించి పట్టించుకున్న పాపానే పోలేదు. జాతీయ రహదారికి, సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న అనేక గ్రామాలు నేడు ఈ రసాయన పరిశ్రమల కాలుష్య కోరల్లో చిక్కుకుని ఉన్నాయి. ఈ పరిశ్రమలలో ఎప్పుడైనా ఎటువంటి ప్రమాదమైనా జరగవచ్చు. అప్పుడు మళ్ళీ ఇటువంటి హడావిడే చేసి ప్రభుత్వాలు చేతులు దులిపేసుకుంటే సాధించిం దేమీ ఉండదు ప్రజల ప్రాణాలు పోవడం తప్ప. అందువల్ల నిజంగా ప్రభుత్వాలకు, యాజమాన్యాలకు చిత్తశుద్ధి ఉంటే, వారు చేస్తున్న తప్పులను సరిచేసే యంత్రాంగాన్ని, సంస్థలను నాశనం చేయడం కాకుండా వాటిని అర్థం చేసుకునే పని చేయాలి.

ఇలా ప్రభుత్వాలు, యంత్రాంగం విఫలం అవుతున్నప్పుడు దీనిని నివారించగలిగిన శక్తి, పొరపాట్లను సరిచేయగలిగే యుక్తి, బాధ్యత కలిగిన ట్రేడ్‌ యూనియన్లకు మాత్రమే సాధ్యపడుతుంది. వాస్తవంగా ఎల్‌.జి పాలిమర్స్‌లో సిఐటియు యూనియన్‌ అదే చేసింది. షట్‌డౌన్‌ చేసి తిరిగి ప్రారంభించేటప్పుడు తీసుకో వలసిన జాగ్రత్తలు యాజమాన్యం తీసుకోకపోతే, వెంటనే వారి దష్టికి తీసుకువెళ్ళేది. నైపుణ్యం కలిగిన పనులలో ఎటువంటి నైపుణ్యం లేని క్యాజువల్‌ కార్మికులతో పని చేయించుకుంటే దాన్ని కూడా వ్యతిరేకించి, యాజమాన్యానికి తెలిపేది. యాజమాన్యం భద్రత విషయంలో ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడినా వారి దృష్టికి తేవడమే కాక, సంబంధిత ప్రభుత్వ అధికారుల దృష్టికి కూడా తీసుకు వెళ్లింది. సిఐటియు యూనియన్‌ 1997 నుండి అంటే దక్షిణ కొరియా ఎల్‌.జి కంపెనీ దీనిని స్వాధీన పరుచుకున్నప్పటి నుండి సుమారు పది సంవత్సరాలు పైగా గుర్తింపు యూనియన్‌గా చాలా బాధ్యతాయుతంగా వ్యవ హరించి, యాజమాన్య తప్పులను సరిచేయడానికి ప్రయత్నిం చింది. అదే యాజమాన్యానికి రుచించలేదు. యూనియన్‌ ప్రధాన నాయకుడుని డిస్మిస్‌ చేసింది. యూనియన్‌ సభ్యులందరికి మూకుమ్మడిగా ఆఫీసర్లుగా ప్రమోషన్లు ఇచ్చి సిఐటియు యూనియన్‌ లేకుండా చేసి, తనకు తాళం వేసే యూనియన్‌ను ప్రోత్సహించింది. దాని ఫలితమేమితో ఇప్పుడు చూస్తున్నాం. బహుళజాతి యాజమాన్యం దేశం ముందు ఇలా దోషిలా నిలబడే అగత్యం వచ్చేది కాదు. ఇలాంటి ఉదంతాలే అనేక చోట్ల మనకు గోచరిస్తాయి.

పైడి భీమవరంలో ఆరు ప్రమాదాలలో 12 మంది కార్మికులు చనిపోయారు. ఒక్క అరబిందో పరిశ్రమలోనే రెండు సంవత్స రాలలో మూడు ప్రమాదాలలో ఆరుగురు మరణించారు. ఇక్కడ కూడా యాజమాన్యం సిఐటియు యూనియన్‌ లేకుండా చేయాలని శత విధాలా ప్రయత్నిస్తూనే ఉంది. విశాఖ జిల్లా ఫార్మా సిటీలో ఐదు సంత్సరాలలో జరిగిన 25 ప్రమాదాలలో 22 మంది చనిపోగా, 74 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక్కడ కూడా సిఐటియు యూనియన్‌ను అడుగు పెట్టనీ యకుండా అన్ని యాజమా న్యాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.

ఈ అవసరమైన గుర్తించే యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం అనే అంశం వచ్చింది. ఒక్క సిఐటియు అనే కాదు. ఎక్కడైనా, ఎన్నడైనా తన స్వంత లాభం చూసుకోకుండా పరిశ్రమ భద్రత, కార్మికుల ప్రయోజనాలు అనే రెండు అంశాలను మిన్నగా ఎంచుకున్న యూనియన్లు వుంటేనే యాజమాన్యాల లోపాలను సరిచేయగలవు. వాస్తవంగా ఈ రెండూ కూడా యాజమాన్యానికే లాభం. అయితే అదేం విచిత్రమో కాని, యాజమాన్యాలు అటువంటి యూనియన్లు చెప్పిన సూచనలను ఖాతరు చేయకుండా చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘించడం, సంబంధిత అధికారులను, చివరికి ప్రభుత్వాలను కూడా మేనేజ్‌ చేయడం వల్లే నేటి ఈ దుస్థితి. నయా ఉదారవాద విధానాల అమలుతో మనుషుల ప్రాణాల కంటే, పెట్టుబడి ప్రయోజనాలకే ప్రభుత్వాలు కూడా నగంగా ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే నిఘా సంస్థలను నిర్వీర్యం చేస్తున్నాయి.

నిజం చెప్పాలంటే, యాజమాన్యాల నిర్లక్షాన్ని ప్రభుత్వ నిఘా సంస్థలు నివారించలేక పోతున్నప్పుడు, ఆ పని చేయగలిగేది బాధ్యత కలిగిన ట్రేడ్‌ యూనియన్లు మాత్రమేననే సత్యాన్ని ఇప్పటికైనా ప్రభుత్వాలు, యాజమాన్యాలు గుర్తెరగడం అవశ్యం. అదే సందర్భంలో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరచి, కార్మిక చట్టాలను నీరుగార్చే సవరణలు కాకుండా, వాటిని మరింత పటిష్ట పరచడం, నిఘా వ్యవస్థలను బలోపేతం చేయడంపై దృష్టి సారించాలి. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పోతాయేమోననే సందేహంతో యాజమాన్యాల తప్పులను సహించడం కాకుండా వాటిని సరిచేసే చర్యలు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే ప్రభుత్వాలకు నిజంగా చిత్తశుద్ధి ఉందని ప్రజలు భావించగలరు.

అజ శర్మ ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి
జి. కోటేశ్వరరావు సిఐటియు విశాఖ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి

Courtesy Prajasakti