– కేంద్ర ఆరోగ్యశాఖ, రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు
– ఇండ్లకు భోజనం అందేలా కేరళ చర్యలంటూ ప్రస్తావించిన కోర్టు

న్యూఢిల్లీ : బడి పిల్లల మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేయగా… పిల్లలకు అందించే ఆహారానికి సంబంధించి సుమోటోగా స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ఆరోగ్య మంత్రికి నోటీసులను పంపింది. ‘కరోనా వైరస్‌ కారణంగా పాఠశాలలు మూసివేయటంతో పిల్లలకు మధ్యాహ్న భోజన సరఫరాపై మేం ఆందోళన చెందుతున్నాం’ అని ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే, న్యాయమూర్తులు జిఆర్‌ గవారు, సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానిం చింది. పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయగా.. పిల్లలకు వారి వారి ఇండ్లకు మధ్యాహ్నం భోజనం అందేలా చర్యలు తీసుకున్న కేరళ రాష్ట్రాన్ని ఉదాహరణగా కోర్టు పేర్కొనటం గమనార్హం. ‘ప్రతిరోజూ పాఠశాలల్లో అందించే మధ్యాహ్నం భోజనం పిల్లలకు పోషకాహారానికి ప్రధాన వనరుగా ఉన్నందున ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటున్నది’ అని కేరళ సీఎం పినరయి విజయన్‌ పాఠశాలలకు సెలవులు ప్రకటించిన సందర్భంగా పేర్కొన్నారు. కాగా, ‘ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మధ్యాహ్న భోజనంపై ఏం చర్యలు తీసుకుంటున్నాయో మేం తెలుసుకోవాలనుకుం టున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసుకు సంబం ధించి సీనియర్‌ న్యాయవాది సంజరు హెగ్డేను అమికస్‌ క్యూరీగా సుప్రీం కోర్టు నియమించింది. దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పాఠశాలలు, కళాశాలతో సహా అన్ని విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే.

Courtesy Nava Telangana