ముగిసిన సీఎల్పీ.. క్యాంపునకు ఎమ్మెల్యేలు
సచిన్‌కు రాహుల్‌, ప్రియాంక బుజ్జగింపులు
నేడు మరోసారి సీఎల్పీ సమావేశం

జైపూర్‌, న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో రాజకీయం రసకందాయంలో పడింది. కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. ఆ తర్వాత తనకు 106 మంది ఎమ్మెల్యేల బలం ఉందని ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ ప్రకటించారు. కానీ, సమావేశానికి 97 మంది ఎమ్మెల్యేలు (చిన్నపార్టీలు, స్వతంత్రులతో కలిపి) మాత్రమే వచ్చినట్లు తెలిసింది! ఇద్దరు మంత్రులు కూడా సమావేశానికి దూరంగా ఉన్నారు. ఇక, ఢిల్లీలో మకాం వేసిన ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ తన వెంట 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రకటించారు. కానీ, ఆయనతో కలిపి 20 మంది మాత్రమే సీఎల్పీకి దూరంగా ఉన్నారు. గెహ్లోత్‌ తన సర్కారును నిలబెట్టుకోవాలంటే 101 మంది ఎమ్మెల్యేల బలం ఉంటే చాలు. దాంతో, ఇరు వర్గాలూ రిసార్టు రాజకీయాలకు తెరలేపాయి. తిరుగుబాటు నేత పైలట్‌, ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యేలతో మంతనాలు కొనసాగుతున్నాయి. కాగా.. మంగళవారం కూడా సీఎల్పీ సమావేశం కానుంది. దీనికి సచిన్‌ పైలట్‌, అతని మద్దతుదారులు హాజరుకావాలని పార్టీ అధిష్ఠానం పెద్దలు లేఖలు రాశారు.

రంగంలోకి ప్రియాంక, రాహుల్‌
సచిన్‌ పైలట్‌ను బుజ్జగించేందుకు రాహుల్‌ గాంధీ, ప్రియాంక సహా పలువురు అగ్రనేతలు రంగంలోకి దిగారు. తిరుగుబాటు చేయవద్దని సూచించారు. పార్టీ స్థాయిలో ఆయన లేవనెత్తే అన్ని సమస్యలనూ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అహ్మద్‌ పటేల్‌, చిదంబరం, కేసీ వేణుగోపాల్‌ తదితరులు కూడా పైలట్‌తో మాట్లాడినట్లు తెలిసింది. పైలట్‌, ఇతర ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌ తలుపులు తెరిచే ఉన్నాయని, ఎప్పుడూ తెరిచే ఉంటాయని సీనియర్‌ నాయకుడు రణదీప్‌ సూర్జేవాలా ప్రకటించారు. అయితే, సర్కారులో కొనసాగడానికి సచిన్‌ పైలట్‌ మూడు డిమాండ్లు పెట్టారని గెహ్లోత్‌ శిబిరం చెబుతోంది. తన వర్గానికి చెందిన నలుగురికి మంత్రి పదవులు ఇవ్వాలని, హోం, ఆర్థిక శాఖలు తన వర్గానికే కట్టబెట్టాలని, పీసీసీ చీఫ్‌ పదవిలో తననే కొనసాగించాలని పైలట్‌ పట్టుబడుతున్నట్లు వివరించింది.

ఏం జరగొచ్చు
గెహ్లోత్‌ ప్రభుత్వానికే రాజస్థాన్‌ సీఎల్పీ మద్దతు తెలిపింది. భేటీ అనంతరం, ఎమ్మెల్యేలందరినీ బస్సుల్లో హోటల్‌కు తరలించారు. మద్దతిచ్చేవారు సహా సీఎల్పీకి 106 మంది వచ్చారని గెహ్లోత్‌ చెప్పారు. ఇదే నిజమైతే, ఆయన ప్రభుత్వానికి ఢోకా ఉండదు. కానీ, రిసార్టు రాజకీయాలతోపాటు సచిన్‌తో బుజ్జగింపులు జరుపుతున్నారు. దాంతో, ఈ లెక్కలు సరికాదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక, సచిన్‌తోపాటు ఢిల్లీకి వెళ్లిన కొంతమంది ఎమ్మెల్యేలు తిరిగి గెహ్లోత్‌ పంచకు చేరినట్లు చెబుతున్నారు. మరికొంత మందిని ఆకర్షించినా ప్రభుత్వానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. అప్పుడు సచిన్‌ పైలట్‌ భవితవ్యం ప్రమాదంలో పడుతుంది. ఇక, సచిన్‌ వెంట నిజంగా 30 మంది ఎమ్మెల్యేలు ఉంటే గెహ్లోత్‌ సర్కారుకు మూడినట్లే. తదుపరి ప్రభుత్వాన్ని ఆయనే నిర్దేశించే అవకాశం ఉంది. సచిన్‌తోపాటు బీఎస్పీ, స్వతంత్రులను కూడా బీజేపీ తమ వైపునకు లాక్కుంటే గెహ్లోత్‌ సర్కారు కొనసాగే అవకాశం లేనట్లే!

కాంగ్రె్‌సకు 114, బీజేపీకి 107 మంది ఎమ్మెల్యేల బలం ఉండడంతో మధ్యప్రదేశ్‌లో అధికార మార్పిడి సులభమైంది. కానీ, రాజస్థాన్‌లో గెహ్లోత్‌దే పైచేయి. తిరుగుబాటుకు ముందు, ఇక్కడ కాంగ్రెస్‌, దానికి మద్దతు ఇచ్చే వారి బలం 123గా ఉంది. బీజేపీకి కేవలం 75 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మధ్యప్రదేశ్‌, కర్ణాటక తరహాలో రాజీనామాలు చేయించాలంటే, 50 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల బలం కావాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది జరిగేలా కనిపించడం లేదు. అయితే.. గెహ్లోత్‌ సర్కారుకు మద్దతు ఇచ్చిన బీటీపీ.. అసెంబ్లీలో బలపరీక్ష జరిగితే ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించింది. గెహ్లోత్‌ సర్కారుకు మద్దతు ఇస్తున్న చిన్న పార్టీలు, స్వతంత్రుల్లో ‘మార్పు’నకు ఇది సంకేతంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, మెజారిటీని అసెంబ్లీలో నిరూపించుకోవాలని, ముఖ్యమంత్రి ఇంట్లో కాదని సచిన్‌ సన్నిహితులు వ్యాఖ్యానించారు. పైలట్‌ బీజేపీలో చేరే అవకాశం లేదని స్పష్టం చేశారు.

గహ్లోత్‌ సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులు
రాజస్థాన్‌కు చెందిన పలు కంపెనీల పన్ను ఎగవేతకు సంబంధించి ఆదాయ పన్ను శాఖ సోమవారం ఢిల్లీ, జైపూర్‌ సహా నాలుగు నగరాల్లో 43 చోట్ల తనిఖీలు చేసింది. వీటిలో కాంగ్రెస్‌ నేతలు రాజీవ్‌ అరోరా, ధర్మేంద్ర రాథోడ్‌ ఇళ్లు, కార్యాలయాలు కూడా ఉన్నాయి. తాజా రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఐటీ దాడులు కలకలం రేపాయి.

Courtesy AndhraJyothy