– బిగ్‌బాస్‌ షోను నిలిపివేయండి
– సమాచార ప్రసారశాఖ మంత్రికి గుజరాత్‌ ఎమ్మెల్యే లేఖ
అహ్మదాబాద్‌ : గత కొన్నేండ్లుగా నడుస్తున్న బాలీవుడ్‌ రియాల్టీ షో ‘బిగ్‌ బాస్‌’ షోను నిలిపివేయాలని గుజరాత్‌ ఎమ్మెల్యే నంద్‌ కిషోర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన సమాచార, ప్రసార శాఖ మంత్రికి లేఖరాశారు. బిగ్‌బాస్‌ 13వ సీజన్‌ కలర్స్‌ చానెల్‌లో రాత్రి 10.30 గంటలకు ప్రసారమవుతున్నది. ఈ షో దేశ సామాజిక నైతికతను దెబ్బతీయటంతోపాటు, అశ్లీలతను వ్యాప్తిచేస్తున్నదని ఆయన ఆరోపించారు. ‘బెడ్‌ ఫ్రెండ్స్‌ ఫరెవర్‌’ కాన్సెప్ట్‌తో షోలో ఇటీవల ఓ టాస్క్‌ ప్రారంభమైంది. ఇది భారతీయ సంస్కృతినీ దెబ్బతీసేవిధంగా ఉందని ఎమ్మెల్యే ఆరోపించారు. ముస్లిం, బ్రాహ్మణ వర్గాలకు చెందిన పోటీదారులను ‘ఉద్దేశపూర్వకంగా’ బెడ్‌ ఫ్రెండ్స్‌గా జతచేయడం ద్వారా మత విభేదాలకు కారణమవుతున్నదని విమర్శించారు. జాతీయ మీడియా వేదికగా హిందూ సంప్రదాయాలు అవహేళనకు గురవుతున్నాయని విమర్శించారు. టీవీ షోలపై కఠినమైన సెన్సార్‌షిప్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు.

Courtesy Navatelangana