పినపాక/ కూసుమంచి/మద్నూర్‌/పరిగి : సొంత గ్రామానికి వెళ్లడానికి వాహన సదుపాయం లేకపోవడంతో కాలినడకన బయలుదేరిన ఓ వలస కూలీ మృతి చెందాడు. సరిహద్దులు మూసివేయ డంతో చెక్‌పోస్టుల వద్ద వలసకూలీలను అధికారులు ఎక్కడికక్కడ ఆపేసి ఆశ్రయం కల్పిస్తున్నారు. లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు భోజన, వసతితో పాటు ఉచితంగా మందులు అందించనున్నారు. నడిచి నడిచి అలసిపోయిన ఓ వలసకూలీ వికారాబాద్‌ జిల్లా పరిగి పట్టణంలోని ఎర్రగడ్డపల్లి సమీపంలోని పంటపొలాల్లో సోమ వారం మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం కర్నాటక కాలబుర్గి జిల్లా, సేడం నియోజకవర్గం ఇటికల్‌కు చెందిన ఎండీ అలీ సాబ్‌(50) హైదరాబాద్‌ లింగంపల్లిలోని ఇంద్రానగర్‌లో ఒక హోటల్లో పనిచేసేవాడు. కర్నాటకకు వెళ్లి పదిరోజుల కిందటే హైదరాబాద్‌కు వచ్చాడు. లాక్‌డౌన్‌తో పనిలేక, తినడానికి తిండి లేక 26న కాలినడకతో ఇంటికి పయనమయ్యాడు. 27న తన భార్యతో ఫోన్‌లో మాట్లాడి చేవెళ్ల దగ్గర ఉన్నానని చెప్పాడు. నడిచినడిచి అలిసిపోయి 28న పరిగి చేరుకుని ఎర్రగడ్డపల్లి బాలనర్సింలు పొలంలో సేదతీరాడు. అప్పట్నుంచి పక్క పొలంలో ఉంటున్న కదీర్‌ రోజూ ఆహారం పెట్టాడు. సోమవారమూ ఆహారం ఇచ్చేందుకు వెళ్లగా అలీసాబ్‌ కదలకుండా ఉండిపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్టు ఎస్‌ఐ శ్రీశైలం తెలిపారు. అలీసాబ్‌.. కల్లు కావాలని, మతిస్థిమితం లేకుండా ప్రవర్తించేవాడని కదీర్‌ తెలిపాడు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలానికి ఆదివారం రాత్రి చేరుకున్న ఒడిశాకు చెందిన సుమారు 11మంది వలసకూలీలకు పోలీస్‌ అధికారులు, లయన్స్‌ క్లబ్‌ వారు ఆశ్రయం కల్పించారు. వారందరి రక్త నమూనాలు సేకరించి జిల్లా కేంద్రానికి పంపుతున్నట్టు, రిపోర్టుల ఆధారంగా చికిత్స అందిస్తామని పినపాక ప్రభుత్వ వైద్యులు డాక్టర్‌ శివ ప్రసాద్‌ తెలిపారు. హైదరాబాద్‌ నుంచి ఒడిశా రాష్ట్రానికి బయలుదేరిన తొమ్మిది మంది వలస కూలీలు సోమవారం ఉదయం ఖమ్మం జిల్లా కూసుమంచికి చేరుకున్నారు. వారిని పోలీసులు చెక్‌పోస్టు వద్ద ఆపేశారు. స్థానిక ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి స్పందించి భోజన ఏర్పాట్లతో పాటు ఖర్చుల నిమిత్తం కొంత ఆర్థిక సాయం చేసి ఖమ్మంలోని ఓ స్వచ్ఛంద సంస్థకు వారిని అప్పగించారు. కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలం సలాబత్‌పూర్‌ అంతరాష్ట్ర చెక్‌పోస్టు వద్ద హైదరాబాద్‌ నుంచి సుమారు 250 రాజస్థాన్‌వాసులు తిరిగి వారి స్వస్థలాలకు లారీల్లో వెళ్తుండగా సోమవారం ఉదయం పోలీసులు అడ్డుకున్నారు. మండలకేంద్రంలోని రెసిడెన్షియల్‌ గురుకుల పాఠశాలకు తరలించారు. భోజనం, నీటి సదుపాయం కల్పించాలని వారు కోరుతున్నారు. ఉన్నత చదువుల కోసం మహారాష్ట్ర వెళ్లిన జహీరాబాద్‌ విద్యార్థులు కాలినడకన తెలంగాణలోకి ప్రవేశించగా. వారి వివరాలు కనుక్కొని సమీపంలోని ఐటీఐ కళాశాలకు పంపించారు.

Courtesy Nava Telangana