వసతి గృహాల్లో కలుషిత ఆహారం
తరచూ ఫుడ్‌ పాయిజన్‌తో పిల్లలకు అస్వస్థత
అపరిశుభ్రంగా వంటశాలలు, స్టోర్‌ రూమ్‌లు
కలుషిత నీరు, బియ్యంలో ఎలుకల విసర్జితాలు
నాణ్యత లేని కూరగాయలు, పప్పు దినుసులు
హాస్టళ్లలో కనిపించని వైద్య సదుపాయాలు
పారాసిటమాల్‌, దగ్గు మందులూ కరువే

తన కొడుకు శేఖర్‌ ఇంటికి దూరంగా హాస్టల్లో ఉండి చదువుకుంటున్నా రామయ్య బేఫికర్‌గా ఉండేవాడు. కూర, పప్పుచారు, కోడిగుడ్డు, వారంలో రెండుసార్లు నీసుతో కుమారుడికి ఇంట్ల తిండి కన్నా హాస్టల్లోనే కమ్మగా దొరుకుతుందని నిమ్మలంగా గుండెమీద చెయ్యేసుకొని పడుకునేవాడు. కొన్ని రోజులుగా ఆయనకు రోజూ కొడుకు గురించే రంధి పట్టుకుంది. పురుగుల బియ్యం, పాడయిపోయిన కూరగాయలతో కూరలు వండుతలేరు కదా? అనే ఆలోచనే!  ..ఒక్క రామయ్యనే కాదు, ఎంతోమంది హాస్టల్‌ పిల్లల తల్లిదండ్రులది ఇదే బెంగ.

ఫిబ్రవరి 15న వికారాబాద్‌ జిల్లా బొంరా్‌సపేట్‌ మండలం చిల్మల్‌ మైలారంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని 70మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ తారీఖుకు 3రోజుల ముందు భువనగిరి కస్తూర్బా పాఠశాలలో రాత్రి భోజనం చేసిన తర్వాత 20మంది విద్యార్థినులకు వాంతులు, విరోచనాలు అయ్యాయి. మరుసటి రోజు అల్పాహారం తిన్నాక మరో 20మంది అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. 

జనవరి 2న పెద్ద కొత్తపల్లి మండలం చంద్రకల్‌లో కలుషిత ఆహారం తిని 50 మంది విద్యార్థులు అనారోగ్యంపాలయ్యారు. గత ఏడాది డిసెంబరు 28న నల్లగొండ జిల్లా నిడుమానూరు మండలం వేంపాడులోని జ్యోతిపూలే బాలికల గురుకుల పాఠశాలలో చెడిపోయిన జీరారైస్‌, కుళ్లిన కోడిగుడ్లు తిని 60మంది విద్యార్థినులు ఆస్పత్రిపాలయ్యారు. గత ఏడాది మార్చి 3న హైదరాబాద్‌ శాలిబండలోని తెలంగాణ మైనారిటీ బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాలలో కలుషితాహారం తిని 61మంది విద్యార్థినులు అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. 

కమ్మగా ఉండాల్సిన హాస్టల్‌ బువ్వ కలుషితమవుతోంది. అది తింటున్న పిల్లలు తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలవుతున్నారు. ఈ తరహా కేసులు ఇటీవల తరచూ వెలుగుచూస్తున్నాయి. అల్పాహారమైనా.. మధ్యాహ్న భోజనమైనా.. రాత్రి భోజనమైనా తిండి పేరెత్తితేనే విద్యార్థులు హడలిపోతున్నారు. పిల్లల కడుపు నింపాల్సిన తిండే వారి పాలిట విషమవుతోంది. అక్కడా ఇక్కడా అని కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బాలురు, బాలికల హాస్టళ్లలో, గురుకులాల్లో ఇదే పరిస్థితి. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ 878, బీసీ 687, ట్రైబల్‌ 312, మైనారిటీ 15, డిసేబుల్డ్‌ 18 హాస్టల్స్‌ ఉన్నాయి. వీటిలో  2,13,134 మంది విద్యార్థులు ఉంటున్నారు. ఇవే గాకుండా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ, జనరల్‌ కేటగిరీలకు చెందిన గురుకుల విద్యా సంస్థలో 5,27,180 మంది విద్యార్థులు చదువుతున్నారు. వసతి గృహాల్లోని వంటశాలలు అపరిశుభ్రంగా ఉంటున్నాయి. హాస్టళ్లలో ఇదే ప్రధాన సమస్య. దుమ్మూధూళితో బూజుపట్టిన గోడలు.. పెచ్చులూడిన సీలింగ్‌.. ఊడ్చకుండా వదిలేసిన నేల.. అక్కడే నిల్వ చేస్తున్న కూరగాయలు.. సరిగా తోమకుండానే వంటల కోసం ఉపయోగిస్తున్న పాత్రలతో వంటగదులు అపరిశుభ్రతకు కేరాఫ్‌ అడ్ర్‌సగా మారుతున్నాయి. చెడిపోయిన కూరగాయలతో.. పురుగులు, ఎలుకల విసర్జితాలున్న బియ్యంతో వండి పెడుతున్నారని.. చారుకాసే పప్పు, ఇతర దినుసులు నాణ్యంగా ఉండటం లేదని.. వంటలన్నీ ఉడికీ ఉడకకుండా ఉంటున్నాయన్న ఆరోపణలున్నాయి. వంట మనుషులు కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నారన్న విమర్శలున్నాయి. కలుషిత ఆహారంతో విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నా వంట మనుషులు, ఇతర సిబ్బందిపై చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. నిరుడు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌,  మహబూబాబాద్‌ జిల్లాలోని ఓ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి పిల్లలకు పెడుతున్న తిండిని పరిశీలించారు. సాంబారు మాదిరిగా కూరలు, నీళ్లచారును తలపించేలా సాంబారు ఉండటం చూసి విస్తుబోయారు. భోజనంలో నాణ్యతలేమితో పాటు ఆ రోజు మెనూ ప్రకారం ఇవ్వాల్సిన ఆహారాన్ని కూడా ఇవ్వలేదని నిర్ధారించుకొని సదరు వసతిగృహం అధికారులపై చర్యలకు ఆదేశించారు.

ఇదీ మెనూ..
రాష్ట్రంలోని హాస్టళ్లు, గురుకులాల్లో ఒకే రకమైన మెనూను ప్రభుత్వం నిర్దేశించింది. ఆ రకంగానే పిల్లలకు భోజనాన్ని పెట్టాల్సి ఉంటుంది. ఆ మెనూ ప్రకారం.. నెలకు ఎనిమిదిసార్లు నాన్‌ వెజ్‌, రోజూ ఒక గుడ్డు, అరటిపండు, ప్రతిరోజూ నెయ్యితో కూడిన భోజనాన్ని ఇవ్వాలి. ప్రతి శనివారం వెజిటేబుల్‌ బిర్యానీతో పాటు ప్రతిరోజూ ఉదయం టిఫిన్‌, సాయంత్రం స్నాక్స్‌ ఇవ్వాలి. ఈ మెనూ చాలాచోట్ల అమలు చేయడం లేదు.

మౌలిక సదుపాయాలు ఏవి?
వసతి గృహాలు మౌలిక సదుపాయాలలేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. మంచినీరు కూడా అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు కలుషిత నీటినే తాగుతున్నారు. కొన్నిచోట్ల నీటి కొరత తీవ్రంగా ఉంది. ఖమ్మంలోని  ఓ గురుకుల పాఠశాలలో రెండు, మూడు రోజులకోసారి బాలికలు స్నానం చేస్తున్నారంటే అక్కడ ఎంతగా నీటి కొరత ఉందో అర్థం చేసుకోవచ్చు. పెద్దపల్లి జిల్లాలోని ఓ బాలికల హాస్టల్‌లో బోర్‌వెల్‌ చెడిపోవడంతో విద్యార్థులు సమీపంలోని స్కూల్‌ బిల్డింగ్‌ నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. సూర్యాపేట శ్రీరాం సాగర్‌ కాలనీలోని ఎస్టీ హాస్టల్‌ రేకుల షెడ్డులో కొనసాగుతోంది. చాలాచోట్ల హాస్టళ్ల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. గదుల్లో స్లాబుకు పగళ్లు రావడం, వర్షాకాలంలో పైనుంచి నీళ్లు కారుతున్నాయి. మంథనిలో ఎస్సీ బాలికల వసతి గృహం శిథిలావస్థకు చేరుకుంది. మెదక్‌ జిల్లా దౌల్తాబాద్‌ బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులకు సరిపడ మరుగుదొడ్లు లేకపోవడంతో మలవిసర్జనకు బయటకు వెళుతున్నారు. చాలా హాస్టళ్లలో బాత్‌రూమ్‌లు, టాయిలెట్లు సరిగా లేవు. దౌల్తాబాద్‌ గురుకులంలో ప్రహరీ లేదు. దీంతో అక్కడ విద్యార్థినుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.  నిరుడు జూలైలో నిర్మల్‌ జిల్లా కుబీర్‌ బీసీ గురుకులలో 5వ తరగతి విద్యార్థి ఆరటి హర్షవర్థన్‌పై గుర్తుతెలియని వ్యక్తి  కత్తిపోట్లు జరపడం అప్పట్లో సంచలనమైంది.

చర్మవ్యాధులతో పాట్లు
వసతిగృహాల్లో పారిశుధ్య లోపంతో విద్యార్థులు తరచూ వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రధానంగా వారికి గజ్జి, తామర సోకుతోంది. నేరడిగొండ మండలంలోని గుత్పాల మినీ గురుకులంలో 10 మంది విద్యార్థులకు తీవ్రమైన చర్మ సంబంధిత వ్యాధులు సోకడంతో వారిని తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. గండీడ్‌ గిరిజన గురుకులంలో విద్యార్థులను  ఎలుకలు కరిచిన వైనం తీవ్ర కలకలం రేపింది. నిబంధనల ప్రకారం ప్రతినెలా విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలి. స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు వచ్చి పరీక్షలు జరపాలి. ఇది కూడా సరిగ్గా అమలు కావడం లేదు. చాలా చోట్ల జ్వరం గోలీలు, దగ్గు మందుకు కూడా దిక్కులేని పరిస్థితి నెలకొంది.

విద్యార్థుల అవస్థలు..
ఖమ్మం జిల్లా చెర్వుమాధారం బాలికల బీసీ హాస్టళ్లలోని బియ్యంలో ఎలుకల విసర్జితాలు కనిపించాయి

గండీడ్‌ సమీపంలోని గిరిజన సంక్షేమ హాస్టల్‌లో విద్యార్థులు నిద్రిస్తున్న సమయంలో వారిని ఎలుకలు కొరికాయి.

గద్వాల జిల్లాలో ధర్మవరం ఎస్సీ హాస్టల్‌లో 64 మంది విద్యార్థులు ఐరన్‌ మాత్రలు తీసుకొని అనారోగ్యానికి గురయ్యారు

హాస్టల్స్‌లోని అపరిశుభ్ర వాతావరణం కారణంగా నేరడిగొండ మండలం గుత్పాల మినీ గురుకులంలో 10 మంది విద్యార్థులకు తీవ్రమైన చర్మ సంబంధిత వ్యాధులు సోకడంతో వారిని తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు

దౌల్తాబాద్‌ మండలంల, బాలంపేట కేజీబీవీలో కలుషిత ఆహారం తిని 41మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 

వికారాబాద్‌లోని సంగం లక్ష్మీబాయి టీఎస్‌ గురుకులంలో ఉదయం వండిన బగారా అన్నాన్ని రాత్రిపూట పెట్టడంతో 47 మంది విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. 

2018 నవంబరు 27న నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్‌పాయిజన్‌తో 150మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. 

2017 జూలైలో 11న ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల కస్తూర్బాలో అల్పాహారంగా పూరీ, పెసరపప్పు తిన్న కొద్దిసేపటికే 41మంది పిల్లలు కడుపునొప్పితో బాధపడ్డారు. ఇదే రోజు సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లోని బాలికల గురుకుల పాఠశాలలో చికెన్‌ తిన్న తర్వాత 23మంది బాలికలు అనారోగ్యంబారిన పడ్డారు. 

గత ఏడాది జూలై 9న హైదరాబాద్‌ ఆసి్‌ఫనగర్‌లోని తెలంగాణ మైనారిటీ బాలుర పాఠశాలలో రాత్రి భోజనం చేసిన తర్వాత 33మంది పిల్లలు జబ్బుపడ్డారు. 

నిరుడు ఆగస్టు 6న ఖమ్మం జిల్లా సత్తుపల్లి బాలికల వసతి గృహంలో మధ్యాహ్నం చికెన్‌తో భోజనం తిన్న తర్వాత 45మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. 

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని మైనారిటీ బాలుర హాస్టల్లోని విద్యార్థులు నిరుడు రెండు పర్యాయాలు ఫుడ్‌ పాయిజన్‌కు గురయ్యారు. ఒకసారి 65 మంది, మరోసారి 35 మంది విద్యార్ధులు కడుపునొప్పి, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. కొల్లపూర్‌ కస్తూర్బా పాఠశాలలో కొన్ని నెలల క్రితం కలుషిత ఆహారం తిని 40 మంది విద్యార్థులు ఆస్పత్రిపాలయ్యారు.

ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండలం కస్తూర్బా పాఠశాలలో 20 మంది, మావల మైనారిటీ గురుకుల పాఠశాలలో 40 మంది, అనుకుంట బీసీ గురుకులంలో 22 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని అనారోగ్యం పాలయ్యారు.

Courtesy Andhrajyothi