• ఖాళీ చేయాలంటూ యాజమాన్యాల హుకుం
  • విద్యార్థుల్లో ఆందోళన.. సొంతూళ్లకు వెళ్లే యత్నం
  • అనుమతి కోసం పోలీసు స్టేషన్ల వద్ద భారీగా బారులు
  • 24గంటలు చెల్లుబాటయ్యేలా అనుమతి పత్రాలు జారీ
  • మంత్రి కేటీఆర్‌ జోక్యం.. హాస్టళ్లు మూసివేయొద్దని ఆదేశం
  • విద్యార్థులను ఖాళీ చేయిస్తే కఠిన చర్యలు: డీజీపీ
  • ఏపీలోకి విద్యార్థులను అనుమతించని పోలీసులు
  • 2వేలదాకా నిలిచిన వాహనాలు.. 8గంటలపాటు నిరీక్షణ
  • ఎక్కడి వారక్కడే!.. ఇరువురు సీఎంల నిర్ణయం

హైదరాబాద్‌ సిటీ, హైదరాబాద్‌ : ఉన్నపళంగా ఖాళీ చేయాలని హాస్టల్‌ నిర్వాహకులు చెబితే అందులో ఉండే విద్యార్థుల పరిస్థితి ఏమిటి? సొంతూళ్లకు వెళదామనుకున్నా ఒక్క బస్సూ రోడ్డు మీద తిరగక.. ప్రైవేటు వాహనాలూ లేని పరిస్థితుల్లో వారెక్కడికని వెళతారు? హైదరాబాద్‌లో ప్రైవేటు హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు బుధవారం ఇదే అనుభవం ఎదురైంది. ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో తక్షణమే హాస్టళ్లను వదిలి వెళ్లాల్సిందేనంటూ విద్యార్థులను యాజమాన్యాలు ఆదేశించాయి. ఆందోళనకు గురైన విద్యార్థులు.. తప్పని పరిస్థితుల్లో సొంతూళ్లకు వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ వందల సంఖ్యల్లో సమీప పోలీస్‌ స్టేషన్ల దగ్గర గుమిగూడారు. అనుమతి పత్రాల కోసం పోటీపడ్డారు.

దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. సామాజిక దూరం పాటిస్తేనే కరోనా కట్టడి చేయగలం అన్న సంకల్పంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటిస్తే.. గుంపులు గుంపులుగా విద్యార్థులు పోగవడం ఏమిటంటూ సామాజిక మాధ్యమాల్లో పలువురు ప్రశ్నించారు. దీంతో చివరికి మంత్రి కేటీఆర్‌ జోక్యం చేసుకున్నారు. హాస్టళ్లను మూసివేయొద్దని యాజమాన్యాలను ఆదేశించారు. దీంతో పోలీసులు శాఖ.. విద్యార్థులు సొంతూళ్లకు వెళ్లే వెసులుబాటును వెనక్కి తీసుకుంది. అప్పటికే అనుమతి పత్రాలు పొంది బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఇలా బుధవారం రోజంతా విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. బుధవారం ఉదయం నుంచే సరూర్‌నగర్‌, మలక్‌పేట, ఎల్బీనగర్‌, చైతన్యపురి, మాదాపూర్‌, ఎస్సార్‌నగర్‌, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, కూకట్‌పల్లి, తదితర పోలీస్‌ స్టేషన్ల వద్ద పెద్ద సంఖ్యలో విద్యార్థులు క్యూ కట్టారు. ఉన్నతాధికారుల అనుమతితో సొంతూళ్లకు వెళ్లేందుకు 24గంటల పాటు చెల్లుబాటయ్యేలా విద్యార్థులకు పోలీసులు అనుమతి పత్రాలను జారీ చేశారు. అయితే ఒకేసారి పెద్ద సంఖ్యలో పోలీస్‌ స్టేషన్‌లకు రావడంతో వారిని అదుపు చేయలేకపోయారు. ఎస్సార్‌నగర్‌ పీఎస్‌ ఎదుట 4వేల మంది క్యూ కట్టారు. వారిని అదుపు చేయలేక లాఠీచార్జి చేశారు. ఇలా బుధవారం ఒక్క రోజే  నగరంలో 20 నుంచి 25వేల మంది విద్యార్థులు హస్టళ్ల నుంచి పోలీస్‌ స్టేషన్లకు వచ్చారు. ఒకరినొకరు తాకుతున్నట్లుగా నిలబడ్డారు. చాలామంది మాస్కులు కూడా వేసుకోలేదు.

ఆందోళన వద్దు: కేటీఆర్‌
సామాజిక మాధ్యమాల ద్వారా మంత్రి కేటీఆర్‌ దృష్టికి వెళ్లింది. ఆయన వెంటనే జీహెచ్‌ఎంసీ మేయర్‌, కమిషనర్‌, హైదరాబాద్‌, సైబరాబాద్‌ సీపీలను అడిగి పరిస్థితిని ఆరా తీసినట్లు తెలిసింది. లాక్‌డౌన్‌ సమయంలో పోలీస్‌ స్టేషన్ల వద్ద బారులు తీరడం శ్రేయస్కరం కాదని, హాస్టళ్లను యథవిధిగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. అంతేకాదు.. ‘‘హైదరాబాద్‌లోని హాస్టళ్లను యజమానులు ఖాళీ చేయించొద్దు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాస్టళ్లను నిర్వహించుకోవడానికి జీహెచ్‌ఎంసీ మేయర్‌, కమిషనర్‌, హైదరాబాద్‌, సైబరాబాద్‌ సీపీలు సహకరిస్తారు’’ అని కేటీఆర్‌   ట్వీట్‌ చేశారు. హైదరాబాద్‌లోని ప్రజాప్రతినిధులందరూ హాస్టళ్లను పరిశీలించి ఇబ్బందుల్లేకుండా చూడాలని సూచించారు. మంత్రి ఆదేశాలతో అనుమతి పత్రాలు జారీ చేయొద్దని పోలీస్‌ శాఖ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ హాస్టళ్లలో ఉంటున్న వారిని ఖాళీ చేయిస్తే నిర్వాహకులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు.

ఎక్కడి వారక్కడే!
అమరావతి : కరోనా కట్టడిలో భాగంగా ‘ఎక్కడి ప్రజలు అక్కడే’ ఉండేలా చూడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించారు. హైదరాబాద్‌ నుంచి హఠాత్తుగా  ఏపీ వైపునకు 2 వేల మందిని అనుమతించడంతో గందరగోళం తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఏపీ సీఎం జగన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌ మధ్య సంప్రదింపులు జరిగాయి. ఇప్పటికే జగ్గయ్యపేట చెక్‌పోస్టు వద్దకు చేరుకున్న వారికి హెల్త్‌ ప్రొటోకాల్‌ ప్రకారం పూర్తి పరీక్షలు నిర్వహించి ఏపీలోకి అనుమతించాలని నిర్ణయిం చినట్లు ఏపీ అధికారులు ప్రకటనలో తెలిపారు.

ఏపీ సరిహద్దుల్లో టెన్షన్‌
అనుమతి పత్రాలతో కార్లు, బైక్‌ల మీద ఏపీవైపు బయలుదేరిన వారిని సూర్యాపేట జిల్లా కోదాడమండలం రామాపురం ఆంధ్రా సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఏపీలోకి ప్రవేశించేందుకు అనుమతించలేదు. దీంతో సరిహద్దుకు ఇవతలి వైపు దాదాపు 2వేల వాహనాలు నిలిచిపోయాయి. కృష్ణాజిల్లా జగ్యయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను, కృష్ణాజిల్లా సబ్‌కలెక్టర్‌ దినకర్‌ అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. వాహనదారులు కొందరు నిలదీయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఏపీవాసులకు ఆరోగ్య పరీక్షలు చేసిన అనంతరం ప్రభుత్వ వాహనాల్లో చేరవేస్తామని సబ్‌కలెక్టర్‌ ప్రకటించారు.  విషయం తెలియడంతో మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో స్పదించారు. ఏపీ సీఎం జగన్‌తో సీఎం కేసీఆర్‌ మాట్లాడారని, సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని విద్యార్థులకు భరోసా ఇచ్చారు.

వారం నుంచే ఒత్తిడి
గ్రేటర్‌ పరిధిలో వేలల్లో వర్కింగ్‌ మెన్స్‌, వుమెన్స్‌ హాస్టళ్లు ఉన్నాయి. వారం క్రితమే ఇళ్లకు వెళ్లిపోవాలని హాస్టళ్లల్లో ఉంటున్న వారికి నిర్వాహకులు చెప్పారు. అయితే నిర్వాహకులంతా కలిసి కూడబలుక్కున్నట్లుగా బుధవారం విద్యార్థులపై ఒత్తిడి పెంచారు. హాస్టళ్లు ఖాళీ చేయాలని నిర్వాహకులు తేల్చిచెప్పడం.. ఊర్లకు వెళ్లడానికి రవాణా వసతి లేకపోవడంతో హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల పరిస్తితి అగమ్యగోచరంగా మారింది.

Courtesy Andhrajyothi