• 4000 వీడియో, ఆడియో క్లిప్‌లు, స్ర్కీన్‌ షాట్లు పోలీసుల స్వాధీనం
  • మధ్యప్రదేశ్‌లో వలపు వల
  • నలుగురు మాయలేడీల శృంగారజాలం
  • ఆడి కార్లు, ఫ్లాట్లిస్తామని కాలేజీ పిల్లలకు ఆశ
  • ఉద్యోగాలు ఇప్పిస్తామని తల్లిదండ్రులకు ఎర
  • నేతలు, అధికారుల కోర్కెలకు అమ్మాయిలు బలి
  • వారిని అడ్డం పెట్టుకుని కాంట్రాక్టుల పట్టివేత
  • తర్వాత కోట్లు ఇవ్వాలంటూ బ్లాక్‌మెయిలింగ్‌

మగాళ్ల చేతుల్లో ‘ఆమె’ మోసపోయిందనే వార్తలే ఇన్నాళ్లూ ఎక్కువగా చూశాం! కానీ ఇప్పుడు.. ‘ఆమె’ చేతిలో అనేక మంది ప్రముఖులు అడ్డంగా చిక్కారు. అందులో ఒక మాజీ సీఎం, ఒక మాజీ గవర్నర్‌, 13 మంది అధికారులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఉద్యోగాల ఆశ చూపించి కాలేజీ విద్యార్థినుల్ని.. ఆ ఆడపిల్లలను ఎరగా వేసి అధికారులను, నాయకులను.. ముగ్గులోకి దించి నలుగురు మహిళలు ఆడిన ఆట ఇది. ఆ ఇద్దరికీ తెలియకుండా వారి సన్నిహిత దృశ్యాలను వీడియోలుగా తీసి ఆడిన వికృతమైన ఆట! ఈ ఆటలో అధికారులు, నేతల కామదాహానికి అమాయకులైన ఆడపిల్లలు బలైపోగా.. బడా బాబులేమో.. కి‘లేడీ’ల సీక్రెట్‌ కెమెరాలకు చిక్కారు!! ఇద్దరినీ వాడుకున్న మాయలాడులు మాత్రం పెద్దఎత్తున కాంట్రాక్టులు పట్టారు. మాట విననివారిని బ్లాక్‌మెయిల్‌ చేసి కోట్లు కొల్లగొట్టారు!! ఇదొక ట్రాప్‌. అమ్మాయిలపై మనీ ట్రాప్‌. అధికారులు, అమాత్యులపై హనీ ట్రాప్‌. ఇద్దరినీ వాడుకుని డబ్బు కోసం ఆడిన డబుల్‌ ట్రాప్‌!!

కొసమెరుపు: మధ్యప్రదేశ్‌ నేతలు, అధికారులే కాదు.. పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు నేతలు, అధికారుల రాసలీలలు కూడా ఈ వీడియోల్లో ఉన్నట్టు సమాచారం.

భోపాల్‌, సెప్టెంబరు 26: ‘మీకు ఆడి కార్లు ఇస్తాం! మీకు అపార్టుమెంట్లు ఇస్తాం! మీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తాం! మీరు విలాసవంతంగా జీవించేలా డబ్బులిస్తాం!’ అంటూ కాలేజీ అమ్మాయిలకు వల వేశారు! వారిని అడ్డం పెట్టుకుని ప్రముఖ రాజకీయ నాయకులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు వలపు వల వేశారు! ఇద్దరూ లైంగికంగా కలిసి ఉన్నప్పుడు రహస్యంగా వీడియోలు తీశారు! ఇక, అక్కడి నుంచి బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌ మొదలు పెట్టారు! కోట్లాది రూపాయలు బలవంతపు వసూళ్లు చేశారు! మరికొందరికి అమ్మాయిలను ఆశ చూపి పెద్దఎత్తున ప్రభుత్వ కాంట్రాక్టులు చేజిక్కించుకున్నారు! మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన భారీ సెక్స్‌ స్కాండల్‌ ఇది! ఈ స్కాంలో ఇప్పటికే 13 మంది ఐఏఎస్‌ అధికారుల పేర్లు తెరపైకి వచ్చాయి. ఓ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్‌కు చెందిన వీడియో క్లిప్‌లు దొరికాయి. ఎనిమిది మంది మాజీ మంత్రుల పేర్లు కూడా ఈ స్కాంలో తెరపైకి వస్తున్నాయి.

రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు అమ్మాయిలతో కలిసి ఉన్న 92 హై క్వాలిటీ వీడియోలు చిక్కాయి. నిందితుల కంప్యూటర్లు, మొబైల్స్‌ నుంచి ఏకంగా 4000 వరకూ

వీడియో, ఆడియో క్లిప్‌లు; సెక్స్‌ చాటింగ్‌కు సంబంధించిన స్ర్కీన్‌ షాట్‌లను స్వాధీనం చేసుకున్నారంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్‌, బీజేపీ.. రెండు పార్టీలకు చెందిన నాయకులూ ఈ స్కాంలో ఉన్నారు. ఇప్పుడు ఈ కుంభకోణం మధ్యప్రదేశ్‌ను కుదిపేస్తోంది. ‘క్విడ్‌ ప్రో కో’ ఆరోపణలతో ఏకంగా పది మందికిపైగా సీనియర్‌ అధికారులను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారిస్తోంది. బాలీవుడ్‌కు చెందిన ‘బీ’ గ్రేడ్‌ తారలు సహా 40 మందికిపైగా కాల్‌ గర్ల్స్‌ ఈ స్కాంలో పాత్రధారులు. ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేశారు. వీరిలో శ్వేతా విజయ్‌ జైన్‌, శ్వేతా స్వప్నిల్‌, బర్ఖా సోనీ, ఆర్తి దయాల్‌, 18 ఏళ్ల కాలేజీ విద్యార్థిని, ఆర్తి దయాల్‌ డ్రైవర్‌ ఉన్నారు.

వలపు వల ఇలా..!

సెక్స్‌ స్కాం ముఠా నాయకురాలు శ్వేతా విజయ్‌ జైన్‌(39) భోపాల్‌లో ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతోంది. ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులను ‘సంతృప్తి’పరచడానికి దిగువ మధ్య తరగతికి చెందిన పాతిక మందికిపైగా కాలేజీ అమ్మాయిలకు వల వేశానని విచారణలో శ్వేతా జైన్‌ అంగీకరించింది కూడా. ‘‘తొలుత ఒక మంత్రినో ఉన్నతాధికారినో శ్వేత కలుస్తుంది. అమ్మాయిల ఎర వేస్తుంది. ఫలానా గెస్ట్‌హౌ్‌సకో ఫైవ్‌స్టార్‌ హోటల్‌కో రావాలని చెబుతుంది.

అక్కడ రహస్యంగా మొబైల్‌ లేదా స్పై కెమెరా పెట్టి చిత్రీకరిస్తుంది’’ అని పోలీసు అధికారులు తెలిపారు. బీజేపీ మాజీ సభ్యురాలైన ఈమె 2013 ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కమిటీ సభ్యురాలు. భోపాల్‌లో విలాసవంతమైన మినాల్‌ రెసిడెన్సీలో మాజీ ముఖ్యమంత్రి ఒకరు తనకు విశాలమైన బంగ్లాను బహుమతిగా ఇచ్చారని ఆమె అంగీకరించింది. ఓ ఐఏఎస్‌ అధికారితో ప్రేమాయణం సాగిస్తుండగా అతని భార్యకు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. పలువురు మంత్రులతోనూ ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయి.

కాంట్రాక్టులే.. కాంట్రాక్టులు

ఇక, మరో మహిళ శ్వేతా స్వప్నిల్‌ జైన్‌ బీజేపీ ఎమ్మెల్యే బ్రిజేంద్ర ప్రతాప్‌ సింగ్‌ ఇంట్లో ఉంటూనే ఈ సెక్స్‌ స్కాండల్‌ నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని రాజకీయ నాయకులందరితోనూ ఆమెకు సంబంధాలు ఉన్నాయని, మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడితో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆమె భర్త స్వప్నిల్‌ జైన్‌ నుంచే ఏకంగా ఐదు హార్డ్‌ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. మరికొంతమంది అధికారిక పర్యటన మీద ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాలకు వెళ్లినప్పుడు వారికి అక్కడే మోడల్స్‌, ముంబై తారలను సరఫరా చేసిందని వెల్లడించారు. ఈ విధంగా భోపాల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ నుంచే ఆమె రూ.8 కోట్ల కాంట్రాక్టు పట్టేసింది. పీడబ్ల్యూడీ, హౌసింగ్‌, సాంఘిక సంక్షేమం, ఇతర ప్రభుత్వ కార్పొరేషన్ల నుంచి కోట్లాది రూపాయల కాంట్రాక్టులను ఆమె చేజిక్కించుకుంది.

మంత్రులను పరిచయం చేసిన కార్యదర్శి

ఈ స్కాంలో మరో నిందితురాలు ఆర్తీ దయాల్‌. సిట్‌ ఆమెనూ అరెస్టు చేసింది. ఎనిమిది నెలల కిందట భర్తపై వరకట్నం కేసు పెట్టిన ఆమె.. ఛారత్‌పూర్‌ నుంచి భోపాల్‌ చేరుకుంది. ‘‘మధ్యప్రదేశ్‌ కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎ్‌సతో నాకు సన్నిహిత పరిచయాలు ఉన్నాయి. ఆయన కోరికను నేను కాదనలేకపోయేదాన్ని. పలువురు మంత్రులను ఆయనే నాకు పరిచయం చేశాడు. ఆ ఐఏఎస్‌ అధికారి భోపాల్‌లో నాకు ఓ ఫ్లాట్‌ కూడా ఇచ్చారు’’ అని సిట్‌ విచారణలో ఆమె వెల్లడించింది. ఆ తర్వాత ఆమె అక్రమ కార్యకలాపాలు అన్నిటికీ ఆ ఫ్లాటే వేదికగా నిలిచింది. శ్వేత తరహాలోనే ఈమె కూడా ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ నిధులు, కాంట్రాక్టులను దానికి మళ్లించుకునేది. చాలా సందర్భాల్లో అమ్మాయిలను పంపించినందుకు ప్రభుత్వ కాంట్రాక్టులు ఇచ్చేవారని, కొన్ని సందర్భాల్లో మాత్రమే వీడియో చూపించి బ్లాక్‌మెయిల్‌ చేయాల్సి వచ్చేదని సిట్‌ విచారణలో ఆమె వెల్లడించింది. ఈ ముఠాలోని మరో యువతి బర్ఖా సోనీ (35) కాంగ్రెస్‌ ఐటీ సెల్‌ మాజీ అధికారి అమిత్‌ సోనీ భార్య.

స్కాం బయటకు వచ్చిందిలా..!

ఇండోర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఇంజనీర్‌ హర్బజన్‌ సింగ్‌ వలపు వల బాధితుడు. ఇతడే స్వయంగా వలపు వలకు చిక్కాడు. ఆర్తి దయాల్‌, హర్బజన్‌ సింగ్‌ స్నేహితులు. 18 ఏళ్ల బాలిక మోనికా యాదవ్‌కు ఉద్యోగం కావాలంటూ ఆర్తి ఆమెను హర్బజన్‌కు పరిచయం చేసింది. ఆ తర్వాత ఇద్దరినీ ఓ హోటల్‌కు పంపింది. ఇద్దరూ సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియో తీసింది. దానిని అడ్డం పెట్టుకుని రూ.3 కోట్లు ఇవ్వాలంటూ ఆర్తి దయాల్‌ బ్లాక్‌ మెయిల్‌ చేసింది. ఆ తరువాత మోనికా కూడా తనకు డబ్బులివ్వాలని డిమాండ్‌ చేసింది. వారి వేధింపులకు విసిగిపోయిన హర్బజన్‌ సింగ్‌ ఇండోర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తొలుత రూ.50 లక్షలు ఇస్తానని, ఇండోర్‌కు రావాలని ఆర్తి దయాల్‌కు చెప్పాడు. ఇండోర్‌కు వస్తుండగానే ఆమెను, ఆమె డ్రైవర్‌ ఓం ప్రకాశ్‌ను, మోనికా యాదవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణలో రాష్ట్రవ్యాప్తంగా వీరి బాధితులు ఉన్నట్లు గుర్తించారు. విచారణలో ఆర్తి, మోనికా చెప్పిన వివరాల మేరకు శ్వేతా జైన్‌, ఆమె భర్త స్వప్నిల్‌ జైన్‌, బర్ఖా సోనీలను అరెస్టు చేశారు. అనంతరం కళ్లు చెదిరే నిజాలు బయటకు వచ్చాయి. కాంగ్రెస్‌, బీజేపీ పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో సిట్‌ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం హర్బజన్‌సింగ్‌ను సస్పెండ్‌ చేసింది. ‘‘డబ్బులివ్వాలంటూ అమ్మాయిలు రోజూ డిమాండ్‌ చేస్తుండడంతో అతడు విసిగిపోయాడు. వారిని వదిలించుకోవాలనే ఫిర్యాదు చేశాడు’’ అని ఓ పోలీసు అధికారి తెలిపారు.

పొరుగు రాష్ట్రాలకూ ..

ఒక్క మధ్యప్రదేశ్‌లోనే కాదు.. ఛత్తీ్‌సగఢ్‌, మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాలకూ ఈ స్కాం విస్తరించిందని పోలీసు అధికారులు చెబుతున్నారు. బహుశా దేశంలోనే ఇది అతి పెద్ద క్విడ్‌ ప్రో కో సెక్స్‌ స్కాండల్‌ అని అభివర్ణిస్తున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల్లో రాజకీయ నాయకులు, అధికారులతోపాటు జర్నలిస్టులకూ ఈ రాసలీలల్లో పాత్ర ఉందని చెబుతున్నారు.

వలపు వలలో మైనర్లూ

దేశవ్యాప్తంగా విస్తరించిన వలపు వల స్కాంలో మరో ఐదుగురు అమ్మాయిలను గుర్తించారు. వీరంతా మైనర్లే. వీరిలో 18 ఏళ్ల యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో, ముగ్గురు నిందితులపై సీఐడీ కేసు నమోదు చేసింది.

200 మంది ప్రముఖుల నంబర్లు

అరెస్టు చేసిన మహిళల నుంచి రూ.14 లక్షల నగదు, ఎస్‌యూవీ, ల్యాప్‌టాప్‌, ఎనిమిది సిమ్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. లాప్‌టాప్‌ హార్డ్‌ డిస్క్‌లో 15 సెక్స్‌ వీడియోలను కూడా గుర్తించారు. వారి మొబైల్స్‌లో 200 మంది ప్రముఖ రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల ఫోన్‌ నంబర్లు ఉన్నాయి.

మహారాష్ట్ర మంత్రి కూడా: దిగ్విజయ్‌

ఈ సెక్స్‌ కుంభకోణంపై మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘భారతీయ యువమోర్చా అధ్యక్షుడిగా జితూ జిరాటీ ఉన్నపుడు ఈ రాకెట్‌ సూత్రధారుల్లో ఒకరైన శ్వేతా విజయ్‌ జైన్‌ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. మీరు కావలిస్తే ఆ వివరాలు బయటకు తీయవచ్చు’’ అని మీడియాతో అన్నారు. అంతేకాక- మహారాష్ట్రకు చెందిన మంత్రి శంభాజీరావు నీలంగేకర్‌తో శ్వేత తన సాన్నిహిత్యాన్ని కొనసాగిం చిందనీ, ఆమె వీడియోలో ఉన్నది ఆయనేనని దిగ్విజయ్‌ పేర్కొన్నారు.

రాసలీలల్లో 13 మంది ఐఏఎస్‌లు

మధ్యప్రదేశ్‌ రాసలీలల స్కాంలో ఇప్పటి వరకూ 13 మంది ఐఏఎ్‌సల పేర్లు తెరపైకి వచ్చాయి. వీరంతా మత్య్స శాఖ, వ్యవసాయం, కల్చర్‌, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, కార్మిక, అటవీ, జల వనరులు, పబ్లిక్‌ రిలేషన్స్‌, జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగాల్లో పనిచేసిన వాళ్లే. వలపు వల వీడియోల్లో దొరికిన ఓ ఐఏఎస్‌ అధికారి అయితే, అమ్మాయిలను తన వెంట తీసుకుపోవడానికి ఏకంగా కేడర్‌నే మార్చుకున్నారు. కళ్లు చెదిరే రాసలీలల వీడియోను అడ్డు పెట్టుకుని టాప్‌ ఐఏఎస్‌ అధికారి ఒకరిని ఈ గ్యాంగ్‌ బెదిరించింది. రూ.2 కోట్లు ఇవ్వకపోతే వీడియోను బయట పెడతామని బ్లాక్‌మెయిల్‌ చేసింది.

మాజీ ఎంపీ ఆత్మహత్యాయత్నం

రాసలీలలకు సంబంధించి ఆర్తి దయాల్‌ గ్యాంగ్‌ వేధింపులు, బ్లాక్‌ మెయిల్‌ తట్టుకోలేక మధ్యప్రదేశ్‌ మాజీ ఎంపీ ఒకరు ఆత్మహత్యాయత్నం చేశారు. దాంతో, వలపు వలలో ఆయన చిక్కుకున్నట్లు బయటకు వచ్చింది. అనంతరం, కాంగ్రెస్‌ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది.

ఆ కోడ్‌ల అర్థమేమిటి!?

ఎవరెవరి కోర్కెలను తీర్చాం.. ఇంకా ఎవరెవరి కోర్కెలను తీర్చాల్సి ఉంది. ఎవరి దగ్గరకు ఎవరిని పంపాలనే వివరాలను ఓ నిందితురాలు ఏకంగా ప్రభుత్వ డైరీలోనే రాసుకుంది. అందులో రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల పేర్లు రాసుకుంది. వాటి ఎదురుగా టిక్‌లు, కోడ్‌లు రాసింది. కొంతమంది పేర్ల చుట్టూ గీత గీసింది. మరికొన్ని పేర్లు ఎదురుగా ‘ఐఎంపీ’, ‘ఓకే’ రాసింది. అందులోని కోడ్‌లు ఏమిటనే దానిపై ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె సెల్‌ఫోన్‌ నుంచి కూడా మరికొన్ని వీడియోలను స్వాధీనం చేసుకున్నారు.

80% బీజేపీ, 20% కాంగ్రెస్‌ నాయకులు

వలపు వల వీడియోలు బయటకు వచ్చిన వెంటనే కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం మొదలు పెట్టారు. సెక్స్‌ స్కాంలో ఎంపిక చేసిన కొంతమంది బీజేపీ నాయకులను కాంగ్రెస్‌ ప్రభుత్వం టార్గెట్‌ చేసిందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయవర్గీయ ఆరోపించారు. సీబీఐతో స్వతంత్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. అయితే, ‘‘ఏళ్ల తరబడి ఈ స్కాం జరిగింది. ఇందులో 80 శాతం బీజేపీ నాయకులే ఉన్నారు. అందరి జాతకాలూ పోలీసుల వద్ద ఉన్నాయి’’ అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి కేకే మిశ్రా చెప్పారు. మిగిలిన 20 శాతం కాంగ్రెస్‌ నాయకులని, ఇందులో భాగస్వామ్యం ఉందని తేలితే వారిని కూడా అరెస్టు చేస్తామని అన్నారు. ఈ నేపథ్యంలోనే, సిట్‌ విచారణ నుంచి డి.శ్రీనివా్‌సను తప్పించి సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, ఏడీజీపీ సంజీవ్‌ షమికి ప్రభుత్వం అప్పగించింది. వీడియోలను ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపిస్తామని, ఆ తర్వాత ఎంత పెద్ద పదవిలో ఉన్నా అధికారులు, రాజకీయ నాయకులను వదిలే ప్రసక్తే లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

 Courtesy AndhraJyothy…