•  చేపల వ్యాపారి హత్య కేసులో వీడిన మిస్టరీ… పథకం ప్రకారం హనీ ట్రాప్‌తో గదికి!
  • స్పృహ తప్పించేందుకు మద్యంలో మత్తు బిళ్లలు
  • తల మీద సుత్తితో కొట్టి ఒంటిపై బంగారం దోపిడీ
  • శరీర భాగాలు కోస్తూ.. డబ్బు కోసం మెసేజ్‌లు
  • ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

బంజారాహిల్స్‌/ అమీర్‌పేట/హైదరాబాద్‌ : అమ్మాయిని ఎరగా వేసి అనుకున్న చోటుకు రప్పించాడు. మద్యంలో మత్తు బిళ్లలు కలిపిచ్చి స్పృహతప్పేలా చేశాడు. సుత్తితో తలపై మోది ప్రాణాలు తీశాడు! మృతదేహాన్ని ముక్కలుగా కోస్తూ.. మృతుడి కుటుంబ సభ్యులతో బేరాలాడాడు. చివరికి పోలీసుల చేతికి దొరికిపోయాడు! సంచలనం సృష్టించిన చేపల వ్యాపారి రమేశ్‌ హత్య కేసులో వెలుగుచూసిన విషయాలివి! ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజునాయక్‌తోపాటు ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..
వికాసపురి కాలనీకి చెందిన చేపల వ్యాపారి పి.రమేశ్‌ (50) రామారావునగర్‌లో ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో.. రాజునాయక్‌ అలియాస్‌ శ్రీనివాస్‌ అనే వ్యక్తి కొద్దిరోజులు అద్దెకున్నాడు. రాజునాయక్‌కు నజీమా, శారదాబాయి అనే ఇద్దరు భార్యలున్నారు. అమ్మాయిలతో వ్యభిచార గృహం నిర్వహించే రాజు.. రమేశ్‌ ఇంట్లో అద్దెకు ఉన్నప్పుడు ఆయనతో పరిచయం పెంచుకున్నాడు. రమేశ్‌ ఇంటిని ఖాళీ చేశాక కూడా ఆయనతో పరిచయం కొనసాగించాడు. కాలక్రమంలో.. రాజునాయక్‌ను ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీంతో అతడి కళ్లు బాగా డబ్బున్న రమేశ్‌పై పడ్డాయి. అతణ్ని కిడ్నాప్‌ చేసి డబ్బు సంపాదించాలని ప్లాన్‌ వేశాడు. తన భార్య నజీమాతో కలిసి నెల క్రితం జవహర్‌నగర్‌లో శ్రీనివాస్‌ పేరుతో ఒక గదిని అద్దెకు తీసుకున్నాడు. జనవరి 21న రమేశ్‌కు ఫోన్‌ చేసి.. తన వద్ద ఒక అమ్మాయి ఉందంటూ ఒక ఫొటో పంపాడు. తన గదికి రావాలని పిలిచాడు. రమేశ్‌ అక్కడకు వెళ్లగా అమ్మాయిలు కనిపించలేదు. దీంతో గది బయటి నుంచే ఆయన వెళ్లిపోయారు. దీంతో రాజు నాయక్‌ ఈ నెల 1న మరో అమ్మాయి ఫోటోను వాట్సాప్‌ చేశాడు.

అతడి మాటలు నమ్మి.. రమేశ్‌ అతడి గదికి వెళ్లగా మద్యంలో మత్తు బిళ్లలు కలిపి తాగించాడు. రమేశ్‌ స్పృహ కోల్పోగానే ఆయన ఒంటి మీద ఉన్న ఐదు తులాల బంగారు గొలుసు, రెండు తులాల ఉంగరాలను రాజు తీసుకున్నాడు. రమేశ్‌ కాస్త కదిలినట్టు కనిపించడంతో అక్కడే ఉన్న సుత్తితో తలపై కొట్టాడు. అనంతరం రమేశ్‌ సెల్‌ఫోన్‌లను తీసుకొని గదిలో నుంచి బయటకు వచ్చి తాళం వేసి వెళ్లిపోయాడు. అదే రోజు నగలను అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు. ఫిబ్రవరి 2న తిరిగి గదికి వచ్చేసరికి రమేశ్‌ మృతిచెందారు. రమేశ్‌ కుటుంబసభ్యుల నుంచి డబ్బు వసూలు చేయాలని భావించిన రాజునాయక్‌.. 90 లక్షలు డిమాండ్‌ చేస్తూ రమేశ్‌ సెల్‌ఫోన్‌ నుంచే ఆయన భార్యకు వాట్సాప్‌ సందేశం పంపాడు. రమేశ్‌ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రమేశ్‌ మృతదేహాన్ని గదిలోంచి బయటకు తీసుకెళ్లి పడేసేందుకు రాజు ప్రయత్నించాడు. కానీ రమేశ్‌ బరువు కారణంగా అది కుదరలేదు. దీంతో కొడవలి తెచ్చి రమేశ్‌ చేతులు, తొడ భాగం కోసి కవర్లో వేశాడు. మిగతా భాగాలు కోయడం సాధ్యం కాక ఆపేశాడు. మిగతా శరీర భాగాలు కోసేందుకు మర్నాడు వెళ్లినా.. అప్పటికే దుర్వాసన రావడంతో సాధ్యం కాక బయటకు వచ్చేశాడు.

పట్టిచ్చిన దుర్వాసన..
రమేశ్‌ అదృశ్యం కేసుతో రంగంలోకి దిగిన క్రైం విభాగం పోలీసులు.. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ను విశ్లేషిస్తూ కిడ్నాపర్‌తో బేరం ఆడటం మొదలుపెట్టారు. డబ్బు సిద్ధమంటూ 4వ తేదీన ఒక వీడియో పంపారు. బోరబండ రైల్వే స్టేషన్‌కు వచ్చి డబ్బు తీసుకుని రమేశ్‌ను అప్పజెప్పాలని కోరారు. రాజునాయక్‌ అందుకు నిరాకరించాడు. 5న డబ్బు తీసుకొని రమేశ్‌ ఉన్న చోటు గురించి చెప్తానన్నాడు. కానీ.. 4 సాయంత్రానికే రమేశ్‌ మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అలా రమేశ్‌ హత్య గురించి బయటపడింది. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సీసీ టీవీ పుటేజీని పరిశీలించి.. రాజునాయక్‌ను, అతడి భార్యలను అదుపులోకి తీసుకున్నారు. రమేశ్‌ను తాను హత్య చేశానని రాజునాయక్‌ ఒప్పుకొన్నట్టు సమాచారం.

Courtesy Andhrajyothi