300 మంది సిబ్బంది ఉంటే అనుమతి అక్కర్లేదు: కేంద్రం

న్యూఢిల్లీ : వ్యవసాయరంగ బిల్లులపై దుమారం తగ్గక ముందే వివాదాస్పదమైన మరో 3 బిల్లులకు కేంద్రం ఏకపక్షంగా పార్లమెంట్‌ ఆమోదముద్ర వేయించుకుంది. కార్మిక లోకం ముక్తకంఠంతో నిరసిస్తున్న 3 లేబర్‌ కోడ్స్‌ బిల్లులను మంగళవారం లోక్‌సభ, బుధవారం రాజ్యసభ ఆమో దించాయి. ఈ బిల్లులు ఇక రాష్ట్రపతి ఆమోదానికి వెళ్లనున్నాయి. ఈ బిల్లులు వృత్తిపరమైన, సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలకు సంబంధించినవి. ఈ బిల్లుల ఆమోదంతో 26 కేంద్ర కార్మిక చట్టాలను 4 కోడ్స్‌గా విభజించింది. ఇందులో చిన్న కంపెనీలకు ప్రభుత్వం ఓ వెసులుబాటు కల్పించింది. 300 మంది దాకా సిబ్బంది ఉన్న కంపెనీలు ప్రభుత్వ అనుమతి లేకుండానే సిబ్బందిని తొలగించవచ్చు, లేఆఫ్‌ ప్రకటించవచ్చు. కంపెనీని కూడా మూసేయొచ్చు. ఇప్పటిదాకా 100మంది సిబ్బంది ఉన్న కంపెనీలకే ఈ రూల్‌ వర్తించేది. ‘‘ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు ఉద్యోగ, సామాజిక భద్రత ఏర్పడుతుంది. ఉపాధి కల్పనా పెరుగుతుంది. పెద్ద కంపెనీలు పెట్టుబడి పెట్టి, ఫ్యాక్టరీలు నెలకొల్పి ఎక్కువ సంఖ్యలో సిబ్బందిని నియమించుకుంటాయి’’ అని కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గంగావర్‌ చెప్పారు.

కార్మిక సంఘాల నిరసన.. త్వరలో ప్రత్యక్ష కార్యాచరణ
కార్మిక సంఘాలు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. సిబ్బంది సంఖ్య ఎంత ఉన్నా అనేక కంపెనీలు హైర్‌ అండ్‌ ఫైర్‌ విధానాన్ని అమలు చేస్తూనే ఉన్నాయని, 300 సంఖ్య చెప్పి తీసివేతకు, మూసివేతకు చట్టబద్ధత కల్పించడం సరికాదంటున్నాయి. ‘‘దేశంలోని 6.13 కోట్ల కంపెనీల్లో 80ు 100-300లోపు సిబ్బంది ఉన్నవే. అనుమతి లేకుండా తీసేయడం కార్మిక వ్యతిరేక నిర్ణయం. యాజమాన్యాలు ఇష్టానుసారం ప్రవర్తిస్తాయి. పారిశ్రామిక వివాదాల చట్టం నిర్వీర్యమవుతుంది. దేశంలో లక్షల మంది కార్మికులు రోడ్డున పడతారు’’ అని ఏఐటీయూసీ కార్యదర్శి జి ఓబులేసు ఆంధ్రజ్యోతికి చెప్పారు. మరో కీలక నిబంధన ఏంటంటే సమ్మె చేయాలంటే 14 రోజులు ముందుగా నోటీసు ఇవ్వాలి. ఇన్నాళ్లూ అత్యవసర సర్వీసుల వరకే ఈ నిబంధన అమలయ్యేదని, ఇపుడు అన్నింటికీ దీనిని తప్పనిసరి చేశారని యూనియన్లు అంటున్నాయి. దీని వల్ల సంస్థలు క్రమశిక్షణారాహిత్యం పేరుతో కార్మికులను వెళ్లగొడతాయని ఐఎంటీయూసీ నేత మురళీకృష్ణ దుయ్యబట్టారు. ఇది పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చే కోడ్స్‌ అని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎం సాయిబాబు విమర్శించారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంఘం భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ సహా అనేక సంఘాలు బుధవారం ప్రదర్శనలు చేశాయి. ప్రధానికి, కార్మికమంత్రికి, అన్ని రాష్ట్రాల సీఎంలకు, లేబర్‌ కమిషనర్లకు వినతి పత్రాలు పంపాయి. ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించిన సంఘాలు 25న ఢిల్లీలో సమావేశం నిర్వహించనున్నాయి.

Courtesy Andhrajyothi