పిటిషన్లు దాఖలు చేసిన హిందూ, ముస్లిం సంస్థలు

న్యూఢిల్లీ: ఆయోధ్యలో రామ జన్మభూమి వివాదం తర్వాత ఇప్పుడు కాశీ, మధుర వంతు వచ్చింది. ఈ అంశంపై విశ్వ భద్ర పూజారీ పురోహిత్‌ మహాసంఘ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ముస్లిం సంస్థ జమియత్‌-ఉలేమా-ఇ-హింద్‌ అత్యున్నత న్యాయన్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసులో తమను పార్టీగా చేర్చుకోవాలని అభ్యర్థించింది. ఆరాధన స్థలాల చట్టం-1991లోని సెక్షన్‌-4ను సవాలు చేస్తూ మహాసంఘ్‌ ఇటీవల అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ వేసింది. కాశీ, మధురల్లో చట్టపరమైన చర్యలను తిరిగి ప్రారంభించాలని కోరింది. అయితే దీనిపై ధర్మాసనం నోటీసులు జారీచేస్తే ఆయోధ్య వివాదం తర్వాత తమ ప్రార్థనా స్థలాల గురించి ముస్లిం సమాజంలో భయాందోళనలు, అభద్రతా భావం తలెత్తుతాయని. ఇది దేశ లౌకిక విధానాన్ని దెబ్బతీస్తుందని జమియత్‌ తన పిటిషన్‌లో పేర్కొంది.

1947 ఆగస్టు 15నాటికి పవిత్ర నిర్మాణాల ‘మతపరమైన స్వభావాన్ని’ యథాతథంగా కొనసాగించడానికి ఆరాధన స్థలాల చట్టం-1991 అనుమతించింది. అప్పటికే మతపరమైన స్థలాలుగా ఉన్నవి భవిష్యత్తులో అలాగే కొనసాగుతాయని పేర్కొంది. అయితే అయోధ్యపై అంతకుముందు నుంచే వివాదం ఉండటంతో పాటు అప్పటికే చట్టపరమైన చర్యలు కూడా ప్రారంభమైనందున దాన్ని ఈ చట్టం నుంచి మినహాయించారు.

Courtesy Andhrajyothy