హిందూ యువతి వివాహానికి ముస్లిం కుటుంబాల అండ

న్యూఢిల్లీ : ‘హిందూ – ముస్లిం అనే తేడా లేకుండా ఎన్నో ఏండ్లుగా కలిసిమెలసి సోదర భావంతో ఇక్కడే ఉంటున్నాం. ఆనందంగా ఉండాల్సిన సమయంలో మా కండ్ల ముందే అమ్మాయి పెళ్లి ఆగిపోతుండటం తట్టుకోలేక పోయాం. అందుకే దగ్గరుండి పెండ్లి చేశాం’ అని ఈశాన్య ఢిల్లీలోని చాద్‌బాగ్‌ మహిళ సమీనా బేగం తెలిపారు. మత హింసతో ఈశాన్య ఢిల్లీలో 42 మంది మరణించగా, అనేకమంది ఆస్పత్రుల పాలైన సమయంలో హిందూ యువతి సావిత్రి పెండ్లి ఆగకుండా ముస్లిం కుటుంబాలు రక్షణగా నిలిచి వివాహం చేయడం మతసామరస్యం, లౌకిక భావనను చాటిచెప్పాయి. ముస్లింలు అధికంగా నివసిస్తున్న చాంద్‌బాగ్‌ ప్రాంతంలో బోడే ప్రసాద్‌ కుటుంబం నివసిస్తోంది. ఆయన కుమార్తె సావిత్రి వివాహం ఈ నెల 25న నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం నుంచీ అల్లర్లు ప్రారంభం కావడంతో వివాహం ఆగిపోతుందని పెండ్లికూతురు ఏడుస్తుండటంతో, పొరుగున ఉన్న ముస్లిం కుటుంబాలు వారికి అండగా నిలిచాయి. ఆ కుటుంబాల్లో యువకులంతా రక్షణగా నిలిచి ఇంటి ఆవరణలోనే మంగళవారం వివాహం జరిపించారు. స్థానిక ముస్లింలంతా వివాహానికి హాజరై, వారిని ఆశీర్వదించారు. అనుకున్న సమయానికే వివాహం జరగడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ‘పెండ్లికి మా బంధువులెవరకూ హాజరు కాలేకపోయినప్పటికీ ముస్లిం సోదరుల సహకారంతో జరగడం చాలా సంతోషంగా ఉంది’ అని పెళ్లి కూతురు తండ్రి ప్రసాద్‌ ఆనందం వ్యక్తం చేశారు.

Courtesy Nava telangana