* ఒకే భాష.. ఒకేదేశం వెనుక ‘హిందూ మతతత్వ రాజ్యం
* అమిత్‌ షా వ్యాఖ్యలపై వివిధ రాష్ట్రాల్లో నిరసన
* అంతా ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యూహం ప్రకారమే :రాజకీయ విశ్లేషకులు
* భిన్న భాషలు, భిన్నమతాలు.. అడ్డువస్తున్నాయని..

‘హిందీ దివస్‌’ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దేశవ్యాప్తంగా ఒకే భాష… అదీ హిందీయే ఉండాలని చెప్పటం రాజకీయ దుమారాన్ని రేపింది. హిందీ భాషతోనే దేశ ఐక్యత సాధ్యమవుతుందన్నట్టు ఆయన చెప్పటం వివాదాస్పదమైంది. ఈశాన్య రాష్ట్రాల్లో హిందీ తప్పనిసరి చేయనున్నామని ప్రకటించారు. రాజకీయంగా ఇదంతా ఒక వ్యూహం ప్రకారం జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. భారతదేశాన్ని ‘లౌకిక రాజ్యం’గా కాకుండా ‘హిందూ మతతత్వ రాజ్యం’గా ఆవిష్కరించాలనే లక్ష్యంతో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌) పనిచేస్తోంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవటం కోసం ‘నూతన జాతీయ విద్యా విధానం, ముసాయిదా బిల్లు’ తెరమీదకొచ్చిందనీ, తాజాగా అమిత్‌ షా మాటలు అదేవిధంగా ఉన్నాయనీ ఢిల్లీ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో 44శాతం మంది ప్రజలు హిందీ భాషను మాట్లాడుతున్నారని అమిత్‌ షా అన్నారు. తద్వారా అత్యధిక శాతం (56శాతం) ప్రజలు హిందీ భాషను మాట్లాడటం లేదన్న సంగతి ఆయనే ఒప్పుకున్నారని స్పష్టమైంది. దేశం నలుమూలలా పెద్ద పెద్ద రాష్ట్రాల్లో పౌరులంతా తమ మాతృభాషల్లోనే విద్యనభ్యసిస్తున్నారు. ప.బెంగాల్‌, మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో హిందీకన్నా, ఆంగ్ల భాషకు ఎక్కువగా ప్రాధాన్యత సంతరించుకుంది. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో పొందుపర్చిన 21 హిందీయేతర భాషలు మాట్లాడేవారి సంఖ్య (2011 జనాభా లెక్కల ప్రకారం) 64కోట్లుగా ఉందని తేలింది. పెద్ద పెద్ద రాష్ట్రాల్లో ‘హిందీ భాష’ను తప్పనిసరి చేస్తే అక్కడి ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

దక్షిణాదిన తీవ్ర వ్యతిరేకత
అమిత్‌ షా తాజా వ్యాఖ్యల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, తెలంగాణ, కర్నాటకల నుంచి ఆందోళన వ్యక్తమైంది. భాషాపరంగా తమ సంస్కృతి, అస్తిత్వానికి మోడీ సర్కార్‌-2 దెబ్బ కొట్టనుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా రాష్ట్రా ల్లో వివిధ రాజకీయ పక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. పార్లమెం ట్‌లో తనకున్న బలాన్ని చూసుకొని దేన్నైనా చేయొచ్చని మోడీ- అమిత్‌ షా ద్వయం భావిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

గుజరాత్‌ హైకోర్టు వ్యాఖ్యలను మరిచారా? : ఎండి సలీం
హిందీ పరాయి భాష అంటూ 2012లో గుజరాత్‌ హైకోర్టు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను గుర్తు చేస్తూ.. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ ఎంపీ మహ్మద్‌ సలీం.. అమిత్‌ షా ప్రకటనను ఖండించారు. భారతీయులందరినీ కలిపి ఉంచే రాజభాష హిందీ అని అమిత్‌ షా అంటున్నారు గానీ, హిందీని ఫారిన్‌ లాంగ్వేజ్‌గా గుజరాత్‌ హైకోర్టు చేసిన ప్రకటనపై అప్పుడు గుజరాత్‌ సీఎంగా ఉన్న మోడీ, అమిత్‌ షా ఎందుకు నిరసన వ్యక్తం చేయలేదని ప్రశ్నిం చారు. హిందీ భారతీయ భాషే కాదని సిపిఎం లిబరేషన్‌ ట్వీట్‌ చేసింది.

ఒకే భాషను ఎలా రుద్దుతారు : ఏచూరి
విభిన్న భాషల గల దేశంలో ఒకే భాషను ఎలా రుద్దుతారని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రశ్నించారు. భిన్నత్వంలో ఏకత్వమనేది మరిచిపోవద్దని హితవు పలికారు. శనివారం నాడిక్కడ ఆయనను కలిసిన మీడియాతో మాట్లాడారు. భారతదేశం ”యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌” అని రాజ్యాంగంలోని మొదటి ఆర్టికల్‌ స్పష్టం చేస్తుందని తెలిపారు. దేశం ఒకటేనని, ఫెడరల్‌ విధానంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. భిన్నత్వం గల దేశంలో ఒకే భాషను ఎలా రుద్దుతారని ప్రశ్నించారు. ఒకే భాష ప్రకటన చాలా తీవ్రమైన అంశమని పేర్కొన్నారు. దేశంలో భిన్నత్వంలో ఏకత్వంతోనే వైవిధ్యాన్ని గౌరవిస్తామని తెలిపారు. అది లేకుండా ఐక్యం కాదని, పటిష్టవంతం కాదని చెప్పారు. అధికారంలో ఉన్న బిజెపి దాన్ని విస్మరిస్తుందని విమర్శించారు. రాజ్యాంగంలోని ప్రాథమిక మూల సూత్రానికి అది విరుద్ధమని పేర్కొన్నారు. నిర్మాణాత్మక సూత్రాలకు వ్యతిరేకంగా ప్రస్తుత ప్రభుత్వం తరపున ప్రకటనలు చేస్తున్నారని, అన్ని పార్లమెంటరీ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

(Courtacy Prajashakti)