• కారాగారాల్లో ఉన్నత విద్యావంతులు
  • తొలిస్థానంలో యూపీ.. ఏడో స్థానంలో తెలంగాణ

మీరట్‌ (ఉత్తరప్రదేశ్‌) : వాళ్లంతా ఉన్నత విద్యావంతులు. ఇంజనీర్లు, డాక్టర్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు, అత్యున్నత సాంకేతిక నిపుణులు. తమ మేధస్సుతో దేశానికి సేవ చేయాల్సిన వీళ్లు.. వివిధ కారణాల వల్ల ప్రస్తుతం జైళ్లలో మగ్గుతున్నారు. కొందరు వరకట్న వేధింపులు/హత్య నేరాలతో జైళ్ల పాలైతే.. మరికొందరు అత్యాచారాల కేసుల్లో జైలు జీవితం గడుపుతున్నారు. ఇంకొందరు అత్యాశతో ఆర్థిక నేరాలు చేసి కటకటాల పాలయ్యారు. కొందరు నేరం రుజువై శిక్ష అనుభవిస్తుండగా.. మరికొందరు నిందితులుగా జైళ్లలో మగ్గుతున్నారు. ఈ వివరాలను నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) తాజాగా విడుదల చేసిన ‘క్రైమ్‌ ఇన్‌ ఇండియా’ 2019 రిపోర్టులో వెల్లడించింది. దీని ప్రకారం.. దేశంలోని జైళ్లు విద్యావంతులతో నిండిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్‌ జైళ్లలోనైతే ఈ సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం 3,740 మంది ఇంజనీర్లు జైళ్లలో మగ్గుతుండగా.. ఒక్క యూపీలోనే 727 మంది ఉంటున్నారు. 495 మందితో మహారాష్ట్ర, 362 మందితో కర్ణాటక ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అలాగే, పోస్టు గ్రాడ్యుయేట్‌ ఖైదీల్లో కూడా యూపీనే అగ్రస్థానంలో నిలిచింది.

దేశవ్యాప్తంగా ఉన్న 5,282 మంది పోస్టు గ్రాడ్యుయేట్‌ ఖైదీల్లో.. 2,010 మంది ఆ రాష్ట్ర జైళ్లలోనే మగ్గుతున్నారు. 562 మందితో రాజస్థాన్‌, 456 మందితో మధ్యప్రదేశ్‌ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో మన తెలంగాణ కూడా 213/170 స్కోరుతో ఏడో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా మొత్తం 3,30,487 మంది ఖైదీలు ఉండగా.. వీరిలో 2.69 శాతం ఉన్నత విద్యావంతులేనని ఆ నివేదిక పేర్కొంది. వీరికున్న జ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని జైళ్ల అభివృద్ధికి వినియోగించుకుంటున్నామని యూపీ జైళ్ల శాఖ డీజీ ఆనంద్‌ కుమార్‌ వెల్లడించారు.

Courtesy Andhrajyothi