– కొండూరి వీరయ్య

కొండూరి వీరయ్య

గత కొంత కాలంగా న్యాయపాలనా వ్యవస్థలో అనేక పరిణామాలు జరుగుతున్నాయి. కాశ్మీర్‌లో దాదాపు ఏడునెల్ల నుంచి ఇంటర్నెట్‌ స్తంభించింది. పోటీ పరీక్షల అభ్యర్థులు కనీసం తమ దరఖాస్తులు పెట్టుకోవటానికి కానీ, ఆస్పత్రులు కనీసం అవసరమైన మందులు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయటానికి కానీ, తల్లులు పసిపిల్లలకు కావల్సిన ప్రొటీన్‌ ఆహారం కొనుగోలు చేయటానికి కానీ ఇంటర్నెట్‌ అందుబాటులో లేకుండా పోయింది. అదే సమయంలో జమ్ము కాశ్మీర్‌లో పెట్టుబడులు పెట్టే వారికి మాత్రం సమాచార ప్రసార సాధనాలు సంపూర్ణంగా అందుబాటులో ఉంటాయని, ఇంటర్నెట్‌ నిరవధికంగా అందుబాటులో ఉంటుందని కేంద్రం ప్రకటించింది. వేలాదిమందిని కేంద్ర ప్రభుత్వం నిర్బంధించింది. వీరికి బెయిల్‌కు అవకాశం లేదు. చివరకు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు కాశ్మీర్‌ లోయలో ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే శక్తి కలిగి ఉన్నారు కాబట్టి వారిని పౌర భద్రత చట్టం కింద ఖైదు చేసింది. మరోవైపున అసోంలో ఎన్నార్సీ, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలు కావటంతో ఈశాన్య రాష్ట్రాల్లో సైతం ఇంటర్నెట్‌ నిలిపివేస్తూ ప్రభుత్వాలు ఆదేశించాయి. ఈ పరిస్థితిని, దానికి దారి తీసిన ప్రభుత్వ నిర్ణయాలను సవాలు చేస్తూ పదుల సంఖ్యలో పిటిషన్లు సుప్రీం కోర్టులో దాఖలయ్యాయి.

సుప్రీం కోర్టులో మరో తరహా పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. వందలాదిమంది తమ కుటుంబ సభ్యుల ఆచూకీ తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హెబియల్‌ కార్పస్‌ (మనిషిని హాజరుపర్చండి) సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అటువంటి 150పిటిషన్లను సుప్రీం కోర్టు జమ్ము కాశ్మీర్‌ హైకోర్టుకు బదలాయించింది. హెబియల్‌ కార్పస్‌ ఫిర్యాదుకు సుప్రీంకోర్టు కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. సాధారణ చట్టపరమైన అర్థంలో హెబియస్‌ కార్పస్‌ అంటే కనిపించకుండా పోయిన వ్యక్తుల ఆచూకీ ప్రభుత్వాలే గుర్తించి కోర్టు ముందు హాజరుపర్చటం. కానీ 370రద్దు నేపథ్యంలో రాజకీయ పార్టీలకు చెందిన వందలాదిమంది నాయకులను, సామాజిక కార్యకర్తలను, కాస్తంత గొంతెత్తే అలవాటు ఉన్న వారినందరినీ కేంద్ర హౌం శాఖ నిర్భంధించింది. కనీసం ఎక్కడ నిర్బంధించిందో కూడా కుటుంబసభ్యులకు చెప్పలేదు.. నిర్భంధానికి గురై అదృశ్యమైన వారిని కోర్టుముందు హాజరు పర్చాలన్న అభ్యర్థనలు సుప్రీం కోర్టుకు వచ్చాయి. ఇటువంటి కొన్ని కేసులు విచారించిన సుప్రీం కోర్టు సదరు కనిపించని వ్యక్తి ఎక్కడున్నాడో అక్కడికే వెళ్లి చూసి రావాలని ఆదేశాలిచ్చింది. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు యూసఫ్‌ తరిగామి విషయంలో జరిగింది అదే. అటువంటి వందలాది కేసులను హైకోర్టుకు బదలాయించింది.
సుప్రీం కోర్టు ముందు మూడో తరహా పిటిషన్లు విచారణలో ఉన్నాయి. డిశంబరు రెండో వారంలో కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని డజన్లకొద్దీ పిటిషన్లు దాఖలయ్యాయి. ఏకంగా పౌర హక్కులను, రాజ్యాంగ విలువలను ప్రశార్థకంగా మారుస్తున్న ఈ చట్టాన్ని రద్దు చేయాలని ఈ పిటిషన్లలో కోరారు. రాజ్యాంగ పునాదులకు సంబంధించిన ప్రశ్నలపై దాఖలైన పిటిషన్లను తక్షణమే సుప్రీం కోర్టు విచారణ చేపట్టటానికి బదులు దేశంలో ఈ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు నిలిపి వేస్తే తప్ప పిటిషన్ల విచారణ చేపట్టనని మొరాయించింది. బహుశా ఏ దేశంలోనూ అత్యున్నత న్యాయస్థానం వ్యవహరించిన దాఖలాలు ఈ మధ్య కాలంలో ఎదురుకాలేదు. అదే సమయంలో టెలికం కంపెనీలు తాము కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించిన కేసులు మాత్రం ఒక్కనెల్లో మూడు సార్లు అడ్మిట్‌ అయ్యాయి. పైగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వాణిజ్యలావాదేవీలతో ముడిపడి ఉన్న కేసులను సాధ్యమైనంత త్వరగా తేల్చేయాలని హితవు పలికారు.

చివరిగా ప్రభుత్వాలు మరోరకమైన కేసులు నమోదు చేస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న వారిపై ప్రభుత్వాలు మోపుతున్న కేసులివి. ఉత్తరప్రదేశ్‌లో పౌరసత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నారన్న అనుమానంతో వందకు పైగా ప్రజలపై కేసులు నమోదయ్యాయి. గుర్తించిన వారిపై ఈ నిరసనల కారణంగా ప్రభుత్వ ఆస్తులు, పౌర ఆస్తులు ధ్వంసమయ్యాయని, వాటికి నష్టపరిహారం నిరసనకారులే భరించాలని పోలీసులు కేసులు నమోదు చేశారు. చిన్నపిల్లలు ప్రదర్శించిన ఓ నాటికలో ప్రభుత్వ వ్యతిరేక వాక్యాలు ఉన్నాయన్న ఆరోపణతో కర్నాటకలోని బీదర్‌లో విద్యార్థుల తల్లులను రెండు వారాలుగా జైల్లో పెట్టారు. షాహీన్‌బాగ్‌ ఆందోళనలో పాల్గొన్న షర్జిల్‌ ఇమామ్‌ అనే వ్యక్తి జాతి వ్యతిరేక ఉపన్యాసం చేశాడన్న ఆరోపణపై అసోం ప్రభుత్వం కేసు నమోదు చేసింది. గోరఖ్‌పూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో పసిపిల్లల మరణం వెనక రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణమని ఆరోపించిన డాక్టర్‌ కఫీల్‌ ఆలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీలో ఇచ్చిన ఓ ఉపన్యాసం వల్ల ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయని, విద్యార్థులు దేశద్రోహులుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో జైలుకు పంపింది ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం. బెయిల్‌ తెచ్చుకున్న ఈ డాక్టర్ని జైలుగోడలు దాటక ముందే జాతీయ భద్రతా చట్టం కింద మరో కేసు పెట్టి అరెస్ట్‌ చేసింది. ఈ చట్టం కింద అరెస్టయితే ఏడాది వరకు బెయిల్‌ పొందటం కూడా కష్టం.

అదే సమయంలో జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై ముసుగు దాడి చేసిన దుండగులను కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు గుర్తించలేకపోయింది. అరెస్టు ఊసే లేదు. ఈ దాడికి ముందు వాట్సప్‌ గ్రూపుల్లో వివరంగా కుట్ర పథకం రూపొందించుకున్న సంగతి పాఠకులకు తెలుసు. జామియా యూనివర్సిటీలో విద్యార్థులపై కాల్పులకు బరితెగించిన పోలీసులపై కేసులు నమోదు చేయాలని వైస్‌ చాన్సలర్‌ విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. జామియా, షాహీన్‌బాగ్‌ ప్రాంతాల్లో నిరసనకారులపై కాల్పులు జరిపిన వారిని, ప్రభుత్వ వ్యతిరేకులను కాల్చి పారేయాలన్న మంత్రులను, ఎంపీలను ప్రభుత్వం మందలించిన పాపాన పోలేదు. ఈ సంఘటనలన్నీ న్యాయవ్యవస్థలో చోటుచేసుకుంటున్న కీలకమైన మార్పులను, మారుతున్న న్యాయవ్యవస్థ ప్రాధాన్యతలను ముందుకు తెస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రాజ్యాంగ స్ఫూర్తిలో న్యాయవ్యవస్థ పాత్ర ఏమిటన్న ప్రశ్న ముందుకొస్తోంది.
పైన ప్రస్తావించిన ఉదాహరణలన్నింటిలో కనిపించే ఉమ్మడి అంశం ఒక్కటే. పౌర హక్కులు. ప్రాధమిక హక్కులు. చట్టబద్ధ హక్కులు భవిష్యత్తు గురించిన ప్రశ్న అది. భారతీయులందరికీ ప్రాథమిక హక్కులు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని రాజ్యాంగం ఆదేశించింది. అటువంటి ప్రాథమిక హక్కుల్లో జీవించే హక్కు కీలకమైనది. స్వాతంత్య్రానంతరం దాదాపు నాలుగు దశాబ్దాల పాటు జీవించే హక్కుకు విస్తృతార్థాన్ని ఇవ్వటంలో సుప్రీం కోర్టు కీలక పాత్ర పోషించింది. ఏ ప్రభుత్వ నిర్ణయమైనా, చట్టమైనా భారతీయుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినప్పుడు పౌరులు, వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న పలు సంస్థలు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 32 కింద సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చు. తమ హక్కుల్ని తిరిగి పొందవచ్చు. అందుకే ఈ ఆర్టికల్‌ 32ను రాజ్యాంగానికి గుండెకాయగా అభివర్ణించాడు డాక్టర్‌ అంబేద్కర్‌. కానీ గత మూడు దశాబ్దాలుగా ఈ ప్రాధమిక హక్కులను కుదించుకుంటూ రావటంలో కూడా సుప్రీం కోర్టుదే కీలక పాత్ర అయ్యింది. న్యాయపాలనలో ప్రాథమిక ప్రమాణాలు, రాజ్యాంగ స్ఫూర్తి నుంచి వైదొలగుతున్న న్యాయస్థానాల స్వభావం ఈ మూడు దశాబ్దాల్లో బహిర్గతమైనంతగా మరెన్నడూ బహిర్గతం కాలేదు. పైన చెప్పిన అన్ని ఉదాహరణల్లోనూ ఈ ధోరణి పరాకాష్టకు చేరింది.

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అత్యవరపరిస్థితిని విధించేంతవరకు దేశంలోని అన్ని వ్యవస్థలు జాతి నిర్మాణంలో పురోగామి పాత్ర పోషించాయి. నాటి ఆర్థిక సంక్షోభం ఉధృతమయ్యే కొద్దీ దేశంలో రాజకీయ సంక్షోభం కూడా ముదురుతోంది. ఈ రాజకీయ సంక్షోభాన్ని పునాదిగా చేసుకుని సామాజిక మార్పు దిశగా సమజాన్ని నడిపించాల్సిన ప్రగతిశీల శక్తులు వెనకపట్టు పట్టిన కాలం కూడా అదే. ప్రజాస్వామ్యంలో పెరుగుతున్న నిరంకుశ ధోరణులకు మరో వ్యక్తీకరణే ప్రజాతంత్ర హక్కులు, కనీస ప్రాథమిక హక్కుల రద్దు దిశగా న్యాయస్థానాలే చొరవ చూపించటం. ఈ చొరవ అవసరం లేని విషయాల్లో చొరవ ప్రదర్శించటం, అవసరమైన విషయాల్లో చొరవ ప్రదర్శించకపోవటం వంటి రెండు రూపాల్లోనూ జరుగుతుంది. దీన్నే మరోలా చెప్పుకోవాలంటే రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజాతంత్ర హక్కులను పరిరక్షించటానికి బదులు న్యాయవ్యవస్థ మార్కెట్‌ శక్తులు, వాటి అవసరాలను ప్రాధాన్యతలుగా పరిగణిస్తాయి. దేశమంతా పౌరహక్కులు, రాజ్యాంగ హక్కుల సంక్షోభంలో కూరుకుపోతుంటే ఈ హక్కులను కాపాడాల్సిన సుప్రీం కోర్టు పౌర హక్కులు, ప్రజాతంత్ర హక్కులు, రాజ్యాంగం ఖాయం చేసిన ప్రాథమిక హక్కుల పరిరక్షణకు బదులు కంపెనీలు, వాటి యజమానులను పెట్టుబడిదారులు, వారి లాభాలకు ప్రాధాన్యతనిచ్చే దిశగా తీర్పులు వస్తున్నాయి.

ఈ ధోరణి గతంలో అత్యవసర పరిస్థితిలో ఓసారి వ్యక్తమైంది. ప్రాథమిక హక్కులు రద్దు కూడా రాజ్యాంగ బద్ధమే అని కూడా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. నాడు ఎగసిన ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమంలో సుప్రీం కోర్టు రాజ్యాంగానికి ఇచ్చిన తప్పుడు వ్యాఖ్యానాలను సరి చేసి న్యాయవ్యవస్థను పౌర ప్రాధాన్యతల దిశగా నడిపించటంలో కీలకపాత్ర పోషించింది. నాడు న్యాయవ్యవస్థకు అంటిన కళంకాన్ని కడుక్కోవటానికి న్యాయవ్యవస్థకు ప్రజా ప్రయోజన వ్యాజ్యం సాధనంగా అక్కరకొచ్చింది. ఈ సాధనాన్ని ఉపయోగించి పౌర హక్కులు, ప్రాథమిక హక్కులతో పాటు కార్మిక హక్కులు, కనీస వేతనాల పరిరక్షణ వంటి విషయాల్లో కూడా సుప్రీం కోర్టు సానుకూలంగా వ్యవహరించి న్యాయవ్యవస్థలో నూతన క్రియాశీలతకు పునాదులు వేసింది. కానీ ఆర్థిక సంస్కరణల సారాన్ని ఆకళింపు చేసుకొనేలా చేయటంలో ఇదే ప్రజా ప్రయోజన వ్యాజ్యం సంస్కరణల కాలంలో పాలక వర్గానికి ఆయుధమైంది. గోరక్షణ మొదలు నిరక్షరాస్యులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయరాదన్న తీర్పులు, ఇంట్లో పాయిఖానా లేకుండా పంచాయతీ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యే అర్హత కోల్పోతారన్న తీర్పులకు కూడా ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలే కారణమయ్యాయి.

రాజ్యాంగ పరిరక్షణ సాధనంగా వ్యవహరించాల్సిన న్యాయ వ్యవస్థ కాలక్రమంలో దోపిడీ వ్యవస్థల పరిరక్షణ సాధనంగా మారుతున్న తీరు అర్థమవుతుంది. ఈ దోపిడీ వ్యవస్థల పరిరక్షణలో కీలకమైన భాగం పౌర హక్కుల నియంత్రణ, ఇంకా చెప్పాలంటే ప్రజాతంత్ర హక్కులకు మంగళం పాడటం. గత మూడు దశాబ్దాల్లో న్యాయ వ్యవస్థ పని తీరు పౌరహక్కుల పరిధిని, ప్రాథమిక హక్కుల పరిధిని కుదించటంతో మొదలై నేడు ఏకంగా ప్రజాతంత్ర హక్కులను భూస్థాపితం చేసే పాలకవర్గాలకే తోడ్పడుతోంది. గత రెండేండ్లుగా వస్తున్న పలు తీర్పుల్లో సుప్రీం కోర్టు క్రియాశీలత, నిష్క్రియాపరత్వాలకు కారణం ఇదే. ఈ ప్రమాదాన్ని గుర్తించినందునే రాజ్యాంగ నిపుణులు ఉపేంద్ర బక్షి, గౌతం భాటియాలు రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత న్యాయ స్థానాలకు వదిలే సమయం కాదని, రాజ్యాంగ నిర్మాతలైన ప్రజలే, భారతీయులమైన మేము.. అని రాజ్యాంగాన్ని తమకు తాము అంకితం ఇచ్చుకున్న ప్రజలే ఈ కర్తవ్యాన్ని చేపట్టాలనీ, రాజ్యాంగ నిపుణులన్న కిరీటం తగిలించిన కొందరికి ఈ కర్తవ్యం అప్పగిస్తే రాజ్యంగ మూల పునాదులకే ముప్పువచ్చే పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరించారు. –