యోగేంద్ర యాదవ్ (స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు)

దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, ఇతర వెనుకబడిన వర్గాల యువజనులు మున్నెన్నడూ లేని విధంగా ఉన్నత విద్య కోసం ఆరాటపడుతున్నారు. విద్యా రంగంలో సుదీర్ఘకాలంగా ఉపేక్షకు గురయిన ఈ సామాజిక వర్గాల వారు జీవితోన్నతిని ఉన్నత విద్య ద్వారా సాధించుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఆ విద్యావకాశాలు అత్యధికులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. హాస్టల్ ఫీజుల పెంపుదలపై జె.ఎన్‌.యు విద్యార్థుల ఆందోళనలో లోతుగా ఉన్న అంశమిది. ఆ చైతన్యశీల విద్యార్థుల పోరాటాన్ని అవ్యక్తంగా ప్రభావితం చేస్తున్న ఈ సమస్యకు మన విద్యా విధానం ప్రతిస్పందించి తీరాలి.

విద్యే అభ్యుదయం. వామపక్ష చింతనా ధోరణులకు సుప్రసిద్ధమైన జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో హాస్టల్ ఫీజుల పెంపుదలపై విద్యార్థులు గత కొన్ని వారాలుగా తీవ్ర నిరసన తెలుపుతున్నారు. హాస్టల్ ఫీజుల పెంపుతో జీవన వ్యయం పెరిగి, నాణ్యమైన ఉన్నత విద్య తమకు అందుబాటులో లేకుండా పోతుందని వారు ఆందోళన చెందుతున్నారు. గ్రామీణ ప్రాంతపు ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థిని సునీత కోణం నుంచి జేఎన్‌యూ విద్యార్థుల ఆందోళనను విలోకించి, అర్థం చేసుకుందాం.

సునీత తండ్రి ఒక సన్నకారు రైతు. ఆయనకు మూడు ఎకరాల కంటే తక్కువ భూమి వున్నది (మన దేశంలో వ్యవసాయదారుల సగటు భూ కమతం ఇంచుమించు 2.8 ఎకరాలు మాత్రమే). సునీత తల్లి ఒక సామాన్య గృహిణి. సునీతకు పదవ తరగతి చదువుతున్న ఒక తమ్ముడు వున్నాడు. నానమ్మతో సహా ఐదుగురు సభ్యులు గల కుటుంబం వారిది. జిల్లా కేంద్రానికి సమీపంలోని ఒక పల్లెలో ఆ కుటుంబం నివశిస్తుంది. సునీత చాలా తెలివైన పిల్ల బి.ఎ.లో ఆమె కళాశాల స్థాయిలో ప్రథమురాలిగా వున్నారు. ఐపీఎస్ అధికారిణి కావాలనేది ఆమె ఆశయం. తన ఆకాంక్షను నెరవేర్చుకోవడానికై జె.ఎన్.యు.లో ఎమ్.ఎ. చేయాలని ఆమె కోరుకుంటున్నది. గ్రామీణ పేద కుటుంబం, ఉపేక్షిత సామాజిక వర్గాల- దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, ఓ బీసీలు- నుంచి ఉన్నత విద్యా రంగంలోకి ప్రవేశించిన లక్షలాది తొలి తరం విద్యావంతులలో సునీత ఒకరు. ఆమె ఉన్నత విద్యాభిలాషకు ఖచ్చితంగా జ్ఞాన తృష్ణే కారణమని భావించనవసరం లేదు. సమాజంలోని మధ్యతరగతి శ్రేణుల్లో చేరాలన్న తమ ప్రగాఢ ఆరాటాన్ని నెరవేర్చుకోవడానికి డిగ్రీయే ఒక పాస్‌పోర్ట్ అన్న వాస్తవాన్ని, ఆలస్యంగానైనప్పటికీ ఎట్టకేలకు ఆ వర్గాల వారు గుర్తించారు. గత ఏడాది ఉన్నత విద్యా కోర్సులలో చేరిన మొత్తం విద్యార్థినీ విద్యార్థుల సంఖ్య 3.74 కోట్లు. (ఈ సంఖ్య ఏటా 6 లక్షల చొప్పన పెరుగుతున్నది). వీరిలో ఉన్నత విద్యారంగంలోకి అడుగిడిన తొలి తరం విద్యావంతులు 11 శాతం మేరకు ఉంటారు. వీరిలో ఒకరైన సునీత సహజంగానే మంచి ఆదాయాన్ని సమకూర్చే గౌరవనీయమైన ఉద్యోగాన్ని సాధించుకోవాలని కలలు గంటున్నది.

సునీత స్వప్నం సాకారమవుతుందా? ప్రతి ఒక్కరికీ ‘సమాన అవకాశాల’ విషయమై మన రాజ్యాంగం హమీ ఇచ్చింది. స్వీయ ప్రతిభాపాటవాల ప్రాతిపదికన, కుటుంబ ఆదాయం, జెండర్, ప్రాంతంతో సంబంధం లేకుండా ఎవరైనా తమ ఉన్నత విద్యా కాంక్షను నెరవేర్చుకోవచ్చు. మరి సునీత తన అభిలాషను నిజంగా నెరవేర్చుకోగలుగుతుందా? అందుకు ఆమె ఏమి చేయాలి? సునీత కుటుంబం మరీ పేద కుటుంబమేమీకాదు. కచ్చితంగా దారిద్ర్యరేఖకు దిగువున వున్న కుటుంబం కాదు. స్వగ్రామంలో గౌరవాదరాలు ఉన్న ఒక రైతు కుటుంబం నుంచి వచ్చింది. పంటల సాగుతో పాటు గేదెల పెంపకం కూడా ఆ కుటుంబానికి అవసరమైన ఆదాయాన్ని సమకూరుస్తుంది. గత ఏడాది వారి నెలసరి కుటుంబ ఆదాయం రూ.9350. ఈ ఏడాది అది రూ.10,000కి పెరిగిందనుకుందాం. అంటే ఆ కుటుంబ వార్షికాదాయం రూ.1.2 లక్షలు. సరే, సునీత ఎమ్‌.ఎ. డిగ్రీ సాధించుకునేందుకై జె.ఎన్‌.యు. లేదా హైదారాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయానికి వెళ్ళడానికి ఆమె తండ్రి వార్షికాదాయం దోహదం చేస్తుందా? సునీత కుటుంబం లాంటి సగటు గ్రామీణ కుటుంబం తన ఆదాయంలో సగ భాగాన్ని ఆహారం సమకూర్చుకోవడానికే ఖర్చు పెడుతుంది.

బట్టలు, విద్యుత్తు, రవాణా మొదలైన వాటి ఖర్చులు 30 శాతం మేరకు వుంటాయి. ఇక మిగిలేదెంత? 20 శాతం అంటే రూ.24,000. ఈ మొత్తాన్ని విద్య, వైద్యం, ఇతర సేవలు, చిల్లర ఖర్చులకు వినియోగించాల్సి వుంటుంది. సునీత తమ్ముని విద్యాభ్యాసానికి ఏటా రూ.3600 మాత్రమే ఖర్చవుతుంది. అతడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంటాడు. అతన్ని సమీప పట్టణంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో చదివించాలని తల్లిదండ్రులు ఆరాటపడుతుంటారు. అలా అతన్ని అక్కడికి పంపిస్తే వారికి ఏటా రూ.7800 ఖర్చవుతుంది (ఈ అంకెలు, పిల్లల విద్యాభ్యాసానికై కుటుంబాలు వెచ్చించే మొత్తాలకు సంబంధించి ఎన్‌.ఎస్‌.ఒ తాజా సర్వే నివేదిక వెల్లడించినవి).

మిమ్ములను మీరు కొద్దిసేపు సునీత తల్లిదండ్రులుగా భావించుకోండి. మీ బడ్జెట్‌ను పరిశీలించుకోండి. విద్యా వ్యయాలపై ప్రభుత్వ తాజా నివేదిక ఏమి చెబుతుందో కూడా చూడండి. సునీత ఇంటి వద్దనే వుండి సమీపంలోని ప్రభుత్వ కళాశాలకు వెళ్ళి చదువుకుంటే వార్షికంగా రూ.13,000 అవుతుందని ఆ నివేదిక లెక్కగట్టింది. సునీత వేరే చోటికి వెళ్ళి, హాస్టల్‌లో వుండి చదువుకుంటే ఆమె చదువుకయ్యే వ్యయం రెట్టింపవుతుందని ప్రభుత్వ నివేదిక స్పష్టం చేసింది. జె.ఎన్‌.యు.లో విద్యాభ్యాసానికి సంవత్సరానికి రూ.32,000 ఖర్చవుతుంది. ఈ ఖర్చు ఇతర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో అయితే రూ.50,000దాకా వుంటుంది. మరి జె.ఎన్‌.యు.లో హాస్టల్ ఫీజులను రూ.32,000 నుంచి రూ.56,000కి పెంచాలని ప్రతిపాదించడం జరిగింది (ఈ పెంపుదలకు వ్యతిరేకంగానే జె.ఎన్‌.యు. విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు). హాస్టల్‌లో వుండి చదువుకునే విద్యార్థిపై ఆ ప్రతిపాదన మరింత ఆర్థిక భారాన్ని మోపుతుంది.

ఆ విద్యార్థి కుటుంబం విధిగా ఆ అదనపు ఆర్థిక భారాన్ని మోయ వలసివుంటుంది. సునీత విషయానికి వద్దాం. గుర్తుంచుకోండి, మనం ఒక పేద కుటుంబం గురించైనా ఆలోచించడం లేదు. సునీత ఒక సగటు గ్రామీణ కుటుంబానికి ప్రతినిధి. గ్రామీణ భారతంలోని సగం కుటుంబాల కంటే ఆమె కుటుంబం చాలా మెరుగైన స్థితిలో వున్నది. ఈ అంచనాలన్నీ ఆమె ఎమ్‌.ఎ. చదువు గురించి మాత్రమే. ఆమె అభిలషిస్తున్న అదనపు కోర్సుల ఖర్చుల గురించి గానీ, ట్యూషన్, కోచింగ్‌లకు అయ్యే ఖర్చుల గురించి గానీ నేను మాట్లాడడం లేదు. బి.టెక్. లేదా బి.ఎ.ఎమ్‌.ఎస్ (బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ) ఇత్యాది సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల గురించి ఆమె ఆలోచించడం లేదు. ఆమె ఆ కోర్సులలో గనుక చేరితే, ఒక సాధారణ ప్రభుత్వ కళాశాలలోనే ప్రాథమిక ఫీజు రూ.50,000 దాకా ఉంటుంది మరి. మీరు వినని, ఎలాంటి ప్రత్యేక గుర్తింపులేని ప్రైవేట్ వృత్తి విద్యా కళాశాలల్లో ఆ కోర్సులు చేయడానికి ఏడాదికి కనీసం రూ.2లక్షల వ్యయమవుతుంది. ఉన్నత ఆదాయవర్గాల వారికి మాత్రమే అందుబాటులో ఉండే ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో అయితే ఆ కోర్సులు చేయడానికి ఏడాదికి 8 నుంచి 10 లక్షల రూపాయలు వెచ్చించవలసివుంటుంది.

ఉపకార వేతనాల మాటేమిటి? నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ చూడండి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపకార వేతనానికి ఆమె అర్హురాలే. ఏడాదికి రూ.20,000 చొప్పున ఇస్తారు. అయితే ఆ ఉపకార వేతనానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఆమెకు లేదు. ఎందుకంటే 12 తరగతిని పూర్తి చేసిన వెంటనే ఆ ఉపకారవేతనానికి దరఖాస్తు చేసుకోవల్సి వుంటుంది. ఇంతకూ ఆ ఉపకార వేతనాన్ని ఏటా కేవలం 82,000 మందికి మాత్రమే అందిస్తున్నారు. భారత ప్రభుత్వ వివిధ మంత్రిత్వ శాఖలు ఉన్నత విద్యారంగంలో ఉపకార వేతనాలకు మొత్తం రూ.1801 కోట్లు వెచ్చిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ విద్యా బడ్జెట్‌లో ఇది కేవలం 2.6 శాతం మాత్రమే. ఏడాదికి 1.4 లక్షల మందికి ఉపకార వేతనాలు అందిస్తున్నారు. ఈ ప్రకారం 2014-–15లో ఉన్నత విద్యా కోర్సులలో చేరిన మొత్తం విద్యార్థులలో ఉపకార వేతనాలు పొందిన వారి సంఖ్య 2 శాతం కంటే తక్కువ! ఆ ఏడాది ఉన్నత విద్యా కోర్సులలో చేరిన మొత్తం విద్యార్థులకు, ఆ ఉపకార వేతనాల మొత్తాన్ని సమానంగా పంపిణీ చేస్తే ఒక్కొక్కరికీ లభించేది కేవలం రూ.527 మాత్రమే. పెట్టుబడిదారీ అమెరికాలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు మన ‘సామ్యవాద’ దేశం కంటే మరింత మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్నాయి సుమా!

భారతదేశ ఉన్నత విద్యా విధానాన్ని తామే రూపొందించవలసివస్తే సునీత తల్లిదండ్రులు ఏమి చేస్తారు? నాలుగు చర్యలు తప్పక తీసుకోవాలని వారు నిర్దేశిస్తారని నేను భావిస్తున్నాను.

అవి: (1) ఉన్నత విద్యాభ్యాస వ్యయాలు సునీత కుటుంబం లాంటి కుటుంబాలు భరించగలిగే విధంగా ఉండాలి. ప్రతి ఒక్కరికీ సమానావకాశాలు కల్పించడమనే రాజ్యాంగ హామీకి చిత్తశుద్ధితో కట్టుబడివున్న పక్షంలో ట్యూషన్, తదితర ఫీజులు సాధ్యమైనంత తక్కువగా ఉండేలా నిర్ణయించాలి. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులను కూడా కట్టుదిట్టంగా క్రమబద్ధం చేసి తీరాలి. ఉన్నతవిద్యను ఎట్టి పరిస్థితులలోను లాభార్జనకు ఉపయోగించుకోకూడదు; (2) ఉపకార వేతనాల సంఖ్యను, మొత్తాన్ని తక్షణమే పెంపొందించాలి. కులమతాలు, వర్గం, ప్రాంతాలకు అతీతంగా విద్యలో అగ్రగాములుగావున్న కనీసం పదిశాతంమంది విద్యార్థులకు ఇవ్వాలి. అలాగే విద్యాపరంగా అనాది నుంచి అననుకూలతలను ఎదుర్కొంటున్న సామాజిక వర్గాలకు చెంది, ఇప్పుడు చదువులో బాగా ముందంజలో వున్న కనీసం 25 శాతం మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేసి తీరాలి. ఈ ఉపకార వేతనాల ద్వారా వారికి లభించే ఆదాయం వారి ట్యూషన్ ఫీజు, జీవన వ్యయాలకు పూర్తిగా సరిపోయే విధంగా వుండాలి; (3) ఇతర విద్యార్థులకు చదువుకుంటూ సంపాదించుకునే సదుపాయాలు అవకాశాలు కల్పించాలి. ఆ విద్యార్థులకు, చదువుకుంటున్న విద్యాలయాలలోనే వారానికి 20 గంటలు పనిచేసే అవకాశం కల్పించి, వారి మెస్ బిల్లుల చెల్లింపులకు సరిపడ ఆదాయాన్ని కల్పించాలి; (4) ప్రస్తుతం విద్యార్థులకు అమలులో ఉన్న బ్యాంకు రుణాల పథకాలలో మార్పులు చేయాలి. విద్యార్థి రుణాలకు ప్రభుత్వమే హామీ ఇవ్వాలి. ఆ రుణాలపై వడ్డీలు, రైతులు తమ కిసాన్ క్రెడిట్ కార్డ్‌పై తీసుకునే రుణాలపై చెల్లించే వడ్డీల వలే, గరిష్ఠంగా 7 శాతానికి మించకూడదు. సకాలంలో చెల్లిస్తున్నవారికి మరింత రాయితీ ఇవ్వాలి.

ఈ సూచనలు కొత్తవీ, మౌలికమైనవీ కావు. ఒకప్పటి ప్రణాళికా సంఘం ప్రొఫెసర్ పంకజ్ చంద్ర (బెంగలూరు ఐఐఎమ్ డైరెక్టర్) నేతృత్వంలో నియమించిన కమిటీ 2012లో దాదాపుగా ఇటువంటి సూచనలే చేసింది. అయితే యూపీఏ ప్రభుత్వం గానీ, ఎన్డీఏ ప్రభుత్వంగానీ ఈ సూచనల అమలుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మీరు సునీత తల్లిదండ్రులయితే, ఫీజుల సమస్యను సమాజం ముందుకు తీసుకువచ్చినందుకు జె.ఎన్‌.యు. విద్యార్థులకు ధన్యవాదాలు చెప్పాలి. అదే సమయంలో ఫీజుల విషయమై ఆందోళన, జె.ఎన్‌.యు.లో పెంచిన ఫీజులను పూర్వపు స్థాయికి తగ్గించడంతో ముగిసిపోకూడదని మీరు కోరుకోవాలి. ఒక సమస్య సమాజం దృష్టికి ఎప్పుడు వస్తుంది? సంబంధిత సమస్యకు బాధితులైన వారికంటే ఆ సమస్యను స్పష్టంగా, సమగ్రంగా వ్యక్తం చేయగలిగే వారివల్లేనని చెప్పవచ్చు. ‘మీ టూ’ ఉద్యమమే ఇందుకొక నిదర్శనం. జె.ఎన్‌.యు. విద్యార్థుల ఆందోళనలో లోతుగా ఉన్న ఒక సమస్యపై మీరు మీ దృష్టిని కేంద్రీకరించాలి. ఉన్నత విద్యకు ఆరాటపడుతున్నవారి సంఖ్య అమితంగా పెరిగిపోతున్నప్పుడు ఉన్నత విద్య అత్యధికులకు అందుబాటులో లేకుండా పోవడమే ఆ సమస్య. మన విద్యా విధానం ఈ సమస్యకు ప్రతిస్పందించి తీరాలి. పరిష్కారాలు లభ్యమవుతున్నాయి. అయితే వాటిని అమలుపరచగల రాజకీయ సంకల్పమే కన్పించడం లేదు. ఈ వ్యాసాన్ని చదువుతున్న మీరు సునీత తల్లిదండ్రులు కాకపోవచ్చు. అయితే మనమందరం ఒకేలా ఆలోచించడం లేదూ?

యోగేంద్ర యాదవ్
(స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు)