• ఈనెల 7న వ్యక్తిగతంగా హాజరుకావాలని
  • సీఎస్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి,
  • జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, ఆర్టీసీ ఎండీకి ఆదేశం
  • ఆర్టీసీ సమ్మెకు సంబంధించి పరస్పర విరుద్ధంగా సమర్పించిన గణాంకాలపై హైకోర్టు సీరియస్‌ అయింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా సంబంధిత అధికారులంతా న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈసారి వాస్తవాలతో అఫిడవిట్‌ సమర్పించాలని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌ శర్మకు నిర్దేశించింది. అది కూడా, రవాణా శాఖ మంత్రికి ఆర్టీసీ అందజేసిన సమాచారానికి అనుగుణంగా ఉండాలని స్పష్టం చేసింది. అలాగే, ఈనెల ఆరో తేదీ బుధవారంలోపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని, ఏడో తేదీన విచారణకు హాజరు కావాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌ రెడ్డితో కూడిన ధర్మాసనం శుక్రవారం జారీ చేసిన ఆదేశాల పూర్తి పాఠం ఆదివారం ప్రభుత్వానికి అందింది. ఆర్టీసీ సమ్మెపై గురువారం జరగనున్న విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి రావాలని అందులో హైకోర్టు ఆదేశించింది. ఆయనతోపాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌ శర్మ కూడా కోర్టు ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది. అంతేనా, ‘2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ ఎంత బకాయి ఉందో కోర్టుకు తెలపండి. ఆ బకాయిలు చెల్లించాలంటూ జీహెచ్‌ఎంసీని ఆర్టీసీ కోరిందా? లేదా? ఒకవేళ, బకాయిలు చెల్లించాలంటూ జీహెచ్‌ఎంసీని డిమాండ్‌ చేసి ఉండకపోతే, అందుకు కారణాలు ఏమిటో తెలపండి. అలాగే, 2013-14 నుంచి 1.10.2019 వరకూ ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలు ఎంతో చెప్పండి’’ అని పూర్తి పాఠంలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ వివరాలతో ఆరో తేదీలోపు అఫిడవిట్‌ సమర్పించాలని నిర్దేశించింది. అంతేనా, సదరు అఫిడవిట్‌ కాపీలను పిటిషనర్‌ తరఫు న్యాయవాది; అశ్వత్థామ రెడ్డి జనరల్‌ సెక్రటరీగా ఉన్న తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ తరఫు న్యాయవాదికి కూడా అందించాలని ఆదేశాలు జారీ చేసింది. రవాణా శాఖ మంత్రికి ఆర్టీసీ అందజేసిన నివేదిక అత్యంత కీలకమైన సాక్ష్యమని ధర్మాసనం అభిప్రాయపడింది. జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్‌ 112 (30) ప్రకారం రవాణా సదుపాయాలు, ప్రజా సౌకర్యాలకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయాల మేరకు కార్పొరేషన్‌ ఎప్పటికప్పుడు కేటాయింపులు చేయాలి. అంటే, దీని ప్రకారం నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమే. సంబంధిత నిర్ణయాన్ని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ తీసుకోజాలరు. కానీ, అక్టోబరు 29న మేం ఆదేశాలు జారీ చేశాం. ఆ తర్వాత అక్టోబరు 30న జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లో బస్సుల రవాణాకు సంబంధించి టీఎ్‌సఆర్టీసీకి వచ్చే నష్టాలను జీహెచ్‌ఎంసీ రీయింబర్స్‌ చేయాల్సిన అవసరం లేదని తెలిపారు.

జీహెచ్‌ఎంసీ ఆర్థిక పరిస్థితిని బట్టే టీఎ్‌సఆర్టీసీకి సాయం చేస్తామని పేర్కొన్నారు అని ధర్మాసనం తప్పుబట్టింది. అలాగే, 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ ఎంత బకాయి ఉందనే విషయం సునీల్‌ శర్మ సమర్పించిన అఫిడవిట్‌లో లేదని అభ్యంతరం వ్యక్తం చేసింది.

జీహెచ్‌ఎంసీ ఇవ్వాల్సిందెంత!?..హైదరాబాద్‌ సిటీ రీజియన్‌లో ఆర్టీసీకి జరిగిన నష్టానికి జీహెచ్‌ఎంసీ నిధులు ఇవ్వాల్సిన అవసరమే లేదన్న ప్రభుత్వ వాదనతో హైకోర్టు విభేదించింది. గతానికి సంబంధించి ఇప్పటికే రూ.336 కోట్లు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఇంత పెద్ద మొత్తం దాతృత్వం కింద ఇచ్చినట్టు భావించలేమని అభిప్రాయపడింది. ఇద్దరు ముఖ్య అధికారులైన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సమర్పించిన అఫిడవిట్లలోని సమాచారం పరస్పర విరుద్ధంగా ఉందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకరేమో జీహెచ్‌ఎంసీ నుంచి ఆర్టీసీకి ఇంకా బకాయిలు రావాలని అంటారు. మరొకరేమో ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ ఇవ్వాల్సిన కమిట్‌మెంటే లేదని అంటున్నారని తప్పుబట్టింది.

అఫిడవిట్‌కు, డాక్యుమెంట్లకు పొంతన లేదు…ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌ శర్మ అఫిడవిట్‌ ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరానికి రాయితీ మొత్తం కింద రూ.644.51 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం రీయింబర్స్‌ చేయాలి. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి విడుదల చేసింది. హైదరాబాద్‌లో బస్సులు తిరిగిన కారణంగా ఆర్టీసీకి జరిగిన నష్టం కింద జీహెచ్‌ఎంసీ మొత్తం రూ.1,786.06 కోట్లు రీయింబర్స్‌ చేయాలి. ఇందులో రూ.336.40 కోట్లను జీహెచ్‌ఎంసీ విడుదల చేసింది. అయితే ఆర్థిక పరిస్థితి బాగా లేనందువలన నిధులు విడుదల చేయలేమని జీహెచ్‌ఎంసీ పేర్కొన్నట్లు సునీల్‌శర్మ తన అఫిడవిట్‌లో తెలిపారు. జీహెచ్‌ఎంసీ చట్టప్రకారం ఆర్టీసీ నష్టాలను రీయింబర్స్‌ చేయాలన్నది కమిట్‌మెంట్‌ కాదని పేర్కొన్నారు. అందువల్ల జీహెచ్‌ఎంసీ బకాయి లేదన్నది సునీల్‌ శర్మ తన అభిప్రాయంగా తెలిపారు. అఫిడవిట్‌లో వివరాలకు, రూ.644.51 కోట్ల రీయింబర్స్‌మెంట్‌కు ఆధారంగా సమర్పించిన డాక్యుమెంట్లకు పొంతన లేదని కోర్టు అభిప్రాయపడింది. అఫిడవిట్‌కు అనుబంధంగా తమకు సమర్పించిన 16 జీవోలను కోర్టు ప్రస్తావించింది. ఐదు జీవోలను ప్రస్తావిస్తూ వివిధ మొత్తాలను ఆర్టీసీకి ప్రభుత్వం రుణం కింద ఇచ్చినట్టు తేలింది. అందువల్ల ఈ మొత్తం రాయితీ రీయింబర్స్‌మెంట్‌ కాదు. పైగా 2018 మే నెలలో ఇచ్చిన ఓ జీవోలో బస్సుల కొనుగోలుకు రూ.35 కోట్లు మంజూరు చేసింది. దీన్ని బట్టి సునీల్‌శర్మ జీవోలు కూడా రాయితీ మొత్తానికి రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చామన్న వాదనను బలపరచడం లేదని పేర్కొంది.

నష్టాల్లో ఉంటే 336 కోట్లు ఇస్తారా?…ఒక జీవో ద్వారా కేవలం రూ.130 కోట్లు చెల్లించిందని, బకాయి లేదన్న వాదన అహేతుకమని కోర్టు తెలిపింది. వివిధ కేటగిరీలకు ఇచ్చిన రాయితీలకు రీయింబర్స్‌ చేసిన సందర్భంలో ఆర్టీసీకి సహాయం (అసిస్టెన్స్‌) అనే పదం ఉపయోగించారని, దీన్ని బట్టి రుణం, సహాయం పదాలకు తేడా ప్రభుత్వానికి తెలియనిది కాదని కోర్టు పేర్కొంది. జీహెచ్‌ఎంసీ నష్టాల్లో ఉందని అంటూనే ఆర్టీసీకి రూ.336 కోట్లు చెల్లించినట్లు ఆయనే పేర్కొనడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపింది. ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ ఇవ్వాల్సిన అవసరం లేదన్నది నిజమే అనుకున్నా దాతృత్వం కింద అంత పెద్ద మొత్తాన్ని (రూ.336 కోట్లు) చెల్లిస్తారని అనుకోలేమని అభిప్రాయపడింది.

జీహెచ్‌ఎంసీ వాదనను సమర్థించలేం..ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు దాఖలు చేసిన అఫిడవిట్‌లో రూ.1492 కోట్లకు గాను రూ.335 కోట్లు జీహెచ్‌ఎంసీ చెల్లించినట్లు తమ దృష్టికి తీసుకువచ్చిన విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. దీన్ని బట్టి తాము బకాయిలు లేవనే జీహెచ్‌ఎంసీ వాదనను సమర్థించలేమని పేర్కొంది. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌కు ఆర్టీసీ అందజేసిన సమాచారం ప్రకారం ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ (రూ.1492.70 కోట్లు) నుంచి రూ.2272.06 కోట్లు రావాలి. ఇదే విషయాన్ని కార్పొరేషన్‌ తన గణాంకాల్లో చూపించింది. మంత్రికి సమర్పించిన వివరాలు కీలకమైన ఆధారంగా కోర్టు భావించింది. దీన్ని బట్టి జీహెచ్‌ఎంసీ ఇంకా రూ.1155.60 కోట్లు ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుందని లెక్కలు చెబుతున్నాయని తెలిపింది. అందుకే మరో అఫిడవిట్‌ సమర్పించాలని సునీల్‌ శర్మను ఆదేశించింది.

Courtesy Andhrajyothy…