• డెంగీకి ధనిక-పేద తేడా ఉండదు
  • ఖమ్మం జిల్లా జడ్జి బలైపోయారు
  • మా ఆదేశాలు కూడా లెక్కచేయరా?
  • ఏం చేసినా ఊరుకుంటామనుకోవద్దు
  • దోమలను లెక్కించొద్దు.. చంపేయండి
  • అధికారుల కుటుంబాలకు సోకితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది
  • అన్యమనస్కంగా ఆరోగ్య శాఖ అఫిడవిట్‌
  • దోమల నివారణకు ఫ్రైడే-డ్రైడే ఏంటి?
  • నివారణ వైఫల్యాలపై హైకోర్టు ఆగ్రహం!
  • సీఎస్‌ సహా ఉన్నతాధికారుల హాజరుకు ఆదేశం.. నేడూ విచారణ
  • ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాదు: డెంగీ నివారణా చర్యలపట్ల అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటు వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వంలోని అన్ని విభాగాలూ ఉమ్మడిగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చినా.. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదని ఆక్షేపించింది. డెంగీ నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ న్యాయవాది ఆర్‌.భాస్కర్‌ రాసిన లేఖ, డాక్టర్‌ ఎం.కరుణ వేసిన వ్యాజ్యంపై బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీజే రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. డెంగీ వంటి విషజ్వరాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, అదే మహమ్మారికి ఖమ్మం జిల్లా రెండవ అదనపు ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ జయమ్మ మరణించిన అంశాన్ని ఎత్తిచూపింది. డెంగీ వ్యాప్తిచేసే దోమలకు ధనిక-పేద అనే భేదం ఉండదని స్పష్టం చేసింది.
ఉన్నతాధికారుల కుటుంబ సభ్యులకు ఇలాంటి వ్యాధిసోకితేగానీ ఆ బాధ వారికి తెలియదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అత్యాధునిక యంత్రాలు కొనుగోలు చేసి, గుర్తించిన ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేయడంద్వారా అక్కడ దోమల సంఖ్యనుకూడా లెక్కించగలవని ఏజీ చెప్పిన వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ‘‘డెంగీ నివారణకు దోమలను లెక్కించే యంత్రాలు ముఖ్యం కాదు. దోమలు, వాటి లార్వాను నాశనం చేసే యంత్రాలు కావాలి’’ అని వ్యాఖ్యానించింది. డెంగీ నివారణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గురువారం ఉదయం పదిన్నరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య, ఆరోగ్యశాఖ, పురపాలకశాఖల ముఖ్యకార్యదర్శులు, వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్‌, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, రాష్ట్ర అంటువ్యాధుల నిరోధక విభాగ జేడీ తదితరులు కోర్టు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
పటిష్ఠ చర్యలు తీసుకున్నాం: ఏజీ
ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ వాదించారు. వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఇచ్చిన అదనపు అఫిడవిట్‌ను ఆయన ధర్మాసనానికి అందించి, వాటిలోని ముఖ్యాంశాలను ఉటంకించారు. డెంగీ కేసుల సంఖ్య 1808 నుంచి 1302కు తగ్గిందన్నారు. అధునాతన పరికరాలు కొనుగోలు చేశామని, డ్రోన్లు ద్వారా దోమలు వృద్ధి చెందే కేంద్రాలను గుర్తించి అక్కడ వాటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత ఆదేశాల ప్రకారం డెంగీ నివారణకు తగిన చర్యలు చేపట్టలేదని ధర్మాసనం ఆక్షేపించింది. వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి దాఖలు చేసిన అదనపు అఫిడవిట్‌లో పూర్తి వివరాలు లేవంది. ‘‘అన్య మనస్కంగా అఫిడవిట్‌ వేసినట్లు ఉంది. ఇలాంటి అఫిడవిట్‌ వస్తుందని మేం అనుకోలేదు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. డెంగీ నివారణపై పనిచేస్తున్న అధికారులపై ధర్మాసనం మండిపడింది. 13వ శతాబ్దిలో యూర్‌పలో ప్రబలిన ప్లేగు వ్యాధి వల్ల లక్షలాది మంది ప్రజలు చనిపోయారని, అందులో ఇద్దరు పోప్‌లు కూడా ఉన్నారని కోర్టు గుర్తు చేసింది.
పరిస్థితి చేయి దాటిపోతోంది
డెంగీ నివారణపై కోర్టు ఆదేశాలను ఉన్నతాధికారులు విస్మరించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏం చేసినా కళ్లు మూసుకుని మిన్నకుంటామని భావించవద్దని హెచ్చరించింది. కళ్లముందే డెంగీబారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే అధికారులు నివారణ చర్యలు చేపట్టకుండా ‘పిల్లి మొగ్గలు’ వేస్తున్నారని ఆక్షేపించింది. సెప్టెంబరులో డెంగీ కేసులు 205 ఉంటే, అక్టోబరు నాటికి అవి 409కి పెరిగాయని ఎత్తిచూపింది. ‘ఫ్రైడే- డ్రై డే’ అనే నినాదంతో దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ నినాదంపై స్పందించిన ధర్మాసనం… గాంధీ జయంతి నాడు మద్యం అమ్మకాలు నిషేధిస్తూ ‘డ్రై డే’ పాటించడం తెలుసని, దోమల నివారణకు ‘డ్రై డే’ ఏంటో వింతగా ఉందని అభిప్రాయపడింది. ప్రాసకోసం కాకుండా ప్రజల్లోకి చొచ్చుకుపోయే విధంగా ప్రచారం ఉండాలని తెలిపింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
Courtesy Andhra Jyothy