• ఆర్టీసీ సమ్మెపై నేడు హైకోర్టులో మలి విచారణ
  • కోర్టు తక్షణమే చర్చలు జరపాలంది
  • చర్చల ప్రగతిపై నివేదిక ఇవ్వాలంది
  • అయినా సర్కారు నుంచి చొరవేదీ?
  • రెండ్రోజులైనా స్పందన శూన్యం
  • చర్చలకు సిద్ధమని ప్రకటించిన జేఏసీ
  • సీఎం, మంత్రి.. సమీక్షలకే పరిమితం

హైదరాబాద్‌: ‘‘పంతాలు, పట్టింపులొద్దు. ఇరు పక్షాలు వెనక్కి తగ్గాలి. అగ్గి రాజేసి చలి కాచుకోవద్దు. సమ్మె వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నెల 18 లోపు సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం’’ అని హైకోర్టు ధర్మాసనం మంగళవారం అంత స్పష్టంగా చెప్పినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. చర్చలకు సిద్ధమని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు పదేపదే ప్రకటిస్తున్నా ప్రభుత్వం మాత్రం మౌనం వహించింది. ఇదేమీ ‘టగ్‌ ఆఫ్‌ వార్‌’ కాదని, సామాన్య ప్రజా సమస్యల పట్ల, కార్మికుల పట్ల ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించాలని స్వయంగా హైకోర్టు సూచించింది. ప్రభుత్వం ఆదర్శ యజమానిగా ఉండాలని హితవు పలికింది. ఈ సూచనలిచ్చి రెండు రోజులవుతోంది. తదుపరి వాయిదా 18వ తేదీ రానే వచ్చింది. గురువారం నాటికి సమ్మె 13వ రోజుకు చేరింది. మున్ముందు కొనసాగిస్తామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ప్రభుత్వం చొరవ తీసుకుని చర్చలకు ఆహ్వానించాలని కోరింది. కోర్టు ఆదేశాలను హుందాగా తీసుకోవాలని, చర్చలకు పిలిస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి చెప్పారు. ఐఏఎ్‌సల కమిటీ కాదు… అటెండర్ల కమిటీతోనైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఉలుకూ పలుకూ లేదు. రెండు రోజులుగా చర్చల గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. ప్రభుత్వం పంతాలు, పట్టింపులతోనే రెండు రోజుల కాలాన్ని గడిపేసింది. ప్రజల ఇబ్బందులను మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఒక పక్క తాత్కాలిక డ్రైవర్లతో నడుస్తున్న బస్సులు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాత్కాలిక సిబ్బంది బస్సుల్లో ప్రజలను దోపిడీ చేస్తున్నారు. ఎక్కువ రేట్లు వసూలు చేస్తూ మోసం చేస్తున్నారు. మరో పక్క ప్రైవేటు క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు, ప్రైవేటు బస్సులు రేట్లను రెండు మూడు రెట్లుగా పెంచి వసూలు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు అందుబాటులో లేక ప్రజల బాధలు చెప్పనలవిగా మారాయి. గ్రామాల నుంచి కూరగాయలను మోసుకొచ్చే బస్సులు లేకుండా పోయాయి. దాంతో పట్టణాలు, నగరాల్లో కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. అటు ప్రయాణికులే కాకుండా, ఇటు సామాన్య ప్రజలు కూడా నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. కొంత మంది గుండెపోటుతో మృతి చెందారు. ఇంత జరుగుతున్నా… ప్రభుత్వం మాత్రం తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోందన్న విమర్శలున్నాయి. చివరకు కోర్టు సూచనలు చేసినా… సమ్మెను విరమింపజేసే విషయంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. కార్మికులకు సెప్టెంబర్‌ నెల వేతనాలు ఇవ్వలేదు. వేతనాల గురించి కోర్టు కూడా ఆరా తీసింది. వేతనాలు చెల్లించాలని సూచించింది. అయినా… ప్రభుత్వం కినుక వహించింది. ఎంతసేపూ… కోర్టులో బలమైన వాదనలు వినిపించాలన్న దానిపైనే ప్రభుత్వం దృష్టి పెడుతోంది తప్ప… సమస్య శాశ్వత పరిష్కారానికి చొరవ చూపడం లేదని ఓ ప్రజాసంఘం నేత వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఆదర్శ యజమానిగా ఉండాలని కోర్టు సూచించినా… ప్రభుత్వం తలకెక్కలేదని విమర్శించారు. నిజానికి కార్మికులు చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పుడే… ఎవరినైనా మధ్యవర్తిగా నియమిస్తే సరిపోయేదని అంటున్నారు. పైగా పార్టీ సీనియర్‌ నేత కె.కేశవరావు కూడా మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చారని, ఆయన సేవలను వినియోగించుకోలేక పోయిందని విమర్శిస్తున్నారు. శుక్రవారం కోర్టు ముందుకు ఈ అంశం మరోసారి వస్తుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది

Courtesy Andhra Jyothy