వారికి తాగునీరు, తిండి సదుపాయాలు కల్పించండి
కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ : దేశంలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలసవెళ్తున్న కార్మికుల్లో భయాలు పోగొట్టాలని కేంద్రానికి సుప్రీంకోర్టు తెలిపింది. ఇందుకోసం షెల్టర్‌ హోమ్‌లలో ఉంటున్న వారి కోసం వివిధ మతాలకు చెందిన నాయకులతో భజనలు, నమాజ్‌లు నిర్వహించాలని సూచించింది. వలసవెళ్తున్న కార్మికులకు ఉపశమన చర్యలు కల్పించాలంటూ అడ్వకేటు అలోక్‌ శ్రీవాస్తవ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.ఎ బోబ్డే, జస్టిస్‌ ఎల్‌. నాగేశ్వర రావులతో కూడిన ధర్మాసనం వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారణ జరిపింది. ఈ మేరకు కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదించారు.
లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలసవెళ్తున్న వారిని దగ్గరలో అందుబాటులో ఉన్న వసతి గృహాలకు(షెల్టర్‌ హోమ్స్‌) తరలిస్తున్నామని మెహతా కోర్టుకు తెలిపారు. కాగా, 24 గంటల్లోగా నిపుణుల కమిటీను ఏర్పాటు చేయాల్సిందిగా సీజేఐ.. కేంద్రాన్ని ఆదేశించారు. ”ప్రస్తుత తరుణంలో కేంద్రం ముందస్తు, క్రియాశీల చర్యలు తీసుకున్నది. వలసకార్మికుల్లో ధైర్యాన్ని నింపేందుకు సుశిక్షితులైన కౌన్సెలర్లను వారి వద్దకు పంపుతాం” అని మెహతా వివరించారు. వైరస్‌ కంటే భయంతోనే అనేక ప్రాణాలు పోయే ప్రమాదమున్నదనీ, భజనలు, కీర్తనలు, నమాజ్‌ వంటి కార్యక్రమాలేవైనా చేపట్టి ప్రజల్లో దైర్యాన్ని కల్పించాలని బోబ్డే అన్నారు. అలాగే షెల్టర్‌ హోమ్‌లలో ఉంటున్న వారి కోసం తాగునీరు, తిండి, బెడ్లు, మెడిసిన్స్‌ వంటి సదుపాయాలను తగిన విధంగా కల్పించాలని కేంద్రాన్ని ఆదేశించారు. సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

కాలినడకన ఆరులక్షల మంది వెళ్లారు : కేంద్రం
లాక్‌డౌన్‌ సమయంలో దేశంలో దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల మంది కార్మికులు తమ గ్రామాలకు కాలినడకన వెళ్లారని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. వారి అవసరాల కోసం తాము అన్ని చర్యలూ తీసుకున్నప్పటికీ వీరంతా ఇండ్లకు తిరుగుపయనమయ్యారని వివరించింది. అయితే గత కొన్ని రోజులుగా నగరాల నుంచి భారీ సంఖ్యలో వలసకార్మికులు గ్రామాలకు వెళ్తుండటంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదమున్నదని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
వలసకార్మికుల భారీ సంఖ్యలో ఇలా కాలినడకన్న వెళ్తుండటాన్ని నిరోధించడం కోసం తీసుకున్న చర్యలపై స్టేటస్‌ రిపోర్టు అందజేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హోం సెక్రెటరీ అజరు కుమార్‌ భళ్లా.. న్యాయస్థానానికి మంగళవారం నివేదికను అందించారు. కాగా, సామాజిక మాధ్యమాల్లో నకిలీ, తప్పుడు వార్తల కారణంగా భయానక పరిస్థితులు ఏర్పడ్డాయని భళ్లా తెలిపారు. అలాగే ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యల గురించి న్యాయస్థానానికి వివరించారు.

Courtesy Nava Telangana