•  హైదరాబాద్‌ నుంచి ఆరుగురికి లక్షా 80 వేలు
  • అన్ని సౌకర్యాలు కల్పించాం: శ్రీనివాస్‌గౌడ్‌

బేగంపేట/హైదరాబాద్‌/వరంగల్‌ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్‌ సౌకర్యం కల్పించింది. హైదరాబాద్‌ నుంచి ములుగు జిల్లాలోని మేడారం వరకు హెలికాప్టర్‌ను నడపనున్నారు. ఆదివారం బేగంపేట విమానాశ్రయంలో హెలికాప్టర్‌ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఆరుగురు ప్రయాణికులను హైదరాబాద్‌ నుంచి మేడారం తీసుకువెళ్లి వీఐపీ దర్శనం కల్పించడంతో పాటు తిరిగి నగరానికి తీసుకొచ్చేందుకు లక్షా 80వేల రూపాయలు, అదనంగా జీఎస్టీ ఉంటుందని వివరించారు. మేడారంలో జాతర పరిసరాలను హెలికాప్టర్‌ నుంచి తిలకించేందుకు ప్రయాణికుడికి రూ.2,999 చార్జీ ఉంటుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఫోన్‌ నెంబర్‌ 94003 99999ను సంప్రదించాలన్నారు.

కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జాతర జరుగుతుంది. మరోవైపు.. హైదరాబాద్‌ నుంచి మేడారం జాతర వెళ్లేందుకు ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్‌ ఈనెల 8వ తేదీ వరకు 500 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, శేరిలింగపల్లి, కేపీహెచ్‌పీ, మియాపూర్‌, లాల్‌దర్వాజ, నేరెడ్‌మెట్‌, జగద్గిరిగుట్ట నుంచి బస్సులు నడుస్తాయి.

హన్మకొండ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌
మేడారం జాతర కోసం వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌ సౌకర్యం కల్పిస్తున్నట్లు కలెక్టర్‌ ప్రశాంత్‌ జే పాటిల్‌ తెలిపారు. ఇందుకోసం హన్మకొండలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో హెలిప్యాడ్‌ కోసం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Courtesy Andhrajyothi