• 48 గంటల్లో 50 మంది మృతి
 • స్తంభించిన హైదరాబాద్‌ మహా నగరం..
 • జల దిగ్బంధంలో 1500కుపైగా కాలనీలు
 • నిరాశ్రయులుగా వేలాదిమంది నగరవాసులు..
 • పునరావాస కేంద్రాలకు 10 వేల మంది
 • ఇళ్లల్లోకి నీళ్లు.. కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు..
 • రంగంలోకి ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు
 • హిమాయత్‌ సాగర్‌ 14 గేట్లూ ఎత్తివేత…
 • మూసీ ఉగ్రరూపం.. పరీవాహకం జలదిగ్బంధం
 • అప్పా చెరువు తెగి ఆరాంఘర్‌ ఆగమాగం…
 • కొట్టుకుపోయిన లారీలు, బస్సులు, కార్లు
 • జల దిగ్బంధంలో ఎల్బీ నగర్‌, హయత్‌నగర్‌..
 • రెండో రోజూ కుదుటపడని హైదరాబాద్‌ నగరం
 • రెండు రోజులు ఆఫీసులకు సెలవులు..
 • అవసరమైతే తప్ప బయటికి రావొద్దు: సీఎస్‌
 • విజయవాడ, వరంగల్‌, కర్నూలు హైవేలు బంద్‌..
 • వరదపై రాష్ట్రపతి, ప్రధాని, అమిత్‌షా ఆరా

మంగళవారం రాత్రి 9 గంటలు! పెద్ద అంబర్‌ పేట మండలం సూర్యవంశీ గార్డెన్‌ సిటీ! కుమ్మరికుంట చెరువు, బాతుల చెరువు అలుగులు పారడంతో కాలనీలోకి నీళ్లు రావడం ప్రారంభమైంది! ఒక్క గంటలో చూస్తుండగానే సూర్యవంశీ కాలనీ, బంజారా కాలనీ, బ్యాంకు కాలనీ, లేబర్‌ బస్తీల్లోకి నిలువెత్తు నీళ్లు! ఇళ్లల్లోనూ నడుంలోతు నీళ్లు చేరాయి! దాంతో, చాలామంది పై అంతస్తులకు వెళ్లారు. కొందరు రెండు, మూడు అంతస్తులు ఉన్నవారి ఇళ్లకు వెళ్లి తలదాచుకున్నారు! కొందరు కట్టుబట్టలతో కాలనీల నుంచి బయటపడ్డారు. అదే, అర్ధరాత్రి జరిగి ఉంటే ఇక్కడ ప్రాణ నష్టం తీవ్రంగా ఉండేది!

హైదరాబాద్‌ సిటీ : వరద నీటితో హైదరాబాద్‌ నగరం అల్లకల్లోలమైంది. రికార్డు స్థాయి వర్షపాతంతో రోడ్లు కాలువలయ్యాయి! కాలనీలు చెరువులయ్యాయి! నగరమే సాగరమైంది! చెరువులు, కుంటలు పొంగి ప్రవహించాయి! రాకపోకలు బందయ్యాయి! విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది! నగరంలోని దాదాపు 1500 కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఓ ఇల్లూ కొట్టుకుపోయింది. పాత భవనాలు, ప్రహారీలు కూలి.. వరద ప్రవాహంలో చిక్కుకుని నగరంలోనే 25 మందికిపైగా మరణించారు. జిల్లాల్లో మరో 22 మంది మరణించారు. నగరంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. పలువురు గల్లంతయ్యారు. బుధవారం అర్ధరాత్రి వరకూ వారి ఆచూకీ లభించలేదు. ఇళ్లల్లోకి నీరు చేరడంతో వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.

వందల సంఖ్యలో కాలనీలు, బస్తీల్లోని ఇళ్లలోకి నాలుగైదు అడుగుల మేర నీళ్లు చేరడంతో నిత్యావసరాలు తడిసి ముద్దయ్యాయి. తెల్లవార్లూ జాగారం చేయడంతోపాటు అర్ధాకలితో ముంపు ప్రాంతాల ప్రజలు అలమటించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగి పడవల సహాయంతో పలువురిని రక్షించాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు కురిసిన వానకు నగరం భీతిల్లింది. ఇళ్లలోకి నీరు రావడం, భారీ వరదకు రోడ్లు తెగిపోవడం, విద్యుత్తు స్తంభాలు నేలకొరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటగంటకు వర్షం ఉధృతి పెరిగిపోవడంతో వణికిపోయారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఊపందుకున్న వర్షం రాత్రి 11 గంటల వరకు దంచికొట్టింది. చాలా కాలనీలు, బస్తీల్లో ప్రజలు వంట చేసుకోలేక.. ఎవరి నుంచి సహాయం అందక అవస్థలు పడ్డారు. బయటకు వెళ్లి పాల ప్యాకెట్లు కూడా తెచ్చుకునే పరిస్థితి లేకపోయింది. బుధవారం సాయంత్రానికి కూడా కొన్ని బస్తీలు, కాలనీల్లో వరద పూర్తిగా తొలగిపోలేదు. రాష్ట్ర ప్రభుత్వ కోరిక మేరకు ఆర్మీ రంగంలోకి దిగింది. ప్రజలను పడవలతో సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఆర్మీ బృందాలు వైద్య సేవలందించాయి.

జాతీయ రహదార్లు బంద్‌!
భయంకరమైన వర్షం.. ఈదురు గాలులు.. పోటెత్తిన వరద.. తెగిన నాలాలు, ఉధృతంగా ప్రవహించిన వరద.. కనుమరుగైన రహదారులు.. కమ్ముకున్న కారు చీకట్లు.. ప్రమాదకరంగా మారిన రోడ్లపై ప్రయాణాలను నిలిపేసిన పోలీసులు.. వెరసి, రోడ్లపై నిలిచిపోయిన వేలాది వాహనాలు. ఎటూ కదల్లేక వాహనదారులు మంగళవారం రాత్రంతా నరకం అనుభవించారు. హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారి పూర్తిగా వరద నీటిలో దిగ్భందమైంది. మలక్‌పేట రైల్వే బ్రిడ్జి కింద వరద ప్రవాహం ఉధృతంగా ఉండటం, రహదారిపై నాలుగు అడుగుల లోతులో నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చాదర్‌ఘాట్‌ వద్ద డైవర్షన్‌ చేయడంతో కాచిగూడ రోడ్‌ గుండా అంబర్‌పేట వెళ్లే దారిలో గాల్నాక కొత్త బ్రిడ్జి మూసారాంబాగ్‌ మీదుగా వాహనాలు మళ్లించారు. తిరిగి, దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌డిపో వద్ద వాహనాలు నిలిచిపోయాయి. సరూర్‌నగర్‌ చెరువు నిండిపోవడంతో.. వరద నీరు ఉధృతంగా ప్రవహించి పీఎంటీ కాలనీ మీదుగా చైతన్యపురి వద్ద జాతీయ రహదారిపైకి చేరాయి. దాంతో, భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఇక, ఇనాంగూడ చెరువు ఉధృతంగా ప్రవహించడంతో హైవే పూర్తిగా ధ్వంసమైంది. హయత్‌నగర్‌ నుంచి చౌటుప్పల్‌ వరకు జాతీయ రహదారిపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పోలీసులు, సహాయ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టినా.. వరద ఉద్ధృతి తగ్గలేదు. వరంగల్‌, విజయవాడ, కర్నూలు జాతీయ రహదారులపై బుధవారం అర్ధరాత్రి వరకూ కూడా రాకపోకల పునరుద్ధరణ జరగలేదు.

వందేళ్ల రికార్డు బద్దలు
నగరంలో మంగళవారం కురిసిన వర్షం వందేళ్లనాటి రికార్డును బద్దలుకొట్టింది. అక్టోబరు 14న హైదరాబాద్‌లో సాధారణ వర్షపాతం కేవలం 4.2 మిల్లీమీటర్లు ఉండగా, అత్యధికంగా 191.8 మిల్లీమీటర్లు కురిసింది. కాగా, 1903 జూన్‌లో కురిసిన 117.1 మిల్లీమీటర్లు ఇప్పటి వరకు ఆల్‌టైం రికార్డుగా ఉంది. తాజాగా మంళవారం ఉదయం 8.30 నుంచి బుధవారం ఉదయం 8.30 వరకు కురిసిన 191.8 మిల్లీమీటర్ల వర్షపాతం దానిని దాటిపోయింది.

పార్క్‌లోకి భారీగా వరద
మీరాలం చెరువు నుంచి భారీగా వరద నీరు చేరడంతో జూపార్కును మూసి వేశారు. సఫారీ పార్కు, ఎలుగుబంటి ఎన్‌క్లోజర్లతోపాటు పరిసరాలలో ఉన్న మరిన్ని ఎన్‌క్లోజర్లలోకి వర్షపు నీరు వచ్చింది. మోటార్లు ఏర్పాటు చేసి బయటికి తోడేస్తున్నా.. ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండడంతో అక్కడే నిలిచిపోతోంది. జంతువులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు.

ఆరాంఘర్‌ వద్ద ఆగమాగం
ఆరాంఘర్‌ పరిసరాల్లో ప్రవాహ ఉధృతికి స్కూటర్లు, కార్లే కాకుండా.. భారీ లారీలు, గూడ్స్‌ క్యారియర్లు కొట్టుకుపోయాయి. అప్పా చెరువు కట్ట తెగడంతో ఆరాంఘర్‌ నుంచి శంషాబాద్‌ వెళ్లే మార్గం చెరువులా మారింది. బ్రిడ్జి కట్టే ప్రాంతంలో గతంలో ఉన్న పెద్ద నాలాను అధికారులు చిన్నదిగా చేయడంతో అప్పా చెరువు నుంచి వస్తున్న వరద నీరు అంతా పాత కర్నూల్‌ రోడ్డులోని బ్రిడ్జికి ఇరువైపులా నిలిచిపోయింది. దీంతో, శంషాబాద్‌- ఆరాంఘర్‌ మధ్య రాకపోకలు స్తంభించాయి. మంగళవారం అర్ధరాత్రి ఆ మార్గంలో వెళ్లడానికి ప్రయత్నించిన లారీలు, బస్సులు, కార్లు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. ఆటోలు, ద్విచక్ర వాహనదారులదీ ఇదే పరిస్థితి. అప్పా చెరువు అలుగు, తూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్లే కట్ట తెగి వరద ఉగ్రరూపం దాల్చింది.

కళ్ల ముందే 11 మంది కొట్టుకుపోయారు
మాజీ ఎంపీ తులసీరామ్‌ కుమారుడు విజయ్‌కుమార్‌తో కలిసి ఆరాంఘర్‌ నుంచి రాత్రి 11:45 నిమిషాలకు గగన్‌పహాడ్‌లోని ఇంటికి వెళ్తున్నాం. గగన్‌పహాడ్‌ పాత కర్నూల్‌ రోడ్డులో రెండు వైపులా భారీగా వర్షపు నీరు నిలిచింది. ఎంతకూ ప్రవాహం తగ్గకపోవడంతో వెళదామని ప్రయత్నించాం. కారు కొట్టుకుపోయింది. మా సార్‌ కొద్ది దూరం వెళ్లి పక్కన ఉన్న కాంటా దగ్గర చిక్కుకున్నాడు. చాలా భయం వేసింది. మా ముందే ఆటోలో ఉన్న 11 మంది కొట్టుకుపోయారు.
 శ్రీనివాస్‌, మాజీ ఎంపీ వి.తులసీరామ్‌ కుటుంబ డ్రైవర్‌

ఎల్బీ నగర్‌ దిగ్బంధం
హయత్‌ నగర్‌ పరిసర ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షపాతం కురవడంతో ఎల్బీ నగర్‌ పరిధి పలు కాలనీలు, బస్తీలు నీట మునిగాయి. గతంలో సాధారణ స్థాయిలో వరద రాని ఏరియాలకూ ఈసారి తీవ్ర ముంపు ముప్పు నెలకొంది. హయత్‌నగర్‌ పరిధిలోని గాయత్రీ నగర్‌, ఇన్ఫర్మేషన్‌ కాలనీ, ముదిరాజ్‌ కాలనీ, సాయి, రామకృష్ణనగర్‌ కాలనీలకు నగరంతో రాకపోకలు నిలిచాయి. ఇవి జల దిగ్బంధంలో చిక్కుకోవడమూ ఇదే తొలిసారి.  వనస్థలిపురం పైకాలనీలు, కప్పల చెరువు నుంచి వరద పోటెత్తింది. దాంతో, రోడ్లకు గండ్లు తవ్వి దానిని కుమ్మరి కుంట చెరువుకు మళ్లించారు. అది నిండి బాతుల చెరువు పొంగిపొర్లింది. ఈ ప్రాంతంలో అనేక కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకోవడానికి కారణం ఇదే. దీనికితోడు, కుమ్మరికుంట వరకూ వరద కాల్వ ఏర్పాటు చేయకపోవడం, చెరువు కట్టను వెడల్పు చేయకపోవడం, నాలాల మూసివేత కూడా ఇందుకు కారణం.

ఇక, నాగోల్‌ డివిజన్‌ పరిధిలోని బండ్లగూడ చెరువు వెనక ఉన్న అయ్యప్ప కాలనీ, మల్లికార్జున నగర్‌, త్యాగరాయనగర్‌ కాలనీ, రాఘవేంద్రనగర్‌, గీతానగర్‌, శ్రీనివాస కాలనీ తొలిసారి జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. సుమారు 150 ఇళ్లలోకి వరద నీరు చేరింది. బండ్లగూడ చెరువుకు ఎక్కువ వరద రావడం, అలుగు నుంచి వరద వెళ్లే పాత కాలువ కనుమరుగై, భారీ నిర్మాణాలు చేపట్టడంతో కాలనీలను నీరు ముంచెత్తింది. చంపాపేట డివిజన్‌ సాయినగర్‌ కాలనీ, ఎస్సీ బస్తీలు నీటమునిగాయి. గత 30 ఏళ్లలో కాలనీల్లోకి నీరు చేరడం ఇదే తొలిసారి.

దెబ్బతిన్న జాతీయ రహదారులు
భారీ వర్షాలు, వరదలతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. వరద నీరు ప్రవహించడం, రోడ్లు కొట్టుకుపోవడంతో హైదరాబాద్‌-విజయవాడ, హైదరాబాద్‌-బెంగుళూరు మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. భారీ సంఖ్యలో వాహనాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. కాగా, జాతీయ రహదారుల మరమ్మతు పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టినట్లు ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ గణపతిరెడ్డి తెలిపారు. కొన్ని చోట్ల బుధవారం సాయంత్రమే ట్రాఫిక్‌ను పునరుద్ధరించామని, మిగతా ప్రాంతాల్లో రెండురోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు.

కొట్టుకుపోయిన ఇల్లు
సికింద్రాబాద్‌లోని బౌద్ధనగర్‌ అంబర్‌నగర్‌లో నాలా పక్కన ఉన్న ఓ ఇల్లు ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయింది. భార్య, ఇద్దరు పిల్లలతో 69 గజాల్లో మూడు గదులు నిర్మించుకొని మహ్మద్‌ నజీముద్దీన్‌ నివసిస్తున్నాడు. అర్ధరాత్రి 12 గంటలకు వరద పోటెత్తింది. వర్షపు నీటితో బాగా నాని ఉండటంతో ఇల్లు కొట్టుకుపోయింది. బైక్‌, వాషింగ్‌ మెషిన్‌, అల్మారా, రూ. 50 వేల నగదు, 5 తులాల బంగారు నగలు, ఆధార్‌ కార్డులు, డ్యాకుమెంట్లు వరదలో కొట్టుకుపోయాయి.

కోలుకోని నగరం
వందేళ్లలో రికార్డు స్థాయి వర్షపాతం మంగళవారం నమోదైందని అధికారులు చెబుతున్నారు. ఫలితంగా, రెండో రోజు బుధవారం కూడా మహా నగరం కోలుకోలేదు. జన జీవనం   స్తంభించింది. కాలనీలు జల దిగ్బంధంలోనే కొనసాగాయి. జాతీయ రహదార్లపై రాకపోకలు కొనసాగలేదు. పాత బస్తీలోకి తొలిసారి ఆర్మీని దింపాల్సి వచ్చింది. మంత్రి కేటీఆర్‌ ఉదయం 8.50 గంటలకే జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకొని ప్రజాప్రతినిధులు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం నుంచి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు.

Courtesy Andhrajyothi