వైద్యారోగ్యశాఖలో వింత పరిస్థితి
ఉద్యోగులకు హెల్త్‌ కార్డులివ్వని సర్కారు
ఏండ్ల తరబడి ఎదురుచూపులు
హైదరాబాద్‌: చప్పట్లు కొట్టారు. పూలవర్షం కురిపించారు. దీపాలు వెలిగించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదలు గల్లీ నాయకుల వరకు సన్మానాలు చేశారు. వారు లేనిదే ప్రపంచం లేదన్నారు. ఇదంతా బాగానే ఉంది. రాత్రి, పగలు అని తేడా లేకుండా కరోనా యుద్ధం చేస్తున్న ఆ వారియర్స్‌ జబ్బు పడితే మాత్రం మెరుగైన వైద్యం పొందే వీల్లేని పరిస్థితులు నెలకొన్నాయి. వారంతా ఎవరో కాదు. వైద్యారోగ్యశాఖలోని ఉద్యోగులు. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, వీరంతా వైద్యవిధాన పరిషత్‌ విభాగం కింద జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు 10 వేల మంది మిగిలిన ఉద్యోగుల మాదిరిగానే తమకు కూడా హెల్త్‌ కార్డులు జారీ చేయాలని కోరుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హయాం నుంచి పోరాటం చేస్తున్నారు. తెలంగాణ వస్తే మిగిలిన విభాగాల మాదిరిగానే ఈ విభాగంలో పని చేసే వారికి కూడా హెల్త్‌ కార్డులు జారీ చేసుకోవచ్చని భావించి తెలంగాణ ఉద్యమంలో మిగిలిన వారితో భాగస్వాములయ్యారు. అయితే వారి ఆకాంక్షలు నెరవేరలేదు. ప్రత్యేక చట్టంతో ఏర్పాటు చేసిన వైద్యవిధాన పరిషత్‌ ఉద్యోగులు 010 పద్దు ద్వారా జీతాలు పొందుతుండడంతో వారికి హెల్త్‌ కార్డుల జారీ కాలేదు. దీంతో ఉద్యోగులు ఆ చట్టంలో సవరణ చేసి తమకు ఆరోగ్యభద్రత కల్పించాలని కోరుతున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తుండడం, మరోవైపు ఇతర ఆరోగ్యసమస్యలతో పాటు కరోనా చికిత్సల్లో పాల్గొంటుండడంతో ఏదైనా అనారోగ్యం వస్తే తమ పరిస్థితి ఏమిటని ఆందోళనకు గురవుతున్నారు.

రాష్ట్రంలో వైద్యవిధాన పరిషత్‌ పరిధిలో ఐదు జిల్లా ఆస్పత్రులు, 39 ఏరియా ఆస్పత్రులు, 41 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఆరు మాతా, శిశు చికిత్సా కేంద్రాలు, 12 అర్బన్‌ హెల్త్‌ కేర్‌ సెంటర్లున్నాయి. ఇది కాకుండా ప్రజావైద్యసంచాలకుల పరిధిలో 1000 వరకు గ్రామీణ, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైద్యవిద్య సంచాలకుల పరిధిలో 10 బోధనాస్పత్రుల్లోనూ వైద్యసిబ్బంది పని చేస్తున్నారు. అన్ని విభాగాల్లో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌, ఇతర సిబ్బంది ఒకే రకమైన పని చేస్తుండగా రెండు విభాగాల్లో సిబ్బందికి మాత్రం హెల్త్‌ కార్డులు జారీ చేసి కేవలం పరిషత్‌ ఉద్యోగులను విస్మరించడం పట్ల వారిలోఅంసతప్తి నెలకొన్నది. ఈ విషయమై వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు, మంత్రికి ఉద్యోగ సంఘాలు పలుమార్లు చేసిన డిమాండ్లతో ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరాయి. చట్టాన్ని సవరించి వైద్యసిబ్బందికి ఆరోగ్యభద్రతకు భరోసా కల్పించడంలో ఆలస్యం చేస్తుండడంతో ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు గాంధీ ఆస్పత్రిపై భారం తగ్గించేందుకు తక్కువ లక్షణాలు కలిగిన కరోనా రోగులను జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లోనే చికిత్స అందించాలని ఆదేశించడంతో మరింత ఎక్కువై ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వాస్పత్రుల్లో పూర్తిస్థాయి వైద్యం దొరకక అనివార్యంగా ప్రయివేటుకు వెళ్లే సమయంలో హెల్త్‌కార్డు లేకపోవడంతో పలు సందర్భాల్లో ఆయా కుటుంబాల్లో పెద్దలకు వచ్చే జబ్బులకు చికిత్స చేయించేందుకు రూ.లక్షలు ఖర్చు అవుతుండడంతో అప్పులపాలు అవుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం పొగడ్తలతో సమస్యలు తీరవనీ, సమాన పనికి సమాన వేతనం, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మిగిలిన రోజుల కన్నా కరోనా కాలంలో తామే కాకుండా, తమ కుటుంబాలు కూడా తీవ్రమైన ప్రమాదంలో ఉన్నామనీ, తక్షణం హెల్త్‌ కార్డులు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వైద్యారోగ్యశాఖలో పని చేసే తమకు, తమ కుటుంబాల ఆరోగ్యానికే భరోసా ఇవ్వకపోతే సామాన్యుల ఆరోగ్యానికి భద్రత ఎలా కల్పిస్తారని ప్రశ్నిస్తున్నారు.

Courtesy Nava Telangana