– 90 శాతం పేదలకు ఆరోగ్య బీమా దూరం
– ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదు: నిపుణులు

న్యూఢిల్లీ: దేశంలో 90 శాతం పేదలకు ప్రభుత్వరంగ ఆరోగ్య బీమా వర్తించటం లేదనీ, దీని కారణంగా వైద్యం కోసం చేసే ఖర్చుల భారం పెరుగుతూ సామాన్య ప్రజలను ఆర్థికంగా కుంగదీస్తున్నాయని పలు సర్వేల్లో వెల్లడైంది. వైద్యం కోసం చేసే ఖర్చు అధికంగా ఉండటంతో ప్రజలు మరింతగా పేదరికంలో కూరుకుపోతున్నారని ప్రభుత్వం విడుదల చేసిన నేషనల్‌ స్టాటిస్టికల్‌ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) నివేదికల్లో వేల్లడైంది. ‘నేషనల్‌ సర్వే ఆన్‌ సోషల్‌ కన్‌సంప్షన్‌-2017-18’ పేరిట విడుదలైన ఈ నివేదికలోని వివరాలు ప్రకారం.. దేశంలోని 90 శాతం ప్రజలకు ప్రభుత్వ రంగ ఆరోగ్య బీమా వర్తించటంలేదు. 10 శాతం మంది పేదలకు మాత్రమే ఆరోగ్య బీమా వర్తిస్తున్నది. దీంట్లో గ్రామీణ ప్రాంతాల్లో 10.2 శాతం ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 9.8శాతం మంది పేదలు బీమా సౌకర్యం కలిగి ఉన్నారు. మొత్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 14.1శాతం, పట్టణ ప్రాంతాల్లో 19.1 శాతం మంది భారతీయులు ఆరోగ్య బీమాను కలిగి ఉన్నారని నివేదికలో వెల్లడైంది. బీమా సౌకర్యంలేని కారణంగా, ఆదాయంలో ఎక్కువ మొత్తంలో వైద్య ఖర్చులకే కావడంతో భారతీయులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసింది.

మరీ ముఖ్యంగా ఆరోగ్య బీమా లేకపోవడంతో వైద్య ఖర్చులు పెరగడంతో.. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి పేద-ధనిక తారతమ్యాలు మరింతగా పెరుగుతున్నాయి. వైద్య ఖర్చులు దారిద్య్ర రేఖకు పైన వున్నవారిని సైతం తిరిగి పేదరికంలోకి నెట్టివేస్తున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ ఆరోగ్య భీమా పథకం, రాష్ట్ర స్వస్తిమా బీమా యోజన, ప్రధాన్‌ మంత్రి జన్‌ ఆరోగ్య యోజన వంటి పథకాలు ఉన్నప్పటికీ అవి ప్రజలందరికీ వర్తించటంలేదని తెలుస్తున్నది.

డేటా ప్రకారం, అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య 51శాతం లోపే ఉంటున్నది. ప్రభుత్వ ఆస్పత్రిలో చేరేందుకు సగటు వైద్య ఖర్చులు రూ. 4,452 కాగా, ప్రయివేటు ఆస్పత్రుల్లో దీనికి ఏడురెట్లు ఎక్కువగా (రూ.31,845) ఉన్నదని ఎన్‌ఎస్‌ఎస్‌ఓ నివేదిక తెలిపింది. దీనిని బట్టే పేదలు ఆస్పత్రిలో చేరే అవకాశం తక్కువగా ఉంటున్నది తెసుస్తున్నది.

అయితే ఆరోగ్య బీమా సేవలను పేదల కంటే 40 శాతం ధనికులు ఎక్కువగా ఉపయోగించుకున్నారని నివేదిక ద్వారా వెల్లడైంది. కాగా, ప్రపంచంలో ప్రజల ఆరోగ్యానికి అత్యంత తక్కువ ఖర్చు చేస్తున్న దేశం భారత్‌ మాత్రమేనని ఇది వరకే నిటిఆయోగ్‌ నివేదిక వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆదాయ వనరులు, వైద్య బీమా, నిధులను వ్యూహాత్మకంగా ఖర్చు చేయడంలో మన వ్యవస్థ పూర్తిగా విఫలమైందనీ, బీమా వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్లే వైద్యం కోసం ప్రజలు ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తున్నదని తేల్చింది. మరీ ముఖ్యంగా పేద, మధ్య తరగతి వారు ఆర్థికంగా చితికిపోతున్నారని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యం కోసం వెచ్చించే ఖర్చులు జీడీపీలో 2 శాతానికి మించటం లేదనీ పేర్కొంది. పరిస్థితులు ఇంత దయనీయంగా ఉన్నప్పటికీ వాస్తవాలను గమనించకుండా, ప్రభుత్వం పేదలకు వైద్యం అందించటడంలో సరైన నిర్ణయాలు, విధానాలు అవలంభించటం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Courtesy Nava telangana…