• సినిమా చాన్స్‌లు ఇప్పిస్తానంటూ యువతులకు హెడ్‌మాస్టర్‌ ఎర
  • లేడీస్‌ హాస్టళ్లే అడ్డా.. నగలు, డబ్బు స్వాహా
  • శారీరకంగా వాడుకొని తర్వాత మాయం
  • నెల్లూరు యువతి నుంచి 10 లక్షల వసూలు
  • ఏడాది క్రితమే ఫిర్యాదు.. అయినా చర్యలు శూన్యం

అతనో ప్రధానోపాధ్యాయుడు! బడి పర్యవేక్షణ, పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పే బాధ్యతను పక్కనపెట్టి మహిళలకు వల వేస్తాడు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌, కృష్ణానగర్‌లోని మహిళల హాస్టళ్ల చుట్టూ తిరుగుతూ సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానంటూ యువతులను నమ్మిస్తాడు. కారు, దర్పం ఉట్టిపడే వస్త్రధారణతో వారి ముందు పటాటోపాన్ని ప్రదర్శిస్తాడు! చిత్ర పరిశ్రమలో లైట్‌బాయ్‌ నుంచి డైరెక్టర్‌ దాకా తనకు తెలియనివారే లేరని.. వారికి తాను ఎంత చెబితే అంత అని వారితో దిగిన ఫొటోలు చూపిస్తాడు. ఒకసారి తన బుట్టలో పడగానే.. అమ్మాయిల నుంచి డబ్బు, బంగారు నగలు.. ఇలా ఏది దొరికితే అది లాగేసుకుంటాడు. ఆపై వారిని శారీరకంగానూ వాడుకొని ముఖం చాటేస్తాడు.

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మహారాజ్‌పేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తున్న నారాయణ రాజు (45) లీలలివి! ఇలా ఏళ్లుగా ఎంతోమంది అమాయక యువతులను మోసం చేశాడు. ఇతడిపై ఏడాది క్రితమే తెలంగాణ, ఏపీలో పలువురు బాధితులు పోలీసులకు, విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే.. తనపై ఎవరు ఫిర్యాదు చేసినా.. విచారణ జరగకుండా వారిని మేనేజ్‌ చేయడం ఇతగాడి స్టయిల్‌!

కథా రచయితగా చాన్స్‌ పేరుతో…..నారాయణ రాజు చేతిలో తాను మోసపోయానంటూ ఆంధ్రజ్యోతిని ఓ బాధితురాలు ఆశ్రయించింది. ఆమె స్వస్థలం ఏపీలోని నెల్లూరు. సినిమాలకు కథలు రాద్దామనే ఆసక్తితో తరచూ నగరానికి వచ్చేది. 2012లో ఓ లేడిస్‌ హాస్టల్‌ వద్ద ఆమెకు నారాయణ రాజు పరిచయమయ్యాడు. ఆమె బలహీనతను అవకాశంగా తీసుకొని సినిమాల్లో కథా రచయితగా చాన్స్‌ ఇప్పిస్తానని నమ్మబలికాడు. అతడి వద్ద కారు ఉండటం.. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం చూసి పూర్తిగా నమ్మింది. ఒకసారి అర్జెంటుగా రూ. లక్ష కావాలని అడిగాడు. మరోసారి తండ్రి ఆరోగ్యం బాగాలేదని రూ.లక్షన్నర అడిగాడు.

ఇలా అడిగినప్పుడల్లా ఆమె అప్పుచేసి మరీ అతడికి డబ్బు సర్దేది. కొన్నాళ్లకు ఆమె కోసం నెల్లూరు వెళ్లేవాడు. వెళ్లినప్పుడల్లా అతడికి ఆమె సకల మర్యాదలు చేసేది. మొత్తంగా డబ్బు, నగల రూపంలో దాదాపు రూ.10లక్షలు అతడికి ఽఇచ్చుకుంది. ఏళ్లు గడుస్తున్నా సినిమాల్లో అవకాశం కల్పించకపోవడం, తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో అనుమానించి నిలదీసింది. అతడి కోసం అప్పట్లో అతడు నివాసం ఉంటున్న కూకట్‌పల్లికి వెళ్లింది. అక్కడ అతడి చేతిలో మోసపోయిన తనలాంటి మరి కొందరు బాధితులు ఆమెకు కనిపించారు. అప్పటికే అతడు తన మకాం మరోచోటకు మార్చుకున్నట్లు… రంగారెడ్డి జిల్లాకు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నట్లు తెలిసింది. అతడిపై నిరుడు ఆగస్టులో విద్యాశాఖ కార్యాలయంలో, ఎస్సార్‌నగర్‌ పీఎ్‌సలో ఫిర్యాదు చేసింది. నారాయణ రాజును అరెస్టు చేసి, తన నుంచి తీసుకున్న డబ్బును ఇప్పించాలని వేడుకొంది.

Courtesy Andhrajyothy…