• మరణ వాంగ్మూలంలో హాథ్రస్‌ యువతి
  • బలాత్కారం చేసిన ఆధారాలున్నాయ్‌
  • మెడికల్‌ కాలేజీ ప్రాథమిక నివేదికలో స్పష్టం
  • ప్రాథమిక నివేదికకు భిన్నంగా ఫోరెన్సిక్‌
  • 72 గంటల వరకే స్పెర్మ్‌ ఉంటుంది
  • 11 రోజుల తర్వాత పరీక్ష జరిపారు
  • అందువల్లే స్పెర్మ్‌ కనిపించలేదు: నిపుణులు
  • హాథ్రస్‌ హత్యాచారంలో మలుపు

అలీగఢ్‌, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని హాథ్ర్‌సలో దళిత యువతిపై అత్యాచారం కేసు కొత్త మలుపు తిరిగింది. ఆమెపై అత్యాచారం జరగలేదని, స్పెర్మ్‌ ఆనవాళ్లు కనిపించలేదని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదిక ఇచ్చినట్లు ఇప్పటికే పోలీసులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దాని ఆధారంగానే, ఆ బాలిక మొట్టమొదట చికిత్స పొందిన అలీగఢ్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రి ఆదివారం తుది నివేదిక ఇచ్చింది. ఇందులో కూడా స్పెర్మ్‌ ఆనవాళ్లు కనిపించలేదని స్పష్టం చేసింది. అయితే, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదికను అనుసరించే తాము తుది నివేదికను ఇచ్చినట్లు అందులో స్పష్టం చేసింది. కానీ, సదరు జవహర్‌లాల్‌ నెహ్రూ మెడికల్‌ కాలేజీ ఇచ్చిన ప్రాథమిక నివేదికలోని విషయాలు తాజాగా బయటకు వచ్చాయి. ఆ వివరాలను ‘ది వైర్‌’ వెబ్‌సైట్‌ ప్రచురించింది. దాని ప్రకారం.. ‘ఆ అమ్మాయిపై సెప్టెంబరు 14న లైంగిక, భౌతిక దాడి జరిగింది. ఆమెను జవహర్‌లాల్‌ నెహ్రూ ఆస్పత్రికి తీసుకొచ్చారు. మెడికో లీగల్‌ కేసుగా దీన్ని నమోదు చేశారు.

అక్కడ ఆమె పరిస్థితి విషమించింది. దాంతో, మేజిస్ట్రేట్‌ను పిలిపించారు. ఆయనకు ఆ యువతి మరణ వాంగ్మూలం ఇచ్చారు. అందులో, తనపై నలుగురు యువకులు గ్యాంగ్‌రేప్‌ చేశారని ఆమె పేర్కొన్నారు. ఆ నలుగురు యువకుల పేర్లు కూడా చెప్పారు. అలాగే, తనపై రేప్‌ జరిగినట్లు ఆ అమ్మాయి డాక్టర్లకు చెప్పింది. యోనిని పరీక్షించి చూసినప్పుడు ఆమె బలాత్కారానికి గురైనట్లు స్పష్టమైందని ఆమెను పరీక్షించిన మెడికల్‌ కాలేజీ డాక్టర్‌ తెలిపారు. డాక్టర్లు ఆ రోజే ఈ కేసును ఆగ్రాలోని ప్రభుత్వ ఫోరెన్సిక్‌ లేబొరేటరీకి రిఫర్‌ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారం, రేప్‌ జరిగినప్పుడు డాక్టర్లు ఆస్పత్రి స్థాయిలో లేక వ్యక్తిగత స్థాయిలో దాన్ని ధ్రువీకరించరాదు. అలాగే నిరాకరించనూ కూడదు. ఫోరెన్సిక్‌ నివేదిక ద్వారానే పూర్తి వివరాలు వెల్లడి కావాలి. ఈ నిబంధనను అనుసరించి, మెడికల్‌ కాలేజీ డాక్టర్లు తమ అభిప్రాయాన్ని బయటకు వెల్లడించలేదు. అయితే, ఆగ్రాలోని ల్యాబ్‌కు చెందిన నిపుణులు సెప్టెంబరు 25న మెడికల్‌ కాలేజీకి వచ్చి రక్త నమూనాలను, స్వాబ్‌ శాంపిల్స్‌ను తీసుకెళ్లారు. దాన్ని ఆ తర్వాత రోజున పరీక్షించారు. అంటే, అత్యాచారం జరిగిన 11 రోజుల తర్వాత పరీక్షించి స్పెర్మ్‌ లేదని తేల్చారు. ఈ విషయాన్ని ఇప్పుడు డాక్టర్లు తప్పుబడుతున్నారు. ‘‘సాధారణంగా స్మెర్మ్‌ జీవిత కాలం 72 గంటలే. ఫోరెన్సిక్‌ నిపుణులు 11 రోజుల తర్వాత పరీక్షించారు. అప్పుడిక స్పెర్మ్‌ ఎలా కనిపిస్తుంది?’’ అని అలీగడ్‌ ముస్లిం యూనివర్సిటీ రెసిడెంట్‌ డాక్టర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ హ మ్జా మాలిక్‌ ప్రశ్నించారు. అయితే, ఫోరెన్సిక్‌ నివేదికలో ఉన్న విషయాన్నే తాను మీడియాకు చెప్పానని యూపీ అదనపు డీజీ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు.

Courtesy Andhrajyothi