– తె.ర

ఉత్తర ప్రదేశ్‌ లోని హథ్రాస్‌ గ్రామంలో 19 ఏళ్ల దళిత యువతిపై అత్యాచారం, ఆ పైన దాన్ని కప్పిపుచ్చేందుకు జరిగిన ప్రయత్నాలు దేశాన్నే దిగ్భ్రాంత పరుస్తున్నాయి. దీనిపై యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వ ఎదురుదాడి, దుర్మార్గమైన కేసులు మరింత ఘోరంగా వున్నాయి. ఈరోజు సుప్రీంకోర్టు కూడా జరిగిన దారుణాన్ని తీవ్రంగా ఖండిస్తూ, బాధిత కుటుంబానికి ఎలాంటి రక్షణ కల్పించారో తెలియజేయాలని ఆదేశించింది. అయితే ఈ నిరసనలపై సానుకూలంగా స్పందించకపోగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద కుట్ర జరుగుతున్నదని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా స్వయంగా చెప్పారంటే ఈ ఎదురుదాడి ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు.

ఘటనను నివేదించేందుకు వెళ్లిన జర్నలిస్టుల పైన, సంఘాల పైన, కూడా దాదాపు ఇరవై ఎఫ్‌ఐఆర్‌ లు నమోదు చేశారు. వారిపై నిఘా వేసి, ఫోన్లు ట్యాప్‌ చేసి సమాచారం సేకరించారు. ఆఖరుకు ఇలాంటి అమానుషాలు అరికట్టాలని వ్యాఖ్యానించిన ఐక్యరాజ్యసమితి సమన్వయకర్తను కూడా కేంద్రం అభిశంసించింది. సెప్టెంబరు 14న ఈ ఘోరకలి జరిగితే 29వ తేదీన ఆమె మరణించేవరకు బయిటి ప్రపంచానికి సమాచారం తెలియనివ్వలేదు. తల్లితో పాటు గడ్డి కోసుకురావడానికి వెళ్లిన ఆ అమ్మాయిని గ్రామంలోని ఠాకూర్‌ పెత్తందార్ల సంతతి వెంటాడి హింసించడమే గాక ప్రాణాంతకంగా మెడకు చున్నీ చుట్టి పొలాలలో ఈడ్చుకుపోవడంతో వెన్నెముక చితికిపోయింది. కాళ్లు చచ్చుబడ్డాయి. వినికిడి సరిగ్గా లేని ఆమె తల్లి గుర్తించేసరికి జరగాల్సినదంతా జరిగిపోయింది. తల్లి సోదరుడు టూ వీలర్‌ మీద ఆమెను తీసుకుని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళితే గంటల తరబడి ఆలస్యం చేశారు. ఆమె అక్కడ ఇనుప బల్లపై బాధపడుతూ వుండిపోయింది. జరిగింది పూర్తిగా చెప్పకుండానే మాఫీ చేయాలని చూశారు. స్థానిక ఆస్పత్రి నుంచి ఢిల్లీ లోని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రికి ఆమెను వెంటిలేటర్‌ పైనే తీసుకుపోవడం రాత్రికి రాత్రి మృతదేహం తెచ్చి కుటుంబ సభ్యులు, కనీసం కన్నతల్లి కూడా కడసారి చూడనీకుండా తగలబెట్టడం ఏదో రహస్యాన్ని దాచిపెట్టడానికేనని పసిపిల్లలు కూడా చెబుతారు.

నిర్భయ ఉదంతం తర్వాత ఈ దురంతం అత్యధిక సంచలనం కలిగించిందంటే జరిగిన ఘోరకలి తీవ్రతే అందుకు కారణం. నిర్భయ కేసుకన్నా ఇక్కడ దారుణం ఏమంటే సరైన చికిత్స లేకపోవడం, బలైన యువతి మృతదేహం కూడా అప్పగించకుండా కాళరాత్రి మూడు గంటలకు దహనం చేయడం, ఆ పైన అత్యాచారమే జరగలేదని కట్టుకథలు ప్రచారంలో పెట్టడం, నిరసన, పరామర్శ కోసం వెళ్లిన జాతీయ నాయకులపైనా పోలీసు ప్రయోగం, అన్నీ జరిగిన దాన్ని తొక్కిపెట్టడం కోసం జరిగినవే. ఒక దళిత యువతి జీవితం ఇంత ఘోరంగా బలి తీసుకున్న వారిపై ఆగ్రహంతో రగిలిపోయే బదులు కప్పిపుచ్చే ప్రయత్నాలను ఏమనాలి? ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్‌గాంధీ కిందపడిపోయేంతంగా పోలీసులు తోసి వేయడం దేన్ని సూచిస్తుంది? ఇది జరిగిన తర్వాత హథ్రాస్‌ జిల్లా మేజిస్ట్రేటు ప్రవీణ్‌ కుమార్‌ ఆ కుటుంబాన్ని బెదిరిస్తున్న మరో వీడియో విడుదలైంది. ఈ మీడియా వారంతా ఈ రోజు రేపు వెళ్లిపోతారు, ఉండేది మీరూ మేమే. మీ వాంగ్మూలం మార్చుకుంటారో లేదో ఆలోచించుకోండని ఆయన హెచ్చరిస్తున్నారందులో. దీన్ని ఆలీగఢ్‌ డివిజన్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పుడు షరామామూలుగా పరిశీలించి చర్య తీసుకుంటామని జవాబిచ్చారు. ఆఖరుకు లక్నో లోని హైకోర్టు బెంచి న్యాయమూర్తి జస్‌ ప్రీత్‌సింగ్‌ జోక్యం చేసుకుని జరిగిన ఘటన, దానిపై నివేదికలు మన అంతరాత్మను కల్లోల పరిచేలా వున్నాయని అన్నారు. ఆ కుటుంబంపై ఎలాంటి నిర్బంధం, వొత్తిడి లేకుండా పూర్తి భద్రత రక్షణ కల్పించాలని ఆదేశించారు. మరో పది రోజులలో నివేదికనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను ఆదేశించారు.

హథ్రాస్‌ పైశాచికం గురించి జాతీయ మీడియా బయిటకు రాకుండా చేసిన తీరు మరో వైపరీత్యం. ఆమె అంత్యక్రియలు కుటుంబ సభ్యులే జరిపించారని కూడా అసత్య వీడియోలు ప్రసారం చేయించారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ వివాదం డ్రగ్స్‌ వ్యవహారంలో ముంచెత్తారు. ఆమె అంత్యక్రియల తంతు పూర్తి చేసిన తర్వాత అది కూడా ప్రధాని మోడీ జోక్యం అనంతరం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ రంగంలోకి వచ్చి కఠిన చర్యల గురించి మాట్లాడారు, కాని జరుగుతున్నది పూర్తి భిన్నం. ఇదంతా రాబోయే ఎన్నికలలో ఠాకూర్ల ప్రాపకం నిలబెట్టుకోవడం కోసమేనన్నది బహిరంగ రహస్యం. ఆ ఊళ్లో 200 కుటుంబాలు వుంటే కేవలం నాలుగు దళిత కుటుంబాలు మాత్రమే వుండటంతో దాదాపు బానిసలుగా బతకాల్సిన పరిస్థితి వుందని చెబుతున్నారు.

ఆమెపై అత్యాచారం జరిగినట్టు నివేదికలు నిర్ధారించడం లేదని ఉన్నతాధికారులు ప్రకటించారు. అత్యాచారం అంటే చట్టబద్ధమైన నిర్వచనం ప్రకారం ఈ వాదన సరికాదని మాజీ ఐపిఎస్‌ అధికారి ఆస్తానా స్పష్టం చేశారు. అత్యాచారం జరిగిన మూడు రోజుల లోగా పరీక్ష జరిపితేనే సాక్ష్యాలు దొరకుతాయి. ఈ అభాగ్యురాలిని పది రోజుల తర్వాత పరీక్షించారు. వాస్తవంలో ఆమె తన వాంగ్మూలంలో అత్యాచారం జరిగినట్టు గట్టిగా చెప్పింది. వారి పేర్లు కూడా వెల్లడించడమేగాక గ్రామంలో చూసిన వారేనని నిర్ధారించింది. ఇలాంటి కేసుల్లో బాధితురాలి వాంగ్మూలానికి అత్యధిక విలువ ఇవ్వాలన్నది న్యాయ సంప్రదాయం. పైగా బలప్రయోగం, ఈడ్చుకు వెళ్లడం, శరీరంపై గాయాలు ఇవన్నీ ఆస్పత్రిలో కూడా నిర్ధారించారు. గతంలో బిజెపి ఎంఎల్‌ఎ లు, ఎం.పి లు కూడా అత్యాచార ఘటనల్లో దొరికిపోయిన తీరు దేశమంతా చూసింది.

తమ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికే కొందరు అధికారులు కావాలని సంప్రదాయ విరుద్ధంగా ఆమెను అర్థరాత్రి దహనం చేశారని ఘజియబాద్‌లో ‘లోని’ నియోజకవర్గ బిజెపి ఎంఎల్‌ఎ నందకిశోర్‌ వాదించడం విడ్డూరం. శాంతి భద్రతల పరిరక్షణ కోసం చేసినట్టు ఇప్పుడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో చెబుతున్నది. దేశమంతా రగిలిన నిరసన తర్వాత ఆత్మరక్షణ కోసం సమర్థనలివి. ఇదే రీతిలో నాయకులపై బలప్రయోగం చేసినందుకు విచారం వెలిబుచ్చడం, కొంతమంది అధికారులను తాత్కాలికంగా బదిలీ చేయడం కూడా కంటితుడుపు కోసమేనని తర్వాత మీడియాపై కార్యకర్తలపై కేసుల బనాయింపు బట్టి తెలుస్తుంది. విదేశీ నిధులతో తన ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు కొన్ని శక్తులు దీన్ని పెద్దవి చేస్తున్నాయని ముఖ్యమంత్రి యోగి చెప్పడం వారి రాజకీయ వ్యూహానికి నిదర్శనం. మరోవైపు విపరీతమైన అసత్య ప్రచారాలు కూడా సాగాయి. కన్న తల్లి ఆమెను పరువు కోసం హత్య చేసి తమపై నెడుతున్నారనే కథ వాటిలో మరీ పైశాచికమైంది. కాంగ్రెస్‌ పాలనలోని రాజస్థాన్‌లో జరిగిన అత్యాచారాలను పట్టించుకోకుండా దీనిపై ఇంత రాద్ధాంతం దేనికని అర్ధం లేని వాదనలు తీసుకొచ్చారు.

గతంలో జెఎన్‌యు దురంతాల సమయంలో పెద్ద నోరు వేసుకుని దాడి చేసిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని మరోసారి రంగంలోకి దింపారు. ఎక్కడ దళితులపై అత్యాచారాలు జరిగినా అరికట్టవలసిందే తప్ప ఈ పోటీ దేనికి? దానివల్ల ఈ ఘాతుకం తగ్గుతుందా? ఈ అంశాన్ని కాంగ్రెస్‌ కోణం లోకి మరల్చే ప్రయత్నం కూడా అందులో భాగమే. ఒక తెలుగు పత్రికలో బిజెపి జాతీయ కార్యదర్శి అచ్చంగా ఈ ధోరణి లోనే వ్యాసం రాశారు కూడా. ప్రియాంకను అడ్డుకోవడంపై పోలీసులు విచారం వెలిబుచ్చుతూనే ప్రజా సంఘాలపై కేసులు పెట్టడం యాదృచ్ఛికం కాదు. ఐద్వా, వామపక్షాల బృందాలు బాధిత కుటుంబ పరామర్శకు వెళ్లినపుడు తెలిసిన విషయాలు హృదయ విదారకంగా వున్నాయి. కరోనా పేరుతో మొదట ఎవరినీ రాకుండా అడ్డుకోవాలని చూడటం కూడా ఈ పథకంలో భాగమే. బాధితులను మీడియా ప్రశ్నలు వేసిన తీరును కూడా కుట్రగా చిత్రించడం ఈ కేసు లోనే చూశాం. యోగి ప్రభుత్వం సకల కుయుక్తులనూ కుటిల పన్నాగాలను ఎలా అమలు చేస్తుందనేందుకు ఇవన్నీ ఉదాహరణలు.

బీహార్‌ ఎన్నికల్లో గెలవడం కోసం ఆర్నబ్‌ గోస్వామి వంటి వారి సాయంతో సుశాంత్‌ ఆత్మహత్య దర్యాప్తును ఆయుధంగా చేసుకున్న బిజెపి కూటమి…యు.పి లో ఒక దళిత యువతి ఇంత రాక్షసత్వానికి బలైతే అంతకంటే క్రూరమైన రాజకీయ రాక్షసంతో నిరసనను తొక్కిపట్టాలని చూడటం పెద్ద హెచ్చరిక. ఎ.పి ప్రధాన ప్రాంతీయ పార్టీలు దీనిపై గట్టిగా నిరసన తెల్పలేకపోవడం, సోషల్‌ మీడియాలో కొందరు ఈ సమస్యను దళిత వ్యతిరేక కోణంలోకి మరల్చాలని చూడటం వికృతత్వానికి పరాకాష్ట. కుల మతాలతో సామాజిక నేపథ్యాలతో నిమిత్తం లేకుండా స్త్రీలపై ఆగని అత్యాచారాలు ఒక వాస్తవమైతే దళితుల విషయంలో కుల వివక్ష కూడా దానికి తోడై మరింత ఖండనీయం అవుతుంది. రాజకీయ సామాజిక కోణాలలో స్పందించడం అమానవీయత అవుతుంది. నిర్భయ ఘటన సమయంలో దేశమంతా భగ్గుమన్న తీరు చైతన్యం పెంచింది. అయితే ఆ నిరసనలో పాలుపంచుకున్న స్మృతి ఇరానీ ఇప్పుడు కొత్త రాగాలు ఆలపించడం రాజకీయ కపటత్వం తప్ప మరోటి కాదు. గాంధీ నూట యాభయ్యవ జయంతి ముగింపు రోజునే యువతి మృతి, తదనంతర వికృతాలు దేశానికి కనువిప్పు కావాలి. సుప్రీం కోర్టు స్వయంగా జోక్యం చేసుకుంది గనక న్యాయం చేస్తుందని ఆశించాలి. సిఎఎ వ్యతిరేక ఆందోళనలపై అనుసరించిన ఎత్తుగడలే యు.పి లోనూ ప్రయోగించడం దేశానికి ఒక హెచ్చరికగా తీసుకోవాలి.

Courtesy Prajashakti