• యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నిర్ణయం
  • అన్ని దారులూ బాధితురాలి గ్రామానికే
  • రాహుల్‌, ప్రియాంకకు పోలీసుల అనుమతి
  • బాధిత కుటుంబం నుంచి డీజీపీ, హోంశాఖ
  • సహాయ కార్యదర్శి వాంగ్మూలం సేకరణ
  • చివరిచూపు దక్కకుండా చేశారు.. బాధితులు

న్యూఢిల్లీ/లఖ్‌నవూ/పట్నా/భోపాల్‌ : యూపీలోని హాథ్ర్‌సలో దళిత యువతిపై సామూహిక హత్యాచారం కేసును సీబీఐకి అప్పగించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నిర్ణయించారు. శనివారం హాథ్ర్‌సలో బాధిత కుటుంబా న్ని కలిసిన డీజీపీ హెచ్‌సీ అవస్థీ, హోంశాఖ అదనపు కార్యద ర్శి అవనీశ్‌ అవస్థీల నివేదిక మేరకు కేసును సీబీఐకి అప్పగి స్తామని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

2 రోజులుగా పోలీసు కట్టడిలో ఉన్న హాథ్రస్‌ గ్రామంలో శనివారం నిషేధాజ్ఞలను సడలించారు. దీంతో అన్ని దారులూ హాథ్ర్‌సకు వెళ్తున్నాయి.హాథ్ర్‌సలో హత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు గురువారం ప్రయత్నించి విఫలమైన కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌, ఎంపీ రాహుల్‌ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి శనివారం పోలీసులు అనుమతినిచ్చారు. అయితే.. వారిద్దరూ ఢిల్లీ నుంచి 50మంది ఎంపీలతో బయల్దే రగా ఢిల్లీ-నోయిడా ఫ్లైఓవర్‌ టోల్‌గేట్‌ వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. అనుమతి ఉందని రాహుల్‌ చెబుతున్నా పోలీసు లు పట్టించుకోలేదు. హాథ్ర్‌సలో 144 సెక్షన్‌ కొనసాగుతున్నందున అక్కడకు వెళ్లేందుకు నేతలకు అనుమతి లేదన్నారు. ఉన్నతాధికారులతో సంప్రదింపుల తర్వాత ఐదుగురే వెళ్లాలని స్పష్టం చేశారు. దీంతో రాహుల్‌, ప్రియాంక, కాంగ్రెస్‌ సీనియ ర్‌ నాయకులు కేసీ వేణుగోపాల్‌, ఆధిర్‌ రంజన్‌ చౌదురి, ముకుల్‌ వాస్నిక్‌ వెళ్లారు. అంతకుముందు సరిహద్దుల్లో గుమిగూడిన కాంగ్రెస్‌ కార్యకర్తలపై పోలీసులు స్వల్పంగా లాఠీలు ఝళిపించారు. దీంతో ప్రియాంక కారు దిగి పోలీసుల లాఠీచార్జిని అడ్డుకున్నారు. శనివారం రాత్రి హాథ్ర్‌స చేరుకున్న రాహుల్‌, ప్రియాంక బాధితురాలి కుటుంబ సభ్యులతో 45 నిమిషాలు మాట్లాడారు. అనంతరం బాధితురాలి కుటుం బానికి న్యాయం జరిగే దాకా పోరాడుతామని ప్రియాంక అన్నారు. బాధితుల గొంతును ఏ శక్తీ అణచివేయలేదని రాహుల్‌ అన్నారు. యూపీ కాంగ్రెస్‌ చీఫ్‌ అజయ్‌ కుమార్‌ లల్లూను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు.

బాధిత కుటుంబాన్ని కలిసిన డీజీపీ
తీవ్ర విమర్శల నేపథ్యంలో హత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులను కలిసి, సమగ్ర నివేదిక అందించాలని డీజీపీ హెచ్‌సీ అవస్థీ, హోంశాఖ అదనపు కార్యదర్శి అవనీశ్‌ అవస్థీని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశించారు. దీంతో వారిద్దరూ శనివారం హాథ్రస్‌ వెళ్లి బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ‘‘సిట్‌ ప్రాథమిక నివేదిక మేరకు ఎస్పీ, సీఐ, మరో ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్‌ చేశాం. తుది నివేదిక త్వరలో అందనుంది. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం, ఒక ఇల్లు, ఇంట్లో ఒకరికి గ్రూప్‌-సీ ప్రభుత్వోద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది’’ అని అవనీశ్‌ అవస్థీ విలేకరులతో అన్నారు. కాగా, హాథ్రస్‌ ఘటనకు వ్యతిరేకంగా వాల్మీకీ సమాజం ఆధ్వర్యంలో ఆగ్రాలో చేపట్టిన నిరసనలు స్వల్ప ఉద్రిక్తతకు దారితీశాయి. హత్యాచారానికి వ్యతిరేకంగా నినాదాలిస్తూ నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఆగ్రాలో పారిశుద్ధ్య పను లు నిలిపివేయాలని వాల్మీకీ సమాజం సభ్యులు పిలుపునిచ్చా రు. దోషులను శిక్షించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పరిస్థితులను చక్కబెట్టేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించాల్సి వచ్చింది.

యూపీలో ఆటవిక రాజ్యం: శివసేన
రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసినా యూపీలో ఆటవిక రాజ్యం కొనసాగుతోందని శివసేన తీవ్రంగా విమర్శించింది. హాథ్రస్‌ కేసును సీబీఐకి అప్పగించాలని బీఎస్పీ చీఫ్‌ మాయావతి డిమాండ్‌ చేశారు. లేదంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ జరిపించాలన్నారు. కాగా, వారాణసీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కాంగ్రెస్‌ వర్గాలు ఘెరావ్‌ చేయడంతో ఆమె మండిపడ్డారు.

యూపీ, బిహార్‌లలో హాథ్రస్‌ తరహా ఘటనలు
యూపీలో దళిత యువతిపై హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న సమయంలోనే యూపీ, బిహార్‌లోనూ అలంటి ఘటనలే జరిగాయి. బిహార్‌లోని గయా జిల్లాలో ఓ దళిత యువతిపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అవమానం భరించలేక బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడింది. యూపీలోని సికందర్‌పూర్‌లోనూ ఆసిఫ్‌ అనే దుండగుడు 15ఏళ్ల బాలికను అపహరించి, అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

చివరి చూపునకు నోచుకోలేదు : బాధితురాలి కుటుంబ సభ్యులు
రెండు రోజుల నిషేధాజ్ఞల తర్వాత శనివారం ప్రింట్‌, ఎలక్ర్టానిక్‌ మీడియా ప్రతినిధులు హాథ్రస్‌ చేరుకున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారి ఆవేదనను వెలుగులోకి తెచ్చారు. ‘‘పోలీసుల తీరు దారుణంగా ఉంది. మా చెల్లి మృతదేహాన్ని కడసారి కూడా చూసే అవకాశమివ్వలేదు. అంత హడావుడిగా అర్ధరాత్రి అంత్యక్రియలు జరపాల్సిన అవసరమేమొచ్చింది? సిట్‌ కూడా దర్యాప్తు పూర్తయిందని చెబుతోంది. కానీ, మమ్మల్ని ఏ అధికారీ కలవలేదు. గ్రామస్థులతోనే మాట్లాడారు. పోస్టుమార్టం రిపోర్టు అడిగితే.. అది ఇంగ్లి్‌షలో ఉందని, మాకు అర్థంకాదని బుకాయించారు’’ అని బాధితురాలి సోదరుడు చెప్పారు. మరో బంధువు మాట్లాడుతూ.. ‘‘రెండు రోజులుగా నిర్బంధంలో ఉన్నాం. పోలీసులు తరచూ ఇంట్లోకి వచ్చి, ఫోన్లను అడిగి తీసుకునేవారు. ప్రైవసీ కావాలని కోరినా పట్టించుకోలేదు. గ్రామ అధికారి ఒకరు నేరుగా సెటిల్మెంట్‌ చేసుకోవాలంటూ ఒత్తిడి తీసుకువస్తున్నారు’’ అని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం కావాలని కోరారు.

Courtesy Andhrajyothi