పి. చిదంబరం 
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,
కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

ప్రతి అన్యాయమూ, అధర్మమూ సమాజంలో పాదుకుపోయిన ‘మనం ఏమి చేసినా చెల్లుతుందనే’ అహంకృత వైఖరి నుంచే ప్రారంభమవుతాయి. అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు చట్ట ఉల్లంఘనకు భయపడాల్సిన అవసరమేముంది? ప్రభుత్వ ఉత్తర్వులను అధికారులూ, ఉద్యోగులూ ధిక్కరించనంత వరకు సమాజంలోని బలాఢ్యుల దురహంకార చర్యలను, నిర్భయంగా వ్యవహరించే వారి చిత్తవృత్తిని ప్రభుత్వాలు సహిస్తాయి. అధర్మం ఎందుకు రాజ్యమేలుతుందో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది.

న్యూఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో 2020 సెప్టెంబర్ 29న ఒక యువతి అంతిమ శ్వాస విడిచింది. మరణానికి వారం రోజుల ముందు, సెప్టెంబర్ 22న ఒక మెజిస్ట్రేట్‌కు ఆమె వాంగ్మూల మిచ్చింది. తమ ఊరికే చెందిన (ఉత్తరప్రదేశ్ హథ్రాస్ జిల్లాలోని బూల్‌గార్హీ గ్రామం) నలుగురు వ్యక్తులు తనపై అత్యాచారం చేశారని తెలిపింది. అత్యాచారానికి పాల్పడ్డ నలుగురు వ్యక్తుల పేర్లను కూడా ఆమె స్పష్టంగా పేర్కొంది. ఆ యువతి మరణించిన తరువాత పోలీసులు ఆమె భౌతికకాయాన్ని హడావిడిగా బూల్‌గార్హీ గ్రామానికి తరలించి సెప్టెంబర్ 30 అర్ధరాత్రి అంత్యక్రియలు నిర్వహించారు.

మరణించిన యువతి ఒక పేద దళిత కుటుంబపు ఆడపడుచు. ఆమె  మరణ వాంగ్మూలంలో పేర్కొన్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ యువతి కుటుంబం అంటరాని కులానికి చెందినదని, వారిని తాము ఒక తోపుడుగడతో కూడా ముట్టుకోమని ఆ వ్యక్తులు పేర్కొన్నారు. బూల్‌గార్హీ లాంటి గ్రామాలు భారతావని అంతటా వేల సంఖ్యలో ఉన్నాయి. ఆ గ్రామాలలోని దళిత కుటుంబాలకు జీవనోపాధిని కల్పించే సొంత భూ వసతి ఉండదు. ఉన్నప్పటికీ, మహా అయితే ఒకటి రెండు ఎకరాలకు మించి ఉండదు. ఈ సామాజికవర్గం వారు ఊరిలో భాగంగా కాకుండా ఊరికి పెడగా ఉండే వాడల్లో నివసిస్తుంటారు. కాయకష్టమే వారి జీవనాధారం. ఆధిపత్య కులాల ఆసాములపై ఆధారపడి బతుకుతుంటారు. బూల్‌గార్హీ బాధితురాలి తండ్రికి రెండు గేదెలు, రెండు బీఘాల భూమి ఉంది. అతడు ఊరిలోని పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికుడిగా కూడా పని చేస్తున్నాడు.

సమాజంలో మౌలిక మార్పుల కోస‍ం ఆరాటపడిన మహాత్మా ఫూలే, ‘పెరియార్’ ఇ.వి. రామస్వామి, బాబాసాహెబ్ అంబేడ్కర్ మొదలైన మహా సాంఘిక సంస్కర్తల ప్రభావంతో దళితులు రాజకీయంగా సంఘటితమయ్యారు కానీ, వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులేమీ చెప్పుకోదగిన విధంగా మెరుగుపడలేదు. అత్యాచారం, భారత్‌లో నిత్యం ఎల్లెడలా జరుగుతున్న నేరం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సమాచారం ప్రకారం 2019 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 32,033 అత్యాచార ఘటనలు సంభవించాయి. వీటిలో 3065 ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే జరిగాయి. చాలా అత్యాచార ఘటనలను నేరాలుగా నమోదు చేసి, దర్యాప్తు జరిపి, నిందితులపై విచారణ జరుపుతున్నారు. వాటిలో నేర నిర్ధారణ జరుగుతున్న కేసుల సంఖ్య 28 శాతంగా ఉంది. నిందితులు పలువురు అత్యాచారానికి పాల్పడినట్టు రుజువై జైలుశిక్షలు అనుభవిస్తున్నారు. అత్యాచార ఘటన జరిగినప్పుడు కొద్ది రోజుల పాటు అది ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా ఉంటోంది. అయితే కొద్ది రోజులకే అది పాతపడిన వార్త అయిపోతోంది. కొన్ని కేసులు సంచలన ‘సంఘటనలు’గా పరిణమిస్తాయి. బూల్‌గార్హీ కేసు అటువంటి కేసుల్లో ఒకటి. అది సంచలనాత్మకం కావడానికి సహేతుక కారణాలు ఉన్నాయి. ఈ కేసుతో ప్రమేయమున్న ప్రతి ఒక్కరికీ, చండపా పోలీస్‌స్టేషన్ ప్రధానాధికారి, హథ్రాస్ జిల్లా సూపరింటెండెంట్, అలీగఢ్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ వైద్యకళాశాల ప్రిన్సిపాల్, జిల్లా మెజిస్ట్రేట్, రాష్ట్ర శాంతిభద్రతల పరిరక్షణ విభాగం ప్రధానాధికారి అడిషినల్ డిజిపి, మరీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి నిరుపద్రవమనే వైరస్ సంక్రమించిందని అనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పాలనా యంత్రాంగంలోని అందరికీ ఆ మహమ్మారి వ్యాపించినట్టుగానే ఉంది.

అత్యాచార బాధితురాలి పరిస్థితిని ఎస్‌హెచ్‌ఓ చూశారు. ఆమె తల్లి, సోదరుడితో మాట్లాడారు. దాడి, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. బాధితురాలి గురించి అలీగఢ్‌లోని ఆస్పత్రికి నివేదించారు కానీ, ఆమెకు వైద్య పరీక్షలు చేయమని అడగలేదు. అసలు ఆమెపై లైంగిక దాడి జరిగిందనే అనుమానమే అతనికి రాలేదు. చట్టం ప్రకారం, అత్యాచార ఘటన జరిగిన 72 గంటల్లో బాధితురాలికి వైద్య పరీక్షలు ఎందుకు నిర్వహించలేదో జిల్లా ఎస్‌పి వివరించారు. ఈ పరీక్షలు నిర్వహించే విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని, వ్యవస్థీకృత లొసుగులే అందుకు కారణమని, వాటిని అధిగమించేందుకు అందరం కలసికట్టుగా పని చేయవలసిన అవసరముందని ఆయన అన్నారు. ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించలేదని జవహర్‌లాల్ నెహ్రూ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ అంగీకరించారు. లైంగిక దాడి గురించి బాధితురాలు గానీ, ఆమె తల్లి గానీ తనకు ఏమీ చెప్పలేదని, ఆ కోణంలో ఆమెకు పరీక్షలు నిర్వహించలేదని ఆయన చెప్పారు. కుటుంబసభ్యులు లేకుండానే అత్యాచార బాధితురాలి మృతదేహానికి అర్ధరాత్రి అంత్యక్రియలు నిర్వహించాలని ఎస్‌పితో కలిసి జిల్లా మెజిస్ట్రేట్ (కలెక్టర్) నిర్ణయం తీసుకున్నారు. హథ్రాస్ ప్రాంతంలో రాత్రిపూట అంత్యక్రియలు నిర్వహించడం అసాధారణమేమీ కాదని పలువురు తనకు చెప్పారని, అంత్యక్రియల నిర్వహణకు ఒక నిర్దిష్ట హిందూ పద్ధతి ఏమీ లేదని ఎస్‌పి తెలిపారు. మీడియా ప్రతినిధులు ఒకటి రెండు రోజులు మాత్రమే ఉండి వెళ్ళిపోతారని, తాము మాత్రమే వారితో ఉంటామని జిల్లా మెజిస్ట్రేట్ బాధితురాలి కుటుంబసభ్యులతో అన్న మాటలకు విడియో సాక్ష్యం ఉంది. ‘మీ సోదరి కరోనా వైరస్‌తో చనిపోయి ఉంటే మీ కుటుంబానికి నష్టపరిహారం లభించేదేనా?’ అని జిల్లా మెజిస్ట్రేట్ తమతో అన్నాడని బాధితురాలి సోదరుడు చెప్పాడు. ఆమెపై అసలు అత్యాచారమే జరగలేదని, ఫోరెన్సిక్ పరీక్షల నివేదిక ప్రకారం ఆమె దేహంపై వీర్యం జాడలేవీ కన్పించలేదని శాంతిభద్రతల అదనపు డిజిపి పేర్కొన్నారు. (మహాశయా, భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 375, సంబంధిత చట్టాన్ని మరొకసారి చదవండి).

బయటి వారెవ్వరూ ప్రవేశించకుండా ప్రస్తుతం బూల్‌గార్హీ గ్రామాన్ని మూసివేశారు. గ్రామానికి వెళ్ళే రహదారులపై సెక్షన్ 144ని అమలుపరుస్తున్నారు. ఆ గ్రామాన్ని సందర్శించేందుకు మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు ఎవరికీ అనుమతినివ్వడం లేదు. ఈ దురాగతంపై సిబిఐ దర్యాప్తునకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. అయితే అదే సమయంలో రాష్ట్రంలో కుల ఘర్షణలను రెచ్చగొట్టేందుకు, జాతి విద్రోహ కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణపై ‘అజ్ఞాతవ్యక్తుల’ మీద రాష్ట్ర పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేశారు. ఆ రాష్ట్రంలో పాలనావ్యవస్థ పూర్తిగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నియంత్రణలో ఉంది. చిన్న విషయాలుగానీ, పెద్ద పనులు గానీ సమస్తం ఆయన మాట ప్రకారమే జరగడం కద్దు. మరి పైన పేర్కొన్న పలువురు అధికారుల చర్యలు ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగి ఉంటాయా? ఆయా అధికారులు నిర్ణయాలు తీసుకున్నప్పుడు కాకపోయినా ఆ తరువాత అయినా ఆయనకు తెలియకుండా ఎలా ఉంటుంది?

బూల్‌గార్హి యువతిపై దౌర్జన్యం సెప్టెంబర్ 14న జరిగింది. ఆ సంఘటనపై ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ మొదటి ప్రకటన సెప్టెంబర్ 30న వెలువడింది. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన ఆ ప్రకటన చేశారు. దౌర్జన్య ఘటన, ముఖ్యమంత్రి తొలి ప్రకటన మధ్య కాలంలో సదరు దురంతంలో కీలక పాత్రధారులైన వ్యక్తులు సమాజంలో స్వేచ్ఛగా తిరిగారు. అధికారులు సైతం అవాంఛనీయమైనది ఏదీ సంభవించనట్టుగానే వ్యవహరించారు.

మీరు ద్వేషించే వ్యక్తికి అపకారాన్ని తలపెట్టేందుకు మీరు ఎప్పుడు సాహసిస్తారు? మీకు ఏమీ కాదనే భరోసా ఉన్నప్పుడే కదా. ప్రతి అన్యాయమూ, అధర్మమూ సమాజంలో పాదుకుపోయిన ‘మనం ఏమి చేసినా చెల్లుతుందనే’ అహంకృత వైఖరి నుంచే ప్రారంభమవుతాయి. అధికార అభిజాత్యం న్యాయన్యాయాలను వివేచించదు. ‘నా అధికారమే నా ఆయుధం. నా భుజకీర్తులే (ఐఏఎస్, ఐపిఎస్, డాక్టర్ మొదలైనవి) నాకు రక్షణ. నా తరఫున పోరాడేందుకు నా కులం వారు ఉన్నారు. మా ప్రభుత్వమూ, అధికార పక్షమూ నా పరంగా ఎలాంటి అపరాధం జరిగినట్టుగానీ లేదా నేరంలో పాలుపంచుకున్నానని గానీ అంగీకరించవు గాక అంగీకరించవు. ఇంతగా అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు చట్టోల్లంఘనకు భయపడాల్సిన అవసరమేముంది?’– అనే భావాలే న్యాయవిరుద్ధ చర్యలకు పురిగొల్పుతాయనడంలో సందేహం లేదు. ప్రభుత్వ ఉత్తర్వులను అధికారులు, ఉద్యోగులూ ధిక్కరించనంత వరకు సమాజంలోని బలాఢ్యుల దురహంకార చర్యలను, నిర్భయంగా వ్యవహరించే వారి చిత్తవృత్తిని ప్రభుత్వాలు సహిస్తాయి. అధర్మం ఎందుకు రాజ్యమేలుతుందో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. అవును, ఉత్తరప్రదేశ్‌లో ధర్మంపై దాష్టీకం గెలిచింది.

Courtesy Andhrajyothi