• ఢిల్లీ ఎన్నికల్లో నా అంచనాలు తప్పాయి
  • ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కుంది..
  • ఇది సీఏఏపై రెఫరెండం కాదు: అమిత్‌ షా

పార్టీలో ఎన్నో రకాల వాళ్లుంటారు. ఎవరైనా ఏమైనా మాట్లాడి ఉండొచ్చు. కానీ మా పార్టీ ఎలాంటిదో ప్రజలకు తెలుసు. అలాంటి వాళ్ల వల్ల మేమూ ఇబ్బందికి గురయ్యాం. మా పార్టీకి ఎందుకు ఓటు వేయలేదో ఎవరూ రాసి ఇవ్వరు కదా. బీజేపీ ఓటమికి ఇదీ ఓ కారణం కావొచ్చని భావిస్తున్నాం’’
అమిత్‌షా 

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: కొందరు నేతల విద్వేషపూరిత వ్యాఖ్యల వల్లే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నష్టపోయి ఉండవచ్చని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అభిప్రాయపడ్డారు. ప్రచారం సందర్భంగా ‘గోలీ మారో’.. ‘ఇండో-పాక్‌ మ్యాచ్‌’ అంటూ కొందరు చేసిన వ్యాఖ్యలు బీజేపీ ఓటమికి కారణమై ఉండొచ్చన్నారు. ఫలితాలు వచ్చిన మూడు రోజుల తర్వాత గురువారం ఓ న్యూస్‌ చానల్‌ సదస్సులో ఆయన ఢిల్లీ ఎన్నికలపై స్పందించారు. బీజేపీ విజయంపై తన అంచనాలు తప్పాయని అంగీకరించారు. చాలా సందర్భాల్లో తన అంచనాలు నిజమయ్యాయని, ఢిల్లీలో మాత్రం తాను అనుకున్నన్ని సీట్లు సాధించలేకపోయామని ఆవేదన చెందారు. ఈ ఎన్నికల్లో పేలవ ప్రదర్శనపై పార్టీలో సమీక్షించుకున్నామని చెప్పారు. బీజేపీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ ఎన్నికలను ఉపయోగించుకున్నామని షా విశ్లేషించారు. ‘బహూ బేటియోంకా బలాత్కార్‌ కరేంగే’ (కోడళ్లు, కూతుళ్లపై అత్యాచారం చేస్తాం) అని ఎవరూ అనలేదని షా వివరణ ఇచ్చారు. ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలకు పార్టీతో సంబంధం లేదని అప్పుడే స్పష్టం చేశామని గుర్తు చేశారు.

సీఏఏపై ఎవరైనా నాతో చర్చించొచ్చు: షా
షాహీన్‌బాగ్‌ నిరసనకారులను ఉద్దేశించి ప్రతి ఒక్కరికీ శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందని షా అన్నారు. సీఏఏపై చర్చించాలనుకునే వారెవరైనా తన ఆఫీసును సంప్రదించవచ్చని, వారికి మూడు రోజుల్లో సమయమిస్తానని చెప్పారు. అయితే, ఈ ఎన్నికలను సీఏఏ, ఎన్నార్సీపై రెఫరెండంగా భావించడం లేదన్నారు. దేశాన్ని మతం ప్రాతిపదికన కాంగ్రెస్‌ పార్టీనే విడగొడుతోందని షా ఆరోపించారు. హద్దు మీరిన నాయకులపై బీజేపీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని చాలా మంది సోషల్‌ మీడియాలో అప్పుడే ప్రశ్నించారు. కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వంటి కొందరిని మాత్రం ఎన్నికల సంఘం శిక్షించింది. ‘దేశద్రోహులను కాల్చి చంపేయాలి’ అని ఢిల్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సభకు హాజరైన ప్రజలతో వల్లె వేయించారు. షాహీన్‌బాగ్‌ నిరసనకారులకు ఆమ్‌ ఆద్మీ పార్టీ బిర్యానీ తినిపిస్తోందని, తాము మాత్రం బుల్లెట్లు తినిపిస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఓ సభలో చెప్పారు. ‘షాహీన్‌బాగ్‌లో ఉన్న లక్షలాది మంది ఆందోళనకారులు మీ ఇళ్లలోకి చొరబడి మీ కూతుళ్లపై, సోదరీమణులపై అత్యాచారం చేస్తారు. ఇప్పుడే మేల్కొనండి. రేపు జరగరానిది జరిగితే మోదీజీ, అమిత్‌ షా వచ్చి కాపాడరు’ అని బీజేపీ ఎంపీ పర్వేశ్‌ శర్మ రెచ్చగొట్టారు. అమిత్‌ షా కూడా ఈవీఎంలో కమలం బటన్‌ నొక్కితే షాహీన్‌బాగ్‌కు కరెంటు పాస్‌ కావాలని పిలుపునిచ్చారు. అయితే, ఈ ఎన్నికల్లో ఆప్‌ 62 సీట్లలో ఘన విజయం సాధిస్తే బీజేపీ 8 సీట్లు మాత్రమే సాధించింది. గత ఎన్నికల్లో 3 సీట్లే దక్కించుకున్న బీజేపీ ఈసారి సీట్లు, ఓట్ల శాతాన్ని మెరుగు పరుచుకుంది.

షా అనుమతి కావాలా?: ఏచూరి
దేశంలో పర్యటించేందుకు కేంద్ర హోం మంత్రి అ మిత్‌ షా అనుమతి కావాలా? అంటూ సీపీఎం ప్రధా న కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి మండిపడ్డారు. రాజకీయ నాయకులతో సహా ఎవరైనా కశ్మీర్‌లో ఎప్పుడైనా పర్యటించే అనుమతి ఉందన్న షా వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ‘దేశంలో పర్యటించేందుకు మీ అనుమతి కావాలా? నేను మీ అనుమతి లేకుండానే సుప్రీం అనుమతితో కశ్మీర్‌లో పర్యటించాను. తెలుసా?’ అని ప్రశ్నించారు. తన పర్యటన గురించి షాకు తెలియదంటే ఇది అసమర్ధ ప్రభుత్వమని తెలుస్తోందన్నారు.

Courtesy Andhrajyothi