– డబ్ల్యూహెచ్‌ ఓ
జెనీవా : లాక్‌డౌన్‌తో కరోనా మహమ్మారికి చెక్‌ పెట్టొచ్చని అనుకుంటే పొరపాటు అని, ఇకపై వీటికి స్వస్తి పలకాలని ప్రపంచ నేతలకు డబ్ల్యూహె చ్‌ఓ విజ్ఞప్తి చేసింది. కోవిడ్‌-19పై పోరులో డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ కు ప్రత్యేక దూతగా వ్యవహరిస్తున్న డేవిడ్‌ నబరో శనివారం ప్రపంచ నేతలకు ఒక అప్పీలు చేస్తూ, కరోనాను ప్రాథమికంగా నియంత్రించే పద్ధతి కింద లాక్‌డౌన్‌ను ఉపయోగించడం ఆపాలని కోరారు. లాక్‌డౌన్ల వల్ల సాధించినదేమైనా ఉందంటే అది పేదరికమేనని అన్నారు. లాక్‌డౌన్‌ వల్ల ఎంత మంది ప్రాణాలు కాపాడబడినదీ లేనిదీ ఆయన ప్రస్తావించలేదు. అనేక చర్యల్లో లాక్‌డౌన్‌ కూడా ఒకటి. అలా అని దానిని తక్కువ చేసి చూడలేము. దీని వల్ల పేదలు మరింత పేదలుగా మారారని ఆయన చెప్పారు. ‘లాక్‌డౌన్‌ను కరోనా వైరస్‌ అదుపునకు ప్రాథమిక మార్గంగా ప్రపంచ ఆరోగ్య సంస్థలో భాగమైన మేము సూచించం’ అని నబరో చెప్పారు. కరోనాను ఎదుర్కొనేందుకు శక్తినంతటినీ కూడదీసుకునేందుకు, వనరులను సర్దుబాటు చేసుకునేందుకు, ఆరోగ్య కార్యకర్తలకు తగు రక్షణ కల్పించేందుకు కొంత వ్యవధి అవసరమవుతుంది.

ఆ వ్యవధిని తీసుకోవడానికి కొద్ది కాలం పాటు లాక్‌డౌన్‌ విధించడాన్ని తాము సమర్థిస్తాం. కానీ, ఆ పేరుతో లాక్‌డౌన్‌ను పొడిగించుకుంటూ పోవడం సరికాదన్నారు. పర్యాటకమే కాదు, ప్రపంచ వ్యాపితంగా చిన్న, సన్నకారు రైతుల జీవితాలను కూడా ఇది ఛిద్రం చేసిందన్నారు. ఈ కాలంలో పేదరికం విపరీతంగా పెరిగిపోయిందని, వచ్చే ఏడాది నాటికి ప్రపంచ వ్యాపితంగా పేదరికం రెట్టింపు స్థాయికి చేరుకునే అవకాశముందని డాక్టర్‌ నబరో చెప్పారు. చిన్న పిల్లల్లో పౌష్టికాహార లేమి కూడా రెట్టింపయ్యే స్థితి వస్తుందని ఆయన తెలిపారు.