– అంతా ఆర్భాటమే.. హరితహారం అంతంతే…
– ఐదో విడత లక్ష్యం 83 కోట్లు..
– మొక్కలు నాటింది 38.06 కోట్లు
– 18 జిల్లాల్లో 50 శాతం లోపే మొక్కలు నాటిన వైనం
– పూర్తిస్థాయిలో పట్టాలెక్కని అగ్రో ఫారెస్ట్రీ
– ఐదేండ్లల్లో లక్ష్యాన్ని చేరటంలో విఫలం

‘ఐదేండ్లల్లో 230 కోట్ల మొక్కలను నాటుతాం..అడవులను 33 శాతానికి పెంచుతాం..హరిత తెలంగాణగా మారుస్తాం’ తరుచూ ప్రభుత్వాధినేతలు చెబుతున్న మాటలివి. రాష్ట్రంలో ఐదు విడతల్లో హరితహారం పూర్తయినా…ఇప్పటిదాకా నాటి మొక్కలు 152 కోట్లే. 2019లో ‘ఉన్న అడవిని కాపాడుకుందాం…కొత్త అడవిని సృష్టించుకుందాం’ అనే నినాదంతో చేపట్టిన ఐదో విడతలోనూ 38.06 కోట్ల మొక్కలనే నాటారు. 18 జిల్లాల్లో 50 శాతం లోపే మొక్కలు నాటిన వైనం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. రైతులను అగ్రో ఫారెస్ట్రీ వైపు ప్రోత్సహించాలనే లక్ష్యానికీ తూట్లు పడ్డాయి. అంతిమంగా ఐదేండ్లల్లో ‘వానలు వాపస్‌ రావాలే…కోతులు అడవులకు పోవాలి’ అనే సీఎం పిలుపు నీటి మీది రాతలాగే మిగిలిపోయింది. ఊర్లమీద పడి కోతులు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి.

రాష్ట్రంలో 23.4 శాతమున్న అటవీ శాతాన్ని 33 శాతానికి పెంచాలనే లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 2015 జులై 3న రంగారెడ్డి జిల్లా చిలుకూరులో మొక్కలను నాటి ప్రారంభించారు. ఐదేండ్లలో 230 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టారు. ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకూ ఐదు విడతల్లో నాలుగు వేల కోట్ల రూపాయలపైగా ఖర్చుపెట్టినట్టు సమాచారం. ఏ విడతలోనూ నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకోలేకపోయింది. ఇప్పటివరకూ 152 కోట్ల మొక్కలే నాటబడ్డాయి. అందులోనూ ఎన్ని బతికాయన్నదానిపై ఎక్కడా స్పష్టమైన లెక్కలు లేవు. రాష్ట్ర అటవీ విస్తీర్ణంలోనూ పెద్ద పెరుగుదల కనిపించడం లేదు. 2019 నుంచి ఏటా వంద కోట్ల మొక్కలు నాటుతామని సీఎం కేసీఆర్‌ప్రకటించినా.. అందుకు తగ్గట్టుగా మొక్కలను మాత్రం సిద్ధం చేయలేదు. ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు విడుదల కాకపోవడం, విపరీతమైన ఎండలు, సరైన నీటిసౌకర్యం లేకపోవడం వంటి కారణాలు లక్ష్యానికి ఆటంకంగా మారాయి. అటవీ ప్రాంతాల్లో నాటిన మొక్కల్లో 91 శాతం, రక్షిత ప్రాంతాల్లో 60 శాతం, ఇతర ప్రాంతాల్లో నాటిన మొక్కల్లో 53 శాతం మాత్రమే బతికినట్టు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి.

అగ్రోఫారెస్ట్రీ అంతంతే..’చింతే’ది?
ఆదాయాన్నిచ్చే మొక్కలు ఇస్తే, రైతులు వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటారన్న ఆలోచనతో ఐదో విడతలో గంధం, వెదురు తదితర మొక్కలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. 20.5 లక్షల గంధం, 12 కోట్ల టేకు మొక్కలు, సుమారు 4 కోట్ల వెదురు మొక్కలు సిద్ధం చేశామని ప్రకటించినప్పటికీ అందులో సగం కూడా పంపిణీ కాలేదు. అగ్రోఫారెస్ట్రీ మొక్కల పంపిణీ, రైతుల గుర్తింపు బాధ్యతలను హార్టికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించారు. ఇప్పటివరకూ 574 మంది రైతులకు 6 లక్షల గంధం మొక్కలు, 320 మంది రైతులకు 2 లక్షల వెదురు మొక్కలు మాత్రమే పంపిణీ చేసినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. టేకు మొక్కల్లోనూ 60 శాతమే పంపిణీ పూర్తయింది. ఒక్కో జిల్లాలో రోడ్ల వెంబడి కనీసం 15 నుంచి 20 కిలోమీటర్ల మేర చింత మొక్కలు నాటాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినా…క్షేత్రస్థాయిలో 20 శాతం కూడా నాటలేదు.

పెరిగిన అటవీ విస్తీర్ణం అంతంతే…
గత ప్రాభవాన్ని కోల్పోయిన అటవీ ప్రాంతాల్లో గజ్వేల్‌ నియోజకవర్గంలోని సింగాయిపల్లి, నెంటూరు, కోమటి బండలో, హైదరాబాద్‌ చుట్టుపక్కల కొన్ని చోట్ల అర్బన్‌ పార్కుల పేరిట కొంతమేర అడవులను అభివృద్ధి చేశారు. మిగతా చోట్ల అటవీ ప్రాంతం పెద్దగా పెరిగిన దాఖలాలు లేవు. కొన్ని జిల్లాల్లోనైతే అటవీ విస్తీర్ణం ఒక్కశాతం కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. కరీంనగర్‌ జిల్లాలో 0.15శాతం, గద్వాల్‌లో 0.29శాతం, హైదరాబాద్‌లో 0.79 శాతం విస్తీర్ణంలోనే అడవులు ఉన్నాయి. 15 జిల్లాల్లో అటవీ విస్తీర్ణం 10 శాతం కంటే తక్కువగా ఉంది.

ఐదు శాతం కంటే తక్కువ అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లాలు
కరీంనగర్‌, జోగులాంబ గద్వాల్‌, హైదరాబాద్‌, జనగామ, వరంగల్‌ అర్బన్‌, నారాయణపేట్‌, సూర్యాపేట్‌, భువనగరి, సంగారెడ్డి
5 నుంచి 10 శాతం విస్తీర్ణం ఉన్న జిల్లాలు
నల్లగొండ, మేడ్చల్‌, సిద్ధిపేట్‌, వరంగల్‌ రూరల్‌, రంగారెడ్డి, వనపర్తి
10 నుంచి 24 శాతం వరకు అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లాలు
కామారెడ్డి, మెదక్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల్‌, పెద్దపల్లి, ఖమ్మం, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌

అసంపూర్తిగా ఐదో విడత..
లక్ష్యం చేరకుండానే ఐదో విడత హరితహారం అటకెక్కింది. 83 కోట్లు మొక్కలు నాటడం లక్ష్యం కాగా…38.06 కోట్లే నాటారు. కొన్ని జిల్లాలోనైతే 20 శాతం లక్ష్యం కూడా నెరవేరలేదు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 2.86 కోట్ల మొక్కలు నాటాల్సి ఉండగా 37 లక్షలే(13.2 శాతమే) నాటారు. హెచ్‌ఎండీఏ పరిధిలో 5.8 కోట్ల మొక్కల లక్ష్యానికిగానూ 85 లక్షల(14.7%) మొక్కలే పెట్టారు. ఇలా 6 జిల్లాల్లో 30 శాతం లక్ష్యాన్ని కూడా చేరుకోలేదు. 18 జిల్లాల్లో 50 శాతం మొక్కలు కూడా నాటలేదు. భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్‌ జిల్లాల్లో మాత్రమే అనుకున్న లెక్కల ప్రకారం మొక్కలు నాటారు. వర్షాలు లేకపోవడంతో నవంబర్‌ నుంచే దాదాపు అన్ని జిల్లాల్లో మొక్కలు నాటడాన్ని నిలిపివేశారు. దీంతో ఈ ఏడాది పెట్టుకున్న లక్ష్యంలో 50 శాతం కూడా చేరుకునే పరిస్థితి లేదని అధికారులే చెబుతున్నారు.

ఐదు విడతల హరితహారంలో నాటిన మొక్కలు
సంవత్సరం నాటిన మొక్కలు(కోట్లలో)
2015-16 15.86
2016-17 31.67
2017-18 34.07
2018-19 32
2019-20 38.06

(Courtesy Nava Telangana)