చిరుప్రాయంలో లారీ డ్రైవర్లు, క్లీనర్లుగా..
వైద్యురాలి హత్యకేసు నిందితుల తీరు

మహబూబ్‌నగర్‌ – మక్తల్‌, న్యూస్‌టుడే : జేబు నిండా జల్సాలకు కావల్సినన్ని డబ్బులు.. ఆ డబ్బుతో పూటుగా మద్యం తాగడం, విచ్చలవిడిగా తిరగడం.. ఈ జీవనశైలే వారిని నిందితులుగా మార్చింది. పశువైద్యురాలిని (అసిస్టెంట్‌ వెటర్నరీ సర్జన్‌) హత్య చేసిన ప్రధాన నిందితుడు నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం జక్లేరుకు చెందిన మహ్మద్‌ పాషా(26) తల్లిదండ్రులు కూలి చేసుకుంటూ బతుకును వెళ్లదీస్తున్నారు. పదో తరగతి వరకు చదివాక మహ్మద్‌ స్థానికంగా ఉన్న హెచ్‌పీ పెట్రోలు బంకులో చేరాడు. లారీ యజమాని, డ్రైవరు అయిన శ్రీనివాస్‌రెడ్డి తరచూ స్టీల్‌రాడ్ల లోడుతో కర్ణాటకలోని రాయచూరుకు వెళ్లేవారు. మక్తల్‌లో మహ్మద్‌ పనిచేస్తున్న బంకులో తరచూ పెట్రోలు కోసం ఆగేవారు. అలా శ్రీనివాస్‌రెడ్డితో మహ్మద్‌కు పరిచయం ఏర్పడింది. తనతో రమ్మని ఆయన కోరడంతో క్లీనరుగా చేరి, లారీ డ్రైవరయ్యాడు. జీతంతో పాటు వివిధ రూపాల్లో నెలకు రూ.30 వేలకు పైగా వచ్చేది. స్టీల్‌రాడ్లను కిలోల లెక్కన బయట అమ్ముకుంటే అదనంగా డబ్బులు వచ్చేవి. దీంతో మహ్మద్‌కు విచ్చలవిడి జీవితం అలవడింది. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. అడిగేవారు లేకపోవడంతో జల్సాలకు అదుపు లేకుండా పోయింది. ఇతని జల్సా జీవితం చూసి అదే మండలానికి చెందిన పలువురు లారీ డ్రైవర్లు, క్లీనర్లుగా చేరారు. ఈ క్రమంలో మహ్మద్‌ పొరుగునున్న గుడిగండ్ల గ్రామానికి చెందిన శివ (20)ను తన దగ్గర పనికి కుదుర్చుకున్నాడు. శివ తల్లిదండ్రులు, అన్న కూలీ పనులు చేస్తారు. 5వ తరగతితోనే చదువు మానేసిన శివ స్థానికంగా చిన్నచిన్న దొంగతనాలు చేసేవాడు. అలా ఇద్దరూ కలవడంతో మరిన్ని జల్సాలకు మరిగారు. ఒకే లారీలో వెళ్లేవారు. స్టీల్‌రాడ్లను చాటుగా అమ్ముకునేవారు.

మహ్మద్‌ తీసుకువెళ్లాడు
ఈ కేసులో మరో నిందితుడు గుడిగండ్లకు చెందిన చింతకుంట చెన్నకేశవులు (20). తండ్రి, తల్లి, భార్య కూలిపనులు చేస్తుంటారు. 9వ తరగతి వరకు చదివి జులాయిగా తిరుగుతున్న చెన్నకేశవులు సైతం డ్రైవరుగా అవతారం ఎత్తాడు. ఇతను కూడా స్టీల్‌రాడ్ల లారీలను నడిపించేవాడు. తన వద్ద క్లీనరుగా అదే గ్రామానికి చెందిన నవీన్‌ (20)ను పెట్టుకున్నాడు. నవీన్‌ చరిత్ర కూడా ఇలాంటిదే. గ్రామంలో సైలెన్సరు లేని ద్విచక్రవాహనంపై తిరుగుతూ ఆనందించేవాడు. ఈ విషయమై స్థానికులు నవీన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మందలించి వదిలిపెట్టారు. కొన్నిరోజులుగా చెన్నకేశవులు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో శివతోపాటు చెన్నకేశవులు పనికి వెళ్లడం లేదు. మంగళవారం మధ్యాహ్నం మహ్మద్‌ వీరిద్దరినీ పని ఉందని తీసుకెళ్లాడు. తీరా చూస్తే.. గురువారం జరిగిన హత్యకేసులో ఈ నలుగురూ ఉన్నట్లు తేలింది. మూడు నెలల కిందట గుడిగండ్లకు చెందిన ఓ గృహిణిని స్థానికుడొకరు ఊరి నుంచి తీసుకుపోయాడు. ఈ వ్యవహారంలో చెన్నకేశవులు, నవీన్‌ సహకారం అందించారని స్థానికులు పేర్కొంటున్నారు. దీనిపై మక్తల్‌, నర్వ పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేయగా తమ పరిధి కాదంటూ వారిపై కేసులు నమోదు చేయలేదు. హత్యకేసులో పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున నిందితులను అదుపులో తీసుకున్నారు.  ‘తెల్లవారుజామున ఎవరో వచ్చి నా కొడుకును తీసుకువెళ్లారు’ అని మహ్మద్‌ తల్లి మౌలాబీ పేర్కొంది.

Courtesy Eenadu..