• రోడ్ల నిర్మాణాలపై కేంద్రం నిర్ణయం
  • రాష్ట్రాలకు ఎన్‌హెచ్‌ఏఐ సర్క్యులర్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 29 : రోడ్ల నిర్మాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఝలక్‌ ఇచ్చింది. భవిష్యత్తులో చేపట్టబోయే రోడ్ల నిర్మాణాల్లో భూ సేకరణ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని స్పష్టం చేసింది. ఈ నిధులను భరించడానికి రాష్ట్రాలు ముందుకొస్తేనే కొత్తగా రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టులను చేపడతామని ప్రకటించింది. ఈ మేరకు ‘భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)’ ఓ ప్రత్యేక సర్క్యులర్‌ను జారీ చేసింది. చీఫ్‌ జనరల్‌ మేనేజరు వి.కె.శర్మ జారీ చేసిన ఈ సర్క్యులర్‌ను అన్ని రాష్ట్రాలకు పంపించారు. ప్రస్తుతం జాతీయ రహదారుల నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని కేంద్రమే భరిస్తోంది. భూ సేకరణ, సర్వే, రోడ్ల అభివృద్ధి, భవిష్యత్తులో వాటి నిర్వహణను కేంద్రమే చూసుకుంటోంది. ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో కాంట్రాక్టర్లను ఆహ్వానించి, వారితోనే రోడ్లు నిర్మింపజేస్తోంది. నిర్మాణ వ్యయాన్ని కాంట్రాక్టర్‌ తిరిగి పొందడానికి వీలుగా కొన్నేళ్ల పాటు టోల్‌ వసూలు చేసుకునే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇలాంటి ప్రాజెక్టులకు ప్రభుత్వమే భూమిని సేకరించాల్సి ఉంది. ఈ క్రమంలో భూ సేకరణ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తోంది. కానీ, ఎన్‌హెచ్‌ఏఐ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం భూ సేకరణక వ్యయంలో 50శాతం రాష్ట్రాలు భరించాలి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో చేపట్టే రోడ్ల నిర్మాణాలతో పాటు నాన్‌ వయబుల్‌ ప్రాజెక్టుల విషయంలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. 50 శాతం నిధులివ్వడానికి ముందుకొచ్చే రాష్ట్రాలు ఎన్‌హెచ్‌ఏఐతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ నిధులను ముందుగానే ఎస్ర్కో ఖాతాలో జమ చేయాలి. ఎన్‌హెచ్‌ఏఐ తాజా నిర్ణయం రాష్ట్రాలపై తీవ్రంగా పడనుందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టాలంటే భూసేకరణకు అధికంగా నిధులు సమకూర్చాల్సి ఉంటుందంటున్నారు.

రీజినల్‌ రింగ్‌ రోడ్డు పరిస్థితి ఏంటో? : రాష్ట్రంలో కొత్తగా 330 కిలోమీటర్ల పొడవైన రీజినల్‌ రింగ్‌ రోడ్డును నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం రూ.5,500 కోట్ల వ్యయమవుతుందన్న అంచనాలున్నాయి. ఈ రోడ్డు నిర్మాణానికి మద్దతివ్వాలని కొన్నేళ్లుగా కేంద్రాన్ని రాష్ట్రం కోరుతోంది. కానీ, ఇప్పటికీ స్పందించలేదు. ఎన్‌హెచ్‌ఏఐ తాజా నిర్ణయం వల్ల ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి రోడ్ల నిర్మాణాలకు ఇబ్బందులు తప్పవని ఇంజనీర్లు అంటున్నారు. కాగా, ప్రస్తుతం తెలంగాణలో సుమారు 866 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వీటి కోసం కేంద్రం రూ.5,972 కోట్లు మంజూరు చేసింది. రూ.1350 కోట్లు ఖర్చు చేశారు. మరికొన్ని ప్రాజెక్టులు ప్రతిపాదన దశలో ఉన్నాయి.

Courtesy Andhrajyothi…