– జీవితాంతం ప్రజాస్వామ్య, లౌకికవాద రక్షణకే ఉద్యమం : స్మారకోపన్యాసంలో సీతారాం ఏచూరి, మన్మోహన్‌ సింగ్‌

దేశ వామపక్ష ఉద్యమ చరిత్రలో ఆదర్శ కమ్యూనిస్టుగా గురుదాస్‌ గుప్తా ప్రసిద్ధిగాంచారని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. తన జీవిత చరమాంకం వరకూ ఆయన ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణ, లౌకికవాద రక్షణకు పోరాడారని స్పష్టం చేశారు. సోమవారం ఢిల్లీలోని సీపీఐ కేంద్ర కార్యాలయం (అజరు భవన్‌)లో ఆ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి గురుదాస్‌ గుప్తా స్మారకోపన్యాసం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏచూరి.. గుప్తాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కార్మికవర్గ శ్రేయస్సు కోరకే నిత్యం పరితపించేవారని అన్నారు. ప్రస్తుతం దేశంలో జమ్మూ కాశ్మీర్‌ అంశం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని అన్నారు. మోడీ సర్కారు అనాలోచిత నిర్ణయాల కారణంగా దారుణమైన స్థితిలో అక్కడి ప్రజానీకం ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.

అయితే, గతంలో తాను ఆయనతో కాశ్మీర్‌లో పర్యటించినట్టు గుర్తుచేశారు. ఆ సమయంలో కాశ్మీర్‌ సమస్యపై ఆయన ఎంతగానో అధ్యయనం చేసేవారని అన్నారు. తనకి కొన్ని అంశాల్లో స్పష్టత రావడంలో ఆయన సహకరించినట్టు చెప్పారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ…

గురుదాస్‌ గుప్తాతో తనకి ఎన్నో అంశాల్లో అభిప్రాయ బేధాలు ఉన్నప్పటికీ… చాలా విషయాల్లో తాము కలసి పనిచేసినట్టు చెప్పారు. అటువంటి ప్రజాస్వామికవాదిని పార్లమెంట్‌లో చూసి… ఆయనతో పని చేయడం ఒక గొప్ప అనుభవంగా భావిస్తున్నట్టు చెప్పారు. తాను ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్నో కార్మిక వర్గ సమస్యలతో పీఎంఓకి వచ్చేవారని గుర్తు చేశారు. కానీ, ఏ రోజు కూడా ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తం రాలేదని… అంతటి గొప్ప నిబద్ధత కల్గిన వ్యక్తి గుప్తా అంటూ ఆయన సేవలను కొనియాడారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా మాట్లాడుతూ… గుప్తా, దేశం గర్వించదగ్గ ట్రేడ్‌ యూనియనిస్టు అని చెప్పారు. అటువంటి నేత జీవితం నేటితరం కమ్యూనిస్టులకి ఎంతో ఆదర్శప్రాయం అన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో ఎన్సీపీ నేత శరద్‌ యాదవ్‌, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు నిలోత్పల్‌ బసు, సీపీఐ కార్యదర్శి అమర్‌జీత్‌ కౌర్‌ తదితరులు పాల్గొన్నారు.

Courtesy NavaTelangana..