కమ్యూనిస్టు ఉద్యమాలకు కుల స్పృహ లేని రోజుల్లోనే ‘ఉందర్రా మాల పేటా ఊరి చివరా/కష్టాలున్నచోటా ఊరి చివర కాష్టాలున్న చోటా’ అని ఈ దేశ కులవాస్తవికతను ప్రకటించాడు వంగపండు ప్రసాదు.అయితే ఆ పాటను మాల పేట బదులు కూలిపేట అని పాడించారు కమ్యూనిస్టులు.దళిత ఉద్యమాలు ఆ తప్పును సరిదిద్ది మాలపేటను మాలపేటగానే పాడించాయి.ఎందుకు చెబుతున్నానంటే , కమ్యూనిస్టు ఉద్యమం కంటే వంగపండు లాంటి కవులే మెరుగ్గా వాస్తవాన్ని పసిగట్టి గొప్పగా రికార్డు చేశారని చెప్పటానికి.

ఈపాటంటే నాకెంత ఇష్టమంటే అది నన్ను తాకగానే నేను నావశం తప్పిపోయేంత.కాలేజీ రోజుల నుంచీ ఇప్పటి వరకూ ఎన్నో వేదికల మీద పాడాను.ఈపాట నాకంటే నువ్వే బాగ పాడతావని వంగపండు మెచ్చుకోవటం నేను ఎన్నటికీ మరిచిపోలేను. ఏ పాట రాసినా మనోహరమైన ఉత్తరాంధ్ర నుడికారం, యాసా, తూగూ మిళితం చేసి రాయటం వంగపండు ప్రత్యేకత. పాడటంలోనూ, చిందు వేయడంలోనూ, చేతుల మధ్య గజ్జల్ని మోగించడంలోనూ ముఖభంగిమల్ని పలికించడంలోనూ ఆయనకాయనే సాటి.

పెట్టుబడిదారీ విధానంలో శ్రమ పాత్రను విపులీకరిస్తూ ఆయన రాసిన ‘యంత్రమెట్టా నడుస్తు ఉందంటే’ పాట జలపాత హోరులో కొట్టుకుపోయిన వాళ్లలో మీరూ ఉండి వుంటారు.ఇక శ్రీకాకుళ విప్లవోద్యమాన్ని ఇమ్మోర్టలైజ్ చేసిన ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా’ అనే పాట ఉత్తరాంధ్ర జానపద వైభవం. పాట కవిత్వంతో పరవళ్లు తొక్కేట్టు రాయడంలో వంగపండు చేయితిరిగినవాడు. సుబ్బారావు పాణిగ్రాహి లోనూ ఇది చూస్తాం.ఆయన తరవాత ఈ లక్షణం గోరటి వెంకన్నలో కనిపిస్తుంది.

లెజెండ్స్ అందరూ కూడబలుక్కున్నట్లు ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు.ఇది వీడ్కోలు కాలంలా ఉంది.విలాప సన్నివేశంలా ఉంది. ఇష్టమున్నా లేకపోయినా ఇందులో భాగం కావాల్సిందే.రాలుతున్న ఆకులకు మొకరిల్లి నమస్కరించాల్సిందే.

గుంటూరు లక్ష్మీ నర్సయ్య