-విరిగిన లాఠీ..
-బాష్ప వాయుగోళాల ప్రయోగం
– గుజరాత్‌లో లాక్‌డౌన్‌ ప్రకటనతో ఉపాధిలేక పస్తులు

మొన్న ఢిల్లీ.. ఇపుడు గుజరాత్‌లో వలసకార్మికులు రోడ్డెక్కారు. ‘ఆకలవుతుందని అన్నమడిగితే ఎవరూ పట్టించుకోవటంలేదు. ఇక్కడ ఉండం.. మా ఊళ్లకు వెళ్తాం’ అంటూ సూరత్‌లో గళమెత్తిన కార్మికులపై గుజరాత్‌ పోలీసులు విరుచుకుపడ్డారు. భారీసంఖ్యలో వచ్చిన వలసకార్మికులపై లాఠీలు విరిగాయి. బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. పలువురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. అయితే అక్కడి యాజమాన్యాల వత్తిడితో ఖాకీలు మరింతగా రెచ్చిపోయారు. ఎందుకంటే ఆ కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్తే… లాక్‌డౌన్‌ తర్వాత పరిశ్రమలు గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సివస్తుందని చెప్పిన యాజమాన్యాల వైపే అక్కడి బీజేపీ సర్కార్‌ మొగ్గుచూపింది.

సూరత్‌ : కరోనా వైరస్‌ విజృంభించాక.. దాన్ని నియంత్రించటానికి మోడీ సర్కార్‌ దేశమంతా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రక టించింది. ఎక్కడికక్కడే జనజీవనం స్థంభించి పోయింది. రాష్ట్రం కాని రాష్ట్రం నుంచి పొట్ట చేతపట్టుకుని వచ్చిన వలస కార్మికుల పరిస్థితి కడు దయనీయంగా మారింది. కొద్దిరోజుల పాటు ఎలాగోలా నెట్టుకొచ్చిన వలసకూలీలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్వంతప్రాంతా లకు వెళ్లటానికి సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర సరిహద్దులన్నీ మూసేశారు. తినడానికి తిండిలేదు. చేతిలో చిల్లిగవ్వకూడా లేక కార్మికులు నానా కష్టాలు పడుతున్నారు. వారిని బలవంతంగా ఆపటానికి కేంద్రం జారీ చేసిన ఆదేశాలు.. యాజమాన్యాలు వలసకార్మికులను బానిసబందీలుగా మార్చటానికి ప్రయత్నిస్తు న్నాయని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఢిల్లీ సీన్లే గుజరాత్‌లోనూ..
ఢిల్లీ నుంచి వలసకార్మికుల ఏవిధంగా ఇబ్బందులు.. కష్టపడుతున్నారో మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. రెండురోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లో వలసకూలీలపై పోలీసు లు రసాయనాల ద్రావణాన్ని వెదజల్లిన విష యం తెలిసిందే. ఇప్పుడు గుజరాత్‌లోనూ అలాంటి సీన్లు రిపీట్‌ అవుతున్నాయి. పోలీసులు బలప్రయోగం చూపి వందలాది మంది కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. వారిని జైళ్లలో నిర్బంధించారు.

అసలేం జరిగింది..?
గుజరాత్‌లోని సూరత్‌ ప్రాంతమంతా ఎటు చూసినా పరిశ్రమలే కనిపిస్తాయి. దుస్తులు మొదలుకుని ముత్యాలు, బంగారు ఆభరణాలు, వజ్రాలు మెరుగులు దిద్దే పరిశ్రమలు భారీగానే ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో బీహార్‌, యూపీ, మధ్యప్రదేశ్‌ ప్రాంతాలకు చెందిన కార్మికులు పనిచేస్తుంటారు. లాక్‌డౌన్‌ ప్రకటించాక వలసకార్మికుల పరిస్థితి దుర్భరంగా మారింది. పనుల్లేవ్‌..చేతుల్లో పైసల్లేవ్‌. పరిశ్రమల యాజమా నులూ వలసకార్మికులను గాలికొదిలేశారు. అక్కడక్కడ కొన్ని స్వచ్ఛందసంస్థలు భోజన ఏర్పాట్లు చేశాయి. ఎక్కడ ఆహారం దొరుకుతుందోనని వెతకాల్సి వస్తుంది. తీరా వారు రోడ్డుపై కనిపించ గానే పోలీసులు లాఠీలతో బాదుతున్నారు. ఇలాంటి కష్టాలు పడుతున్న వలసకార్మికులకు ఏం చేయాలో తోచలేదు. రోజులు గడుస్తున్నా పస్తులుండాల్సిన పరిస్థితి. అక్కడి బీజేపీ సర్కార్‌ కూడా పట్టించు కోవటంలేదని ఆ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సూరత్‌ను విడిచి తమ ఊళ్లకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ విషయం తెలిసిన యాజమాన్యాలు పోలీసులకు సమా చారమిచ్చారు. ‘మీరు ఎక్కడికి కదిలేది లేదు. ఎవరైనా కాలు కదిపితే మీ అంతు చూస్తామంటూ’ పోలీసులు బెదిరించారు. ‘మాకు అన్నం పెట్టండి మమ్మల్ని పట్టించుకునే నాథులే లేరు’ అంటూ ఆ కార్మికులు వాపోయారు.

ఇప్పుడున్న లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో ఉండలేమనీ, తమ స్వస్థలాలకు వెళ్తామని వలసకార్మికులు పోలీసుల దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. భారీ సంఖ్యలో కార్మికులు గుమిగూడటంతో వారిని ఎలాగైనా అడ్డుకోవాలని పోలీసులు బలప్రయోగానికి దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ గోస చెప్పటానికి పోతే ఇదేంటని వలసకార్మికులు ప్రశ్నించేలోపు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. దొరికిన వారిని దొరికినట్టు చితకబాదారు. పోలీసులు కొట్టే దెబ్బల కు తాళలేక వలసకార్మికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. సూరత్‌లోని పాండ ేసరా ప్రాంతంలో గణేశ్‌నగర్‌ సొసైటీ ప్రాంతంలో వలసకార్మికులపై పోలీసులు ఘర్షణ వాతావరణం సృష్టించారు. పరిస్థితి చేయిదాటడంతో బాష్పవాయి గోళాలు ప్రయోగించారు. పలువురిని అరెస్టు చేసి జైళ్లకు తరలించారు. పరిస్థితిని అదుపులోకి తేవటానికి భారీగా పోలీసు బలగాలు మొహరించాయి. ఇప్పటికే ఢిల్లీ, గుజరాత్‌లో మొదలైన వలసకార్మికుల ఆందోళనలు మరిన్ని రాష్ట్రాలకు చేరే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు కేంద్రానికి నివేదించినట్టు సమాచారం.

Courtesy Nava Telangana