– ఎక్స్‌ప్రెస్‌ హైవే భూసేకరణకు వ్యతిరేకంగా గుజరాత్‌లో రైతులు ఆందోళన

అహ్మదాబాద్‌ : మా భూములను లాక్కోవద్దంటూ మోడీ సొంత రాష్ట్రంలో రైతులు ఆందోళనకు దిగారు. వడోదర-ముంబయి ఎక్స్‌ప్రెస్‌ హైవే కోసం భూసేకరణ ప్రక్రియను వారు అడ్డుకున్నారు. అంకలేశ్వర్‌ తాలూకాలోని ఓల్డ్‌ దివా గ్రామంలో రైతులు ఆందోళనకుదిగగా.. దాదాపు 50 మంది రైతులను పోలీసులు అరెస్టుచేశారు. అనంతరం అధికారులు దాదాపు 35 మందికి రైతులకు చెందిన 50 ఎకరాల పంట భూమిని స్వాధీనం చేసుకున్నారు. మరి కొద్ది రోజుల్లో కోతకు రానున్న పంటను అధికారులు నాశనం చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. భూసేకరణకు నిరసిస్తూ రైతులు గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారని పోలీసులు తెలిపారు. అయితే నిబంధనల ప్రకారమే తాము పరిహారం చెల్లిస్తున్నామనీ, ఎక్స్‌ప్రెస్‌ హైవే కోసం 26 గ్రామాల నుంచి భూమిని స్వాధీనం చేసుకున్నామని నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు, భరుచ్‌ భూసేకరణ అధికారులు చెబుతున్నారు. ఓల్డ్‌ దివా గ్రామస్తులు మాత్రం మార్కెట్‌ విలువకంటే… నాలుగురెట్లు పరిహారాన్ని డిమాండ్‌ చేస్తున్నారని తెలిపారు. ‘వడోదర-ముంబయి ఎక్స్‌ప్రెస్‌ హైవే ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయి. ఇందుకు సంబంధించి 27 గ్రామాల్లో 2018 ఏప్రిల్‌లోనే భూ సేకరణ జరిగింది. ఓల్డ్‌ దివా గ్రామస్తులు భూసేకరణను అడ్డుకుంటున్నారు. ఈ పని చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నది, అందుకే ఓల్డ్‌ దివా గ్రామంలో 50 ఎకరాల వ్యవసాయ భూమిని గురువారం స్వాధీనం చేసుకునేందుకు వెళ్ళాం. ఇక్కడ ఫెన్సింగ్‌ పనులు జరుగుతున్నాయి’ అని భరుచ్‌ భూసేకరణ అధికారి రమేష్‌ భాగోరా తెలిపారు.

‘ఇచ్చిన పరిహారం సరిపోదు.. పొలంలో పంట కోసుకునేందుకు మాకు కొంత సమయం ఇవ్వాలని కూడా అధికారులను మేం అభ్యర్థించాం. కానీ, మా విజ్ఞాపనను తిరస్కరించారు.. బలవంతంగా భూమిని లాక్కున్నారు.. ఇది అనైతికం. రాబోయే రోజుల్లో మా ఆందోళనను ఉధృతం చేస్తాం. పంట నాశనం చేయటంతో 35 మంది రైతులు కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశారు. ఈ నష్టానికి బాధ్యత ప్రభుత్వానిది కాదా..? మా భూములు ఇచ్చేది లేదు.. నష్టపరిహారం, పంట భూముల కోసం న్యాయపోరాటం చేస్తాం’ అని ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న రైతు నిపుల్‌ పటేల్‌ తెలిపారు.

Courtesy Nava Telangana