•  నెలసరి అనుమానంతో 68 మందికి అగ్ని పరీక్ష
  • గుజరాత్‌లోని స్వామి నారాయణ్‌అనుబంధ కాలేజీలో దారుణం

న్యూఢిల్లీ : నెలసరి సమయంలో హాస్టల్‌ వంటగదిలోకి వచ్చారన్న అనుమానంతో.. 68 మంది విద్యార్థినుల లోదుస్తులు విప్పించి పరిశీలించిందో కాలేజీ యాజమాన్యం! ఈ ఘటన భుజ్‌ గుజరాత్‌లోని భుజ్‌లో ‘సహజానంద్‌ గర్ల్స్‌ ఇన్‌స్టిట్యూట్‌’లో జరిగింది. భుజ్‌లో స్వామినారాయణ్‌ మందిర్‌ సభ్యులు నడిపే ఈ కళాశాలను 2012లో ఏర్పాటు చేశారు. 1 నుంచి 12వ తరగతి దాకా క్లాసులున్నాయి. కాలేజీలో 1500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారిలో 68 మంది దూరప్రదేశాల నుంచి వచ్చినవారు కావడంతో అక్కడే హాస్టల్‌లో ఉంటున్నారు. నెలసరి సమయంలో వారి కదలికలపై కాలేజీ యాజమాన్యం తీవ్ర ఆంక్షలు విధించింది. ఆ సమయంలో విద్యార్థినులు మిగతా విద్యార్థినులను తాకకూడదు, హాస్టల్‌ వంటగదిలోకి వెళ్లకూడదు. ఇతర విద్యార్థులతో కలిసి భోంచేయకూడదు. ప్రాంగణంలో ఉన్న స్వామినారాయణ్‌ మందిర్‌కు వెళ్లకూడదు. అయితే, ఇటీవల కొందరు విద్యార్థినులు హాస్టల్‌ వంటగదిలోకి వచ్చారని.. రెక్టార్‌కు అనుమానం వచ్చింది. వెంటనే ఆమె కాలేజ్‌ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు.

అవమానించారు..
‘‘ఈనెల 12న హాస్టల్‌ యంత్రాంగం మామీద ఈ ఆరోపణలు చేసి మమ్మల్ని అవమానించింది. గురువారం.. రెక్టార్‌ అంజలీబెన్‌ ప్రిన్సిపాల్‌కు మా మీద ఫిర్యాదు చేసింది. దీంతో ప్రిన్సిపాల్‌ మమ్మల్నందరినీ తరగతి గదుల్లోంచి బయటకు పిలిపించి వరుసగా నిలబెట్టారు. ‘మీలో ఎవరికి నెలసరి వచ్చింది?’ అని ప్రశ్నించారు. ఇద్దరు విద్యార్థినులు తమకు రుతుస్రావం అవుతోందని చెప్పి పక్కకు వెళ్లారు. మిగతావారిని నమ్మని ప్రిన్సిపాల్‌.. అందరినీ మరుగుదొడ్ల వద్దకు పంపించారు. అక్కడ మహిళా అధ్యాపకులు మాలో ఒక్కొక్కరినీ పిలిచి లోదుస్తులు విప్పించి పరిశీలించారు’’ అని ఒక విద్యార్థిని వివరించింది. ఈ ఘటనపై విచారణకు కచ్‌ యూనివర్సిటీ ఇన్‌చార్జ్‌ వీసీ దర్శన ఢోలాకియా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇందుకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామని కాలేజీ ట్రస్టీ హిరానీ చెప్పారు. జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) కూడా ఈ ఘటనపై స్పందించి విచారణ కమిటీని నియమించింది.

Courtesy Andhrajyothi