– బీజేపీపాలిత రాష్ట్రాలకు ఐజీఎస్టీ పన్ను బకాయిల్లో అధికవాటా
– కేరళ, తెలంగాణ, ఏపీ, తమిళనాడు, ఢిల్లీ..రాష్ట్రాలకు అన్యాయం
– ఐజీఎస్టీ లెక్కల్లో అవకతవకలు

న్యూఢిల్లీ : ఐజీఎస్టీ(సమీకృత వస్తు సేవల పన్ను) బకాయిల పంపిణీలో కేంద్రం అవకతవకలకు పాల్పడినట్టువార్తలు వెలువడుతున్నాయి. 2017-18 ఏడాదికి సంబంధించి విడుదల చేసిన రూ.1,76,688 కోట్ల నిధుల్లో అత్యధికం బీజేపీ పాలిత రాష్ట్రాలకు వెళ్లాయని జాతీయ వార్తా కథనం ప్రచురించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒకరకంగా, బీజేపీయేతర రాష్ట్రాలకు మరొకలా బకాయిల పంపిణీ చేశారని కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దాంతో ప్రతిపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలకు నిధుల పంపిణలో అన్యాయం జరిగినట్టు తెలుస్తోంది. మోడీ సర్కార్‌ అనుసరించిన విధానం వల్ల కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి.

ఆర్థిక సంవత్సరం 2017-18 ఐజీఎస్టీ పన్ను బకాయిలు రూ.1,76,688 కోట్లను రాష్ట్రాలకు విడుదల చేశామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల చెప్పారు. రావాల్సిన దానికన్నా అదనంగా నిధులు అందుకున్న రాష్ట్రాలు వాటిని తిరిగి కట్టాల్సిన పనిలేదని కూడా చెప్పారు. పన్ను బకాయిల చెల్లింపుల్లో కొన్ని రాష్ట్రాలకు ఎక్కువగా, మరికొన్ని రాష్ట్రాలకు తక్కువగా ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించగా, పంపిణీపై స్పష్టమైన ఒక సూత్రీకరణ లేదని నిర్మలా సీతారామన్‌ చెబుతున్నారు. స్పష్టమైన సూత్రం లేకపోవటం ఒక సాంకేతిక లోపం మాత్రమేనని, మోడీ సర్కార్‌ అనేక విషయాల్ని దాస్తోందని ఆర్థికనిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు…2018లో ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అధికారంలో ఉన్నది కాబట్టి..ఆ రాష్ట్రానికి ఆ ఏడాదికి సంబంధించి ఐజీఎస్టీ పన్ను బకాయి(అదనంగా) రూ.915కోట్లు విడుదల చేశారు. బీహార్‌కు రూ.2900కోట్లు విడుదల చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్‌ సీఎంగా ఉన్న సమయాన మహారాష్ట్రకు రూ.3వేల కోట్లు ఇచ్చారు. శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ కూటమి అధికారంలోకి రాగానే ఐజీఎస్టీ పన్ను బకాయిల కింద ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు.

నష్టపోయిన రాష్ట్రాలు..
కేరళ రూ.900కోట్లు
తెలంగాణ రూ.2,638కోట్లు
ఆంధ్రప్రదేశ్‌ రూ.4,800కోట్లు
తమిళనాడు రూ.4,231కోట్లు
ఢిల్లీ రూ.3000కోట్లు
పశ్చిమ బెంగాల్‌ రూ.560కోట్లు

Courtesy Nava Telangana