కేంద్ర ఖాతా నుంచే పంచాయతీ ఖర్చులు
ఆర్థిక సంఘం నిధుల కేంద్రీకరణ దిశలో కేంద్రం
రాష్ట్ర ఖజానాకు ఇక కాసులు రానట్లే
ఇప్పటికే తెలంగాణ నిధులకు కొర్రీలు
జాతీయ ఆర్థిక సంఘం నిధులు ఇక దిల్లీ గుప్పిట్లోనే ఉండిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటిలా రాష్ట్రాలకు నిధులను పంపటం కాకుండా.. సర్పంచులు చేసే ఖర్చులను తన ఖాతా నుంచి చెల్లించాలని కేంద్రం యోచిస్తోంది. దీంతో నిధులకు కేంద్రీకరణ విధానం అమల్లోకి వచ్చినట్లై.. రాష్ట్ర ఖజానాకు ఇక సొమ్మంటూ అందబోదు. నిధుల వినియోగంలో అవకతవకలను అరికట్టడానికి, పారదర్శకతకు ఈ పద్ధతి దోహదపడుతుందని కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ చెబుతోంది. సంబంధిత ప్రతిపాదనలకు ఆమోద ముద్ర కోసం
రాష్ట్రాలకు, కేంద్ర ఆర్థిక శాఖకు పంపింది. జాతీయ ఆర్థిక సంఘం ఐదేళ్లకోసారి చేసే సిఫార్సులకు అనుగుణంగా కేంద్రం ఏటా రాష్ట్రాల్లోని పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ సంస్థలకు నిధులను అందజేస్తుంది. ప్రస్తుతం 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి దిల్లీ నుంచి రాష్ట్ర ఖజానాకు నిధులు వస్తుండగా.. వాటిని రాష్ట్ర ప్రభుత్వమే విభజించి ఆయా స్థానిక సంస్థల ఖాతాల్లో జమచేస్తోంది. 14వ ఆర్థిక సంఘం నిధులు 2015-16లో మొదలుకాగా.. అప్పటి నుంచి కేంద్రం రాష్ట్రాలకు రకరకాల నిబంధనలను విధిస్తూనే ఉంది.
రాష్ట్ర ఖజానాకు సొమ్ము చేరిన 15 రోజుల్లోగా దానిని పంచాయతీలకు జమచేయాలంటూ తొలుత నిబంధనను విధించిన కేంద్రం.. అలా 15రోజుల్లో ఇచ్చినట్టుగా తనకు ధ్రువీకరణపత్రాలను పంపలేదని 2016-17లో చాలారోజులు తెలంగాణకు రావాల్సిన నిధులను నిలిపివేసింది. ఇటువంటి నిబంధనను తెచ్చినప్పటికీ.. రాష్ట్రాలు తమ అవసరాలకు ఆర్థిక సంఘం సొమ్మును ఉపయోగించుకొంటున్నాయని కేంద్రం భావిస్తోంది. ఈనేపథ్యంలో రాష్ట్రాలకు పంపే బదులు నేరుగా తన ఖాతాలోనే ఆ సొమ్మునంతా ఉంచాలని యోచిస్తోంది.
అమలయ్యేది ఇలా.. 
జనాభా, మరికొన్ని అంశాల ఆధారంగా ఏ పంచాయతీకి ఎంతమేర నిధులివ్వాలనేది ఇప్పటి మాదిరిగానే రాష్ట్ర అధికారులు లెక్కగట్టనున్నప్పటికీ.. సొమ్ము మాత్రం ఆయా పంచాయతీల ఖాతాలకు వారు జమచేయలేరు. సొమ్ము కేంద్ర పంచాయతీరాజ్‌శాఖకు చెందిన నోడల్‌ ఖాతాలో ఉంటుంది. ఏ పంచాయతీకి ఎంత మొత్తమనేది ముందుగానే తెలుస్తుంది కనుక అక్కడి పాలకవర్గాలు తమకు నిర్దేశించిన పైకాన్ని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చు. ఇలా వినియోగించేటప్పుడు కేంద్ర నోడల్‌ ఖాతాకు.. పంచాయతీల నుంచి ‘ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌’ అవసరమవుతుంది. కేంద్రం తన నోడల్‌ ఖాతా నుంచి నిధులను అందజేసే విధానాన్ని ఇప్పటికే ఉపాధి హామీ సహా కొన్ని పథకాలకు అమలు చేస్తోంది. వీటిలో మంచి ఫలితాలు వచ్చినందునే ఆర్థిక సంఘం నిధులకూ ఇదే పద్ధతి చేపట్టాలని భావిస్తున్నట్టు ఇటీవల రాష్ట్రాలతో నిర్వహించిన సమావేశంలో కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ వెల్లడించింది. తద్వారా పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని, పంచాయతీలు డిజిటల్‌ ప్రక్రియలోకి ప్రవేశించటం వల్ల అభివృద్ధి పనులు సత్వరం చేపట్టేందుకు వీలవుతుందని పేర్కొంది. నోడల్‌ఖాతాలోని సొమ్ముపై వచ్చే వడ్డీని పంచాయతీలకు సమానంగా పంచుతామనీ తెలిపింది. ఇటువంటి కొత్త పద్ధతికి అంగీకారాన్ని తెలపాలని.. అభిప్రాయాలనూ చెప్పాలని రాష్ట్రాలకు సూచించింది. దీనికి ఆమోదముద్ర వేయాల్సిందిగా కేంద్ర ఆర్థిక శాఖనూ కోరింది.
ఆర్థికసంఘం నిధులను వివిధ కారణాలతో ఇప్పటికే కేంద్రం తొక్కిపెడుతూనే ఉంది. తెలంగాణలోని పంచాయతీలకు 2015-20 మధ్య ఐదేళ్లలో స్థూల, పనితీరు ఆధారగ్రాంట్ల రూపంలో రూ.5,374కోట్లను ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయగా ఇంతవరకు రూ.3,481 కోట్లు అందాయి.

                                                                                                       (Courtacy Eenadu)