• ఏపీ బాటలో తెలంగాణ
  • 2000 కోట్లు వస్తాయని అంచనా
  • అధ్యయనానికి ఆదేశించిన ప్రభుత్వం
  • మంత్రి, కమిషనర్లకు ప్రతిపాదన ఓకే
  • కింది స్థాయి అధికారుల అభ్యంతరం
  • లాబీయింగ్‌ చేస్తున్న ఏపీ ‘లిక్కర్‌ కింగ్‌’
  • సహకరిస్తున్న తెలంగాణ ప్రాంత ఎంపీ

ఆంధ్రప్రదేశ్‌ తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా మద్యం దుకాణాలను తానే స్వయంగా నిర్వహించాలని యోచిస్తోంది. దీనిపై అధ్యయనం చేయాలని ఇప్పటికే ఎక్సైజ్‌ శాఖను ఆదేశించింది. ప్రభుత్వ అధీనంలో షాపులను నడిపితే లాభాలు ఏ మేరకు ఉంటాయి? ఇబ్బందులేమిటి? ఎంతమంది సిబ్బంది అవసరం? కొత్తగా నియామకాలు ఏమైనా చేపట్టాలా? వంటి అంశాలను అధ్యయనం చేయాలని సూచించింది. పూర్తి వివరాలతో ఒక నివేదిక ఇవ్వాలని కోరింది. ఈ మేరకు దీనిపై ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ కూడా సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వమే నడిపితే వచ్చే లాభనష్టాలపై అధ్యయనం మొదలైంది. ప్రజాభిప్రాయం కూడా సేకరిస్తున్నారు.

ఈఅంశంపై నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న జాప్యం కారణంగానే ఎక్సైజ్‌ పాలసీ ప్రకటనను మరో నెల రోజుల పాటు పొడిగించారని తెలిసింది. ఈ అంశం ఇటీవల తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలోనూ చర్చకు వచ్చిందని సమాచారం. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వమే మద్యం షాపులను నడుపుతున్న నేపథ్యంలో అధ్యయనం చేయాలని ఎక్సైజ్‌ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 2216 మద్యం షాపులను ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్నారు. రెండేళ్ల పాలసీ కింద ప్రభుత్వం వీరికి షాపులను అప్పగించి, ఎక్సైజ్‌ ట్యాక్స్‌ను వసూలు చేస్తోంది.

మద్యం అమ్మకాలు, దరఖాస్తు ఫీజులు, లైసెన్సు ఫీజులు, ఎక్సైజ్‌ డ్యూటీ, ఎక్సైజ్‌ టర్నోవర్‌ ట్యాక్స్‌…. ఇలా అన్ని రకాలుగా ఏడాదికి రూ.30 వేల కోట్ల లావాదేవీలను తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ సాగిస్తోంది. కేవలం మద్యం అమ్మకాల ద్వారానే రూ.10 వేల కోట్ల వరకు ఉంటోంది. ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తే మరో రూ.2000 కోట్ల ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ విధానానికి ఎక్సైజ్‌ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. అలా చేస్తే దరఖాస్తు ఫీజుల రూపంలో వస్తున్న రూ.400 కోట్ల రాబడి పోతుందని ఎక్సైజ్‌ శాఖ కింది స్థాయి అధికారులు వివరిస్తున్నారు.

బడా కాంట్రాక్టర్‌కు ఏం లాభం?

మద్యం వ్యాపారంలో ఎప్పుడూ కొన్ని బ్రాండ్లదే గుత్తాధిపత్యం కొనసాగుతుంటుంది. ఇతర బ్రాండ్ల మద్యాన్ని పక్కన పెట్టి బడా కాంట్రాక్టర్లకు సంబంధించిన బ్రాండ్ల మద్యాన్నే విక్రయిస్తారు. అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణలోనూ ఇదే తంతు సాగుతోంది. వైన్‌ షాపునకు వెళ్లి ఫలానా బ్రాండ్‌ కావాలంటే దొరకదు. ఇదే బ్రాండు మద్యం ఉందంటూ అంటగడతారు. ఇందుకు కంపెనీల నుంచి గుడ్‌విల్‌ లభిస్తుంటుంది. ప్రముఖ కంపెనీకి ప్రకాశం జిల్లా కాంట్రాక్టర్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్‌. ప్రభుత్వ ఆధీనంలో మద్యం షాపులను నడిపితే తన బ్రాండ్‌ మద్యాన్నే ఎక్కువగా విక్రయించేలా లాబీయింగ్‌ చేస్తాడనే అంచనాలు ఉన్నాయు.

ప్రకాశం జిల్లా లిక్కర్‌ కింగ్‌ లాబీయింగ్‌?

ప్రభుత్వ ఆధీనంలోనే మద్యం షాపులను నడపాలని ప్రకాశం జిల్లాకు చెందిన ‘లిక్కర్‌ కింగ్‌’ లాబీయింగ్‌ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణ ఎంపీతో కలిసి లాబీయింగ్‌ చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ప్రభుత్వ అధీనంలో షాపులను నడిపితే ఖజానాకు లాభాలు ఎక్కువగా ఉంటాయంటూ సీఎం కేసీఆర్‌ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.

ఇటీవల అక్కడ మద్యం షాపులను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అక్కడ మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేయాలన్న ఆలోచనలో అక్కడి ప్రభుత్వం ఉంది. అంటే… అక్కడ భవిష్యత్తులో మద్యం వ్యాపారం తగ్గుముఖం పట్టనుంది. అందుకే లిక్కర్‌ కింగ్‌ తెలంగాణపై కన్నేసినట్లు చర్చ జరుగుతోంది.

Courtesy AndhraJyothy..