– 50 ఏండ్లకు పైబడిన వారిని ఇంటికి పంపించే ప్రయత్నం
– బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫార్ములా అమలుకు సర్కారు కసరత్తు
– ప్రయివేటుకు అప్పగించేందుకే 20 వేలమందికి ఉద్వాసన?
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆర్టీసీ రూట్లను దశల వారిగా ప్రయివేటు పరం చేసేందుకు వ్యూహాత్మకంగా సమ్మెకు పురిగొల్పిన ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా పావులు కదుపుతున్నది. సమ్మెను అనివార్యం చేసి సెల్ఫ్‌ డిస్మిస్‌ పేరిట కార్మికుల ఉద్యోగ భద్రతపై భయాందోళనలకు తెరతీసింది. ఇదే అదనుగా మరో అడుగు ముందుకేసి కార్మికులను తొలగించేందుకు వీలుగా వీఆర్‌ఎస్‌ పథకానికి శ్రీకారం చుట్టేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నదని తెలుస్తున్నది. బిఎస్‌ఎన్‌ఎల్‌ ను ప్రయివేటు కార్పోరేట్లకు అప్పగించేందుకు తెరమీదకు తెచ్చిన వీఆర్‌ఎస్‌ స్కీంను ఆర్టీసీలో అమలు చేసేందుకు దాదాపు నిర్ణయం తీసుకున్నదని విశ్వసనీయ సమాచారం. తాజాగా ఆర్టీసీ ఇన్‌చార్జీ ఎండీ సునిల్‌శర్మ హైకోర్టుకు సమర్పించిన తాజా అఫిడవిటే ఇందుకు నిదర్శనమని భావిస్తున్నారు. ఆర్టీసీకి 10,460 సొంత బస్సులు, 2,856 అద్దె బస్సులున్నాయి. వీటి నిర్వహణకు 18,564 మంది డ్రైవర్లు, 20,313 మంది కండక్టర్లు పని చేస్తున్నారు. వీరితో పాటు మెకానిక్‌, కంట్రోలర్‌, సూపర్‌వైజర్‌ తదితర విభాగాల్లో కొనసాగుతున్న వారిని కలుపుకంటే దాదాపు 48 వేలమంది వరకు ఉద్యోగులు ఆర్టీసీపై ఆధారపడి బతుకుతున్నారు. అయితే రాబోయే ఐదేండ్లలో మూడు దశల్లో ఆర్టీసీని పూర్తిగా ప్రయివేటు పరం చేసేందుకు ప్రభుత్వం వీఆర్‌ఎస్‌ మంత్రాన్ని ఎత్తుకోనున్నట్టు తెలుస్తున్నది.
మొదటి దశలో ప్రభుత్వ వాటా 50శాతం, 18శాతం ఉన్న అద్దెబస్సులను 12 శాతం పెంచి 30శాతంగా ఉంచడం, మిగిలిన మరో 20శాతాన్ని ప్రయివేటుకు అప్పగించడం జరుగుతుందని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించారు. 12శాతం అద్దె బస్సులు, 20శాతం ప్రయివేటు బస్సులు వస్తే అనివార్యంగా దాదాపు 15వేల మంది కార్మికులు పని కోల్పోనున్నారు. సమ్మెను సాకుగా చూపి కార్మికులను తొలగించేందుకు వీఆర్‌ఎస్‌ విధానానికి పావులు కదుపుతున్నది. బీఎస్‌ఎన్‌ఎల్‌లో అనుసరించిన ఇలాంటి విధానాన్ని ఆర్టీసీలో అమలు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం తెరవెనుక ప్రయత్నాలు మొదలు పెట్టింది. సంస్థలో 50 ఏండ్లు నిండిన వారందరిని వీఆర్‌ఎస్‌ పేరుతో ఏక కాలంలో దాదాపు 20 వేలమందిని బయటికి పంపేందుకు ప్రయత్నం చేస్తున్నదని భావిస్తు న్నారు. సంస్థను రక్షించుకునేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి, మొక్కవోని దీక్షతో సమ్మె చేస్తున్న కార్మికులను అడుగడుగునా భయాందోళనలను గురిచేస్తున్నారు. సెల్ఫ్‌ డిస్మిస్‌ అని ఒక సారి, స్వచ్ఛందంగా విధుల్లో చేరినా తాము తీసుకోలేమని మరోసారీ ప్రకటించడం ద్వారా ఉద్యోగ భద్రతపై అనుమానాలను రేకెత్తించడం ద్వారా వారిని వీఆర్‌ఎస్‌కు వైపు నడిచేలా సర్కార్‌ పావులు కదుపుతున్నదని తెలుస్తున్నది.
కేంద్ర విధానాలకు అనుగుణంగానే..
కేంద్రం అనుసరిస్తున్న ప్రయివేటు అనుకూల ఆర్థిక విధానాలకు అనుగుణంగానే పలు ప్రభుత్వరంగ సంస్థలను బడా కార్పోరేట్లకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. అందులో భాగంగానే తెలంగాణలో ఆర్టీసీని ఎంచుకున్న సర్కార్‌ గత ఏడాది కాలంగా సంస్థను ముప్పుతిప్పలు పెడుతున్నది. ఆ సంస్థకు రావాల్సిన రాయితీ బకాయిలు ఇవ్వకపోవడం, పీఎఫ్‌, సహకారసొసైటీ నిధులను వాడకోవడం లాంటి చర్యల ద్వారా సంస్థను నిర్వీర్యం చేసి యూనియన్‌ డిమాండ్ల మీద చర్చలు జరప నిరాకరించడం లాంటి చర్యలతో సమ్మెను అనివార్యం చేసింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మెకు వెళ్లిన కార్మికులను చర్చలకు పిలవకుండా వివిధ రకాలుగా వేధిస్తున్నది. కోర్టులో సర్కార్‌ అనుసరిస్తున్న తీరు ఇందుకు అద్దం పడుతున్నది. ఎయిరిండియా, రైల్వేలను దశలవారిగా ప్రయివేటకు అప్పగించేందుకు మోడీ సర్కార్‌ అనుసరిస్తున్న పద్ధతులనే కేసీఆర్‌ సర్కార్‌ ఇక్కడ అనుసరిస్తున్నదని పలువురు మేధావులు విష్లేషిస్తున్నారు.

Courtesy Navatelangana..