కాలేజీల్లో పీజీ కోర్సుల ఎట్టివేత అంటే ఉన్నత విద్యకు దళిత, బహుజనులను దూరం చేయటమే. ఇదే సమయంలో ప్రయివేటు యూనివర్సిటీలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని నిర్ణయించటం గమనార్హం. అంటే ఇకనుంచి తెలంగాణలోని దళిత, బహుజన యువత ఉన్నత విద్యను కొనుక్కోవాలన్నమాట కొనుక్కోలేనివాళ్ళు చదువు మానేయాలన్నమాట.కళాశాల విద్యా శాఖ కసరత్తు..

తక్కువ అడ్మిషన్లు ఉన్నచోట స్వస్తి

డిమాండ్‌ ఉన్నచోట కొనసాగింపు

కాలేజీల వారీగా వివరాల సేకరణ

ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కొనసాగుతున్న పీజీ కోర్సుల ఎత్తివేత తప్పదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కళాశాల విద్యా శాఖ రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇందులో భాగంగా కాలేజీల వారీగా వివరాల సేకరణ కూడా పూర్తయిది. ఏ కాలేజీలో పీజీ కోర్సులు కొనసాగుతున్నాయి? గత రెండు మూడేళ్లుగా ఏ కోర్సుల్లో ఎన్ని అడ్మిషన్లు అయ్యాయి? అక్కడ డిగ్రీ విద్యార్థుల పరిస్థితి ఏమిటి? మౌలిక సౌకర్యాలు, అధ్యాపకుల సంఖ్య ఏ విధంగా ఉంది? అనే అంశాలపై వివరాలు సేకరించారు. దీని ఆధారంగా తక్కువ అడ్మిషన్లు (డిమాండ్‌ లేని) గల కోర్సులను ఎత్తివేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

అదే సమయంలో డిమాండ్‌ ఉన్న కోర్సులను కొనసాగించాలని నిర్ణయించారు. ఇప్పటికే పీజీ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్షలు పూర్తయ్యాయి. వారం పది రోజుల్లో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఆగస్టు మొదటి వారంలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్‌కు ముందే చాలా కోర్సులను ఎత్తివేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

37 కోర్సుల్లోనే 50శాతం సీట్ల భర్తీ

రాష్ట్రవ్యాప్తంగా 131 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి.40 కాలేజీల్లో 159 పీజీ కోర్సులు కొనసాగుతున్నాయి. కాలేజీల వారీగా ఆర్ట్స్‌, సైన్స్‌, లాంగ్వేజ్‌ పీజీ కోర్సులు నిర్వహిస్తున్నారు. మెజారిటీ కోర్సుల్లో తక్కువ అడ్మిషన్లు జరుగుతున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. గత ఏడాది 37 కోర్సుల్లో మాత్రమే 50 శాతం సీట్లు భర్తీ అయినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 122 కోర్సుల్లో అడ్మిషన్ల సంఖ్య అంతంతమాత్రమే. ఐదు కోర్సుల్లో ఒక్కరూ చేరలేదు. 18 కోర్సుల్లో ప్రవేశాలు 20 శాతంలోపే నమోదయినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో డిమాండ్‌ లేని కోర్సులను ఎత్తివేయాలని కళాశాల విద్యా శాఖ భావిస్తోంది.

ప్రభుత్వం నుంచి పైసా రాదు!

ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పీజీ కోర్సులకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేకపోవడం గమనార్హం. ప్రభుత్వం నుంచి ఆ కోర్సులకు ఒక్క పైసా నిధులు కూడా మంజూరు కావు. డిగ్రీ కాలేజీల్లోని కొన్ని తరగతి గదులను పీజీ కోర్సులకు కేటాయిస్తారు. డిగ్రీ లెక్చరర్లే వారి ఖాళీ సమయంలో పీజీ కోర్సులను బోధిస్తారు. ఇందుకు వారికి కొంత మొత్తం ఇస్తారు. అది కూడా విద్యార్థుల నుంచి వసూలు చేస్తారు. ఫీజులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులతో ఈ కోర్సులను కొనసాగిస్తున్నారు. విద్యార్థులు తక్కువగా ఉన్నచోట వారి నుంచి వచ్చే ఫీజులు ఖర్చులకు సరిపోవడం లేదు. లెక్చరర్లకు వేతనం ఇవ్వలేని పరిస్థితి ఉంది. దీంతో ఆ కోర్సులను ఎత్తివేయాలని పలువురు ప్రిన్సిపాళ్లే కళాశాల విద్యా శాఖకు లేఖలు రాయడం గమనార్హం. మరికొన్ని చోట్ల డిగ్రీ కోర్సులకు అధిక డిమాండ్‌ ఉంది. దీంతో అక్కడ పీజీ కోర్సులు కొనసాగిస్తుండడంతో డిగ్రీ విద్యార్థులకు తరగతి గదులు సరిపోవడం లేదని ఒక అధ్యాపకుడు తెలిపారు. ఇలాంటి కాలేజీల్లోనూ పీజీ కోర్సులు ఎత్తివేయాలని యోచిస్తున్నారు. కాగా, కళాశాల విద్యా శాఖ నిర్ణయంపై పలు విద్యార్థి సంఘాలు, రాజకీయ నాయకుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పేద విద్యార్థులు పీజీ విద్యకు దూరమవుతారని నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డిమాండ్‌ ఉన్న చోట మూసివేయొద్దు

గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాత జిల్లాల కేంద్రాల్లోని కాలేజీల్లో పీజీ కోర్సులను కొనసాగించాలి. దీంతో పాటు అన్ని కాలేజీల్లో డిమాండ్‌ ఉన్న కోర్సులను కొనసాగించాలి. అసలు డిమాండ్‌ లేని కోర్సులను మాత్రమే మూసివేసి, డిమాండ్‌ ఉన్న వాటిని కొనసాగించాలని కోరగా కళాశాల విద్యా శాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ను సానుకూలంగా స్పందించారు.

– సురేందర్‌ రెడ్డి, గెజిటెడ్‌ అధ్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి

(ఆంధ్రజ్యోతి సౌజన్యంతో)