కేంద్ర క్యాబినేట్‌ గత వారం రోజులుగా వ్యవసాయరంగంలో మార్పులు చేస్తూ రైతులకు లబ్దికలిగే విధంగా చర్యలు చేపడుతున్నామని చెప్తున్నది. ఈ మధ్య జూన్‌ 1న మద్దతు ధరలు నిర్ణయించింది. జూన్‌ 3న ఒకే దేశం – ఒకే మార్కెట్‌ విధానాన్ని ఆమోదించింది. నిత్యావసర సరుకుల చట్టాన్ని సవరించింది. ఈ మూడు సమస్యలను కేంద్ర క్యాబినెట్‌ రైతులకు కానుకగా ఇస్తున్నట్లు 6 దశాబ్దాల బంధనాల నుంచి విముక్తి చేస్తున్నట్టు, ఈ మూడు సమస్యలపై త్వరలో ఆర్డినేన్స్‌ తేబోతున్నట్టు స్వయంగా ప్రధాని మోడీ ప్రకటించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ విధానాలతో ఏటా 12,600 మంది 13 రాష్ట్రాలలో ఆత్మహత్య లకు పాల్పడుతూనే ఉన్నారు. లక్షల కోట్ల ప్యాకేజీలు ప్రకటించినా, కిసాన్‌ సమ్మాన్‌, వడ్డీమాఫీ, ఫసల్‌ యోజన, క్రిషి సించాయి యోజన, లాంటి పథకాలు ఎన్ని తెచ్చినా ఇవన్ని బడా కార్పొరేట్‌ సంస్థలకే వేల కోట్ల లాభాలను కట్టబెడుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌ సంస్కరణలను కూడా గుత్తా పెట్టుబడి దారుల లాభాల కోసం మార్చడం జరిగింది. తెనేపూసిన కత్తిలా సంస్కరణలు రైతు గొంతుపై వేలాడుతున్నాయి.

భారత దేశంలో 32కోట్ల ఎకరాలు సాగుచేస్తూ 28కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేస్తున్నాం. అలాగే 6.5కోట్ల ఎకరాలలో హర్టికల్చర్‌ ద్వారా 32కోట్ల టన్నుల పండ్లు, కూరగాయలు తదితర ఉత్పత్తులు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం యాసంగి కలిపి 162లక్షల ఎకరాలు సాగు చేస్తూ 180లక్షల టన్నులు ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేయగా 12లక్షల ఎకరాలలో 72లక్షల టన్నుల హర్టికల్చర్‌ ఉత్పత్తులు చేస్తున్నాం. ఇందులో 26 లక్షల టన్నులు పండ్లు కాగా 30లక్షల టన్నులు కూరగాయలు పండిస్తున్నాం. వీటికి మద్దతు ధరలు లేవు.

మద్దతు ధరల ప్రకటన :
14 రకాల వ్యవసాయోత్పత్తులకు 2019-21 మద్దతు ధరలపైనా 2.8శాతం నుంచి 4.8శాతం ధరలను పెంచి ప్రకటించారు. ధాన్యం క్వింటాలకు రూ.53, పత్తి క్వింటాలుకు రూ.275 పెంపుదల చూపారు. గత ధరలే శాస్త్రీయంగా నిర్ధారించలేదు. ఈసారీ కూడా అదే విధానాన్ని కొనసాగించారు. వ్యవసాయ ఉత్పత్తి ధరలు నిర్ణయించడంలోనే మోసం చేశారు. ఉపకరణాల కొనుగోలు (విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, కూళ్ళు) కుటుంబ శ్రమ మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. భూమిపై పెట్టిన పెట్టుబడి (బోర్లు, పంపుసెట్లు, పైపులైన్లు, ఇతర నిర్మాణాలు) దాని వడ్డీ పరిగణలోకి తీసుకోలేదు. చివరికి పంటలబీమా ప్రీమియంను కూడా పెట్టుబడిలోకి తీసుకోలేదు. పారిశ్రామిక వస్తువులకు ధరలు నిర్ణయిస్తున్న విధానానికి భిన్నంగా తగ్గించి వ్యవసాయోత్పత్తుల ధరలు నిర్ణయించారు. దానిపై 50శాతం కలిపి ధరలు నిర్ణయించినట్లు చెప్పడం హస్యాస్పదమే.

ఈ దిగువ గణాంకాలు పరిశీలించండి (క్వింటాలుకు రూపాయలు)
పంట రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం
ప్రకటించిన ప్రకటించిన
ఉత్పత్తి ధర మద్దతు ధర
వరి 2529 1888
జొన్న 3713 2620
సజ్జలు 3477 2150
మొక్కజొన్న 2172 1850
కందులు 8084 6000
వేరుశనగ 5282 5275
సోయా 4694 3880
పత్తి 10043 5825
రాగులు – 3295
పెసర్లు – 7196 మినుములు – 6000
పొద్దు తిరుగుడు – 5885 నువ్వులు – 6855
పై ధరలను పరిశీలిస్తే ఉత్పత్తి చేయడం కూడా సాధ్యంకాదు. పైగా రైతులు 100 రకాల వ్యవసాయోత్పత్తులు పండిస్తుండగా 14రకాలకే 2020-21కి సంబంధించి ధరలు ప్రకటించడం జరిగింది. ఈ ధరల వల్ల పారిశ్రామిక వేత్తలకు రైతులు ఏటా 3లక్షల కోట్లు నష్టపోతున్నట్లు వ్యవసాయ ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. పెట్టిన పెట్టుబడి రాక రైతులు దివాళ తీయడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మధ్య దళారీల దోపిడీకి ప్రోత్సాహం కల్పిస్తున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఈ తక్కువ ధరలను కూడా అమలు జరుపడానికి బాధ్యత తీసుకోవడం లేదు. ఒకవైపున వ్యవసాయోత్పత్తుల పెట్టుబడులు 30శాతం పెరుగ గా, ఉత్పత్తి అయిన సరుకుల ధరలు 2.8శాతం నుంచి 4.5శాతానికి మాత్రమే పెంచడం జరిగింది.

రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు :
మార్కెట్లు రైతులకు రక్షణ కేంద్రాలుగా పని చేస్తున్నాయి. ఈ విధానాన్ని తొలగించి మార్కెట్‌ బయట రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చని కేంద్ర క్యాబినెట్‌ తీర్మాణం చేసింది. రైతులను 6 దశాబ్దాల ఆంక్షల నుంచి తప్పించినట్టు చెప్పింది. వాస్తవానికి 6దశాబ్దాల రక్షణను కేంద్రం తొలగించ పూనుకుంది. ప్రయివేట్‌ వ్యాపారులే కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణం, గోదాముల నిర్మాణం చేసి ఎంత సరుకునైనా నిలువ పెట్టుకోటానికి వీలుగా నిర్ణయించారు. గతంలో అమలు జరిపిన ఈ-నామ్‌ మార్కెట్‌ విధానం విఫలమైందని, మార్కెట్‌లో రైతులు కుమ్ముక్కై ధరలు తగ్గించారని స్వయంగా ప్రధాని మోడీ చెప్పడం విశేషం. రైతులు ఇప్పటికీ తమ ఉత్పత్తులను నేరుగా అమ్ముకుం టున్నారు. ప్రాసెస్‌ చేసి అమ్ముకునే స్థితిలో రైతులకు వ్యవసాయ అధారిత పరిశ్రమలు లేవు. అందువల్ల ముడి సరుకునే అమ్ముకునే స్థితిలో ఉన్నారు. పైగా ఉత్పత్తి ప్రాంతం నుంచి 10కి.మీ మించి తీసుకెళ్లి అమ్ముకోగలిగే స్థితిలో లేరు. మార్కెట్‌ బయట అమ్ముకోవడమంటే నేడు గుత్త వ్యాపారులు మార్కెట్‌ బయట కొనుగోళ్ళు చేస్తు న్నారు. అక్కడ ధర నిర్ణయం, తూకం, చెల్లింపులు గురించి నియంత్రణ ఉండదు. ఈ వ్యాపారంలోకి టాటా, బిర్లా, రిలయన్స్‌, ఆధాని, బేయర్‌, ఐటిసి సంస్థలు నేడు పెద్దఎత్తున్న పెట్టుబడులు పెడుతున్నాయి. ఎగుమతులు, దిగమతులు కూడా వారే చుస్తున్నారు. వారే కోల్డ్‌స్టోరేజీ లు, గోదాము లు నిర్మాణం చేసి అత్యధిక ధరలకు అమ్మిలాభాలు సంపాధించుకోటానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తున్నది. రైతులకు ఉన్న ఆ కొద్ది పాటి మార్కెట్‌ రక్షణ తొలగించడం అత్యంత దుర్మార్గం.

నిత్యావసర సరుకుల చట్టం :
నిత్యావసర సరుకుల చట్టానికి సవరణలు తెచ్చి ధాన్యాలు, నూనెగింజలు, పప్పులు, ఉల్లి, ఆలుగడ్డ పంటలను చట్టం నుంచి తొలగించాలని క్యాబినెట్‌ మరో తీర్మాణం చేసింది. నిత్యావసర సరుకుల చట్టం ఉన్నవాటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు నిర్ణయించడం, నిలువలు క్రమబద్ధీకరించడం, ఎగుమతి, దిగుమతులను క్రమబద్ధీకరించడం వలన బ్లాక్‌మార్కెట్‌ జరుగకుండ అందరు వినియోగదారులకు ఉపయోగపడుతుంది. అలాంటి చట్టం నుంచి నిత్యావసర సరుకులను తొలగించడం అత్యంత ప్రమాదకరం. గతంలో పత్తి విత్తనాల ధరలను మ్యాన్‌శాంటో కంపెనీ 450గ్రాములకు రూ.1830 నిర్ణయించినప్పుడు, ఈ చట్టాన్ని వినియోగించి రాష్ట్ర ప్రభుత్వం రూ.750కి అమ్మించింది. చట్టం ఉండడం వల్ల ఎంత పెద్ద కార్పొరేట్‌ సంస్థ అయినా ఏమి చేయలేక పోయింది. నేడు ఆహార ధాన్యాలు కొరతలు సృష్టించి బ్లాక్‌ మార్కెట్‌ చేయటానికి ప్రభుత్వం తెస్తున్న ఆర్డినేన్స్‌ బాగా ఉపయోగపడు తుంది. ఇది వినియోగ దారులకే కాక ఉత్పత్తి చేస్తున్న రైతులకు కూడా తీవ్ర నష్టం కలిగిస్తుంది. రైతుల దగ్గర కనీస మద్దతు ధరలకు తక్కువకు కొనుగోలు చేసి, అతి ఎక్కువ ధరలకు వినియోగదారులకు అమ్ముకోటానికి వీలు కలుగుతుంది. ప్రస్తుతం పప్పులు మార్కెట్‌లో కిలో రూ.120 అమ్ముతున్నారు. క్వింటాలు కందుల నుంచి 80 కిలోల పప్పు వస్తుంది. అనగా 80 కిలోలకు రూ.10,000 ఆదాయం వస్తుంది. కందులు క్వింటాలుకు రూ.5,800 మద్దతు ధరకు కొనుగోలు చేసినప్పటికీ 45శాతం లాభం వస్తుంది. అందువల్ల నిత్యావసర సరుకుల చట్టం బ్లాక్‌ మార్కెటీర్లను కంట్రోల్‌ చేయటానికి ఇంతకాలం ఉపయోగ పడింది. దాన్ని తొలగించడమంటే గుత్తా పెట్టుబడి దారులకు లాభాలు కల్పించడమే.

బీజేపీ ప్రభుత్వం ఒకే దేశం – ఒకే భాష – ఒకే విద్యుత్‌చ్ఛక్తి బోర్డు- ఒకే మార్కెట్‌ పేరుతో రాష్ట్రాల హక్కులన్నింటిని కాజేయటానికి ప్రయత్నాలు చేస్తున్నది. రాజ్యాంగం ప్రకారం కనీస మద్దతు ధరలు నిర్ణయించడం, వాటిని అమలు చేయడం, వాటి వినియోగదారులకు సరఫరా చేయడం రాష్ట్రాల బాధ్యత. ఎగుమతి, దిగుమతులు మాత్రమే కేంద్రం బాధ్యతగా ఉన్నాయి. కానీ రాష్ట్రాల హక్కులను హరించి వేయటమే కాక రైతులను, వినియోగదారులను ఆర్థికంగా దివాళ తీయించి కార్పొరేట్‌ సంస్థలకు లాభాలు కట్టబెట్ట టానికే కేంద్ర క్యాబినెట్‌ చేసిన నిర్ణయాలు దోహద పడతాయి. పైగా పార్లమెంట్‌ లేనప్పుడు ఆర్డినెన్సు లు తెస్తామని బెదరించడం మరో దుర్మార్గం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజల ప్రయోజనా లను కాంక్షించి క్యాబినేట్‌ చేసిన తీర్మాణాలను ఉప సంహరించుకోవడం మంచిది.

సారంపల్లి మల్లారెడ్డి

Courtesy Nava Telangana