• అసలేం జరుగుతోంది.. గవర్నర్‌ ఆరా
  • 48 వేల మందిని తీసేసినట్లు ఎలాచెప్తారు?
  • హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నారా?
  • మంత్రి పువ్వాడ అజయ్‌కు తమిళిసై ఫోన్‌
  • రవాణా ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మను పిలిపించి సమీక్ష
హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మె పదమూడు రోజులుగా కొల్కిరాని నేపథ్యంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రంగంలోకి దిగారు. ‘అసలేం జరుగుతోంది’ అంటూ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌కు ఫోన్‌ చేసి ఆరా తీశారు. సమ్మె తీవ్రత, సెల్ఫ్‌ డిస్మిస్‌ పేరుతో కార్మికుల తొలగింపు వంటి అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. కార్మిక చట్టాల్లో ‘సెల్ఫ్‌ డిస్మిస్‌’ అనే పదం ఉందా? అని ఆమె ప్రశ్నించినట్లు సమాచారం. ఆ పదం లేకుండా కొలువుల నుంచి 48 వేల మంది కార్మికులు తొలగిపోయినట్లు ఎలా చెబుతారని నిలదీసినట్లు తెలిసింది. ఆర్టీసీ జేఏసీతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు ఇప్పటికే పలు దఫాలుగా గవర్నర్‌ను కలిసి సమ్మె గురించి నివేదించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే సమ్మె జరుగుతోందని ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లిన గవర్నర్‌… సుమారు 40 నిమిషాల పాటు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. టీఎ్‌సఆర్టీసీ సమ్మె తీవ్రత, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయనకు వివరించారు. ఆ తర్వాత రాష్ట్రానికి తిరిగి వచ్చిన ఆమెతో బీజేపీ రాష్ట్ర నాయకులు మరోసారి భేటీ అయ్యారు. మరుసటి రోజే (గురువారం) ఆమె ఆర్టీసీ సమ్మెపై రంగంలోకి దిగారు. కార్మికులతో చర్చలు జరపాలని, పూర్తిస్థాయి ఎండీని నియమించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల అమలు ఎంతవరకు వచ్చింది? కార్మికులతో చర్చలు జరపడానికి, ప్రజారవాణా వ్యవస్థను మాములు స్థితికి తెచ్చేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారు? అని అజయ్‌కుమార్‌ను ఆమె ఫోన్‌లో ఆరా తీశారు. ప్రజలు ఇబ్బంది పడకుండా బస్సులను నడుపుతున్నామని, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ వచ్చి పూర్తిగా వివరిస్తారని ఆయన చెప్పారు. అనంతరం సునీల్‌ శర్మను రాజ్‌భవన్‌కు గవర్నర్‌ పిలిపించారు. ఆర్టీసీ సమ్మె వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఆయన్ను గవర్నర్‌ అడిగి తెలుసుకున్నట్లు రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి. ప్రజలకు రవాణా సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం పలు చర్యలు చేపడుతున్నాయని గవర్నర్‌కు సునీల్‌ శర్మ వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9 వేలకు పైగా బస్సులు నడుస్తున్నాయని చెప్పారు. ప్రయాణికుల నుంచి ఎక్కువ ఛార్జీలు వసూలు చేయకుండా టిమ్స్‌ (టికెట్‌ ఇష్యూయింగ్‌ మెషిన్స్‌)ను కూడా ప్రవేశపెట్టామన్నారు. ప్రైవేటు ఉద్యోగులతో బస్సులను నడుపుతున్నందున కొంత మంది చేతివాటాన్ని ప్రదర్శించే అవకాశం ఉందని తెలిపారు. సమ్మెపై పలు పార్టీలు, సంఘాల నుంచి వినతిపత్రాలు వస్తున్నాయని సునీల్‌ శర్మతో గవర్నర్‌ అన్నారు. సమ్మె కారణంగా సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. ప్రయాణ సదుపాయాలు మెరుగుపడేలా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కోరారు. భేటీ అనంతరం సునీల్‌ శర్మ ప్రగతి భవన్‌కు వెళ్లారు. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సమీక్షలో పాల్గొన్నారు.
Courtesy andhra Jyothy